ఈ రాత్రికి మద్రాస్ వెళుతున్నాను. ఏర్పాట్లు చెయ్యి" అని అన్నాడు.

    ఏదో అడగబోయాడు గానీ తనకెందుకని తల ఊపి కేశవులు వెళ్ళిపోయాడు.

                                       *    *    *

    తెల్లవారింది. తూర్పుదిక్కు రక్తవర్ణం దాల్చి క్రమక్రమంగా ధవళిమ వెదజల్లింది. ఆ సమయంలో బాగా మడతలు నలిగిన దుస్తులతో, చిరాకుగా కనిపిస్తున్న ఓ యువకుడు మద్రాసులో ఓ పెద్దయింటి గేటుముందు తచ్చాడుతున్నాడు. ఇంతలో లోపలినుండి కుక్క మొరిగింది. ఇంజనీరుగారు దాన్ని తీసుకుని వసారాలోనుంచి ప్రక్కనే వున్న గదిలోకి వెళ్ళబోతూ గేటు అవతలకు ఆశ్చర్యంగా చూశాడు. ఆ యువకుడు ఇహ తప్పనిసరిగా లోపలకు నడిచాడు, ఆయనకు అభిముఖంగా. 

    "ఎప్పుడు వచ్చారు?" అనడిగారు ఇంజనీరుగారు.

    "ఇంతకుముందే."

    "అలా వున్నారేం?"

    దీనికి రవి జవాబు ఇచ్చేలోపునే ఆయన ముఖంనిండా గంభీరత నింపుకుని "అలాగా! సరేసరే, నాకేం తెలియదు" అంటూ అక్కడినుండి చకచక నడిచి వెళ్ళిపోయాడు.

    "అంటే?"

    "నేనేం చెప్పగలను?" అని వెనుదిరిగి "వీలయితే అమ్మాయినడగండి. లేకపోతే వెనక్కి వెళ్ళండి" అని మళ్ళీ కంఠం సర్దుకుని తొట్రుపాటుతో "పోనీ వెళ్ళకండి, మధ్య నాదేముంది?" అని అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు.

    రవి అవమానం పొంది నిలబడ్డాడు. అతనికేమీ పాలుపోలేదు. ఈయనకు గానీ పిచ్చి ఎత్తలేదుగదా అనుకున్నాడు. శశి ఇంట్లో ఉన్నదో లేదో తెలియదు. కృతనిశ్చయుడై ముందుగదిలోకి వెళ్ళి సోఫాలో కూర్చుని తీవ్రయోచనలో నిమగ్నుడయ్యాడు.

    బాహ్యస్మృతిని మరచి కూర్చున్న అతనికి ఎంతసేపు గడిచిందోగానీ తర్వాత "వచ్చావా?" అని ఓ మృదుస్వరం వినబడి , అదిరిపడి తల ఎత్తి చూశాడు. కానీ అందులో ఏదో వెటకారం ధ్వనించినట్లే వుంది.  

    శశి ఇంకా స్నానంచేసినట్లు లేదు. చిరుగాలికి రేగి ముందుకు తూగుతున్న ముంగురులు శోకానికి శోభనుకలిగిస్తాయా? అతను తనవంక తీక్షణంగా చూసేసరికి పరువబడిపోతున్న భావ సముదాయాన్ని పదిలపరచి "చిరకాల దర్శనం, అకాల సందర్శనం- మాయ" అంది.

    రవి అవమాన వివశుడైనాడు. "తెలివితేటలు చాలించి, మర్యాదగా మాట్లాడుకుందాం. నాకీరకం సత్కారం ఎందుకు జరిగిందో చెప్పు ముందు?" అన్నాడు.

    "ముందు కాఫీ తీసుకురానీ!" అని శశి చకచకా లోపలికి పోబోయింది.

    "ఆగు, కారణం చెప్పందే కదలటానికి వీలులేదు."

    "ఏముందయ్యా చెప్పేటందుకు?" అంటూ ఆమె గిర్రున వెనుదిరిగింది. వెనుకటి మాధుర్యం, మార్దవం రెండూ నశించాయి. ఈ సమయంలో కంఠంలోనూ, ఆకృతిలోనూ కూడా పైగా వసివాడిన పుష్పంలా వెలవెలనూపోయింది.

    "నా నుంచి చెప్పేటందుకు ఏమీలేదు. బహుకాలానికి నిన్ను కలుసుకున్నాను. నీనుంచి చాలా విషయాలు ఆలకించేందుకు సంపూర్ణ కుతుహల చిత్తనై వున్నాను" అంటూ వచ్చి దగ్గరలో కూర్చుంది.

    "మొగవాడి దౌర్భల్యం బయటపడే సమయంలో స్త్రీ కౌతుకం చూపిస్తుంది ఏం?"

    "ఏమో!"

    "అయితే నువ్వు రవి అనే వ్యక్తిని కొంచెమైనా అర్ధంచేసుకుని వుండలేదు. లేకపోతే ఈ మాత్రం మాట్లాడటానికి జన్మలో సాహసించి వుండేదానివి కాదు. అంత అహంకారం కూడదు. కారణం ఏదయినా కానీ...."

    "దురహంకారివి నీవు" అని శశి కోపంతోనూ, దుఃఖంతోనూ అరిచింది.

    "శశీ!" అన్నాడు రవి తృళ్ళిపడి.

    ఆమె గొంతెత్తి ఏదో అరవబోయింది. కానీ మాటలు రాలేదు. నిశ్చేష్టురాలై అతనివంక చూస్తూ, ఉన్మాదినిలా వుండిపోయింది. జంకిపోయింది.తాను చేసిన పనికి తనలో తాను కుచించుకుపోయింది. తారుణ్యం, తారళ్యం ఎలానో తిరిగి అవతరించాయి ఆమె ముఖంలో.

    రవి ఇది గమనించాడు. "ఎందుకలా ప్రవర్తించావు?" అనడిగాడు లాలనగా, కోపం చంపుకుని.

    "ఇందులో నా తప్పేమీ లేదు" అని శశి తల వంచుకుని నిర్లిప్తతతో పలికింది.

    "అయితే తప్పేదేమీ కూడా లేదనుకుంటాను మన సంఘర్షణలో. కానియ్యి..." అని రవి వెంటనే కృద్ధుడై పలికాడు.

    ఆమె ఉలికిపాటుతో అతన్ని గమనించింది. 'నాకేం బాగుండలేదు. అలా పోయివద్దాం వస్తావా? కారులో."

    "సరే పద" అంటూ రవి లేచాడు.

    ఆమె దుస్తులేమీ మార్చుకోలేదు. ఇద్దరూ బయటకు వచ్చారు. శశి డ్రైవు చేస్తోంది. కొంతదూరం పోయాక అతడామెవంక ఉదాసీనంగా చూశాడు శశి నవ్వింది.

    "ఎందుకు నవ్వుతున్నావు? ఇద్దరిలో పిచ్చివాళ్ళమెవరిమనా?"

    ఆమె పూర్తిగా రోడ్డుమీదనే దృష్టినిలిపి "ఏమో! నన్ను నేను తెలుసుకోలేని స్థితిలో వున్నానివాళ. నీకు బాగా కోపంవచ్చింది కదూ?"

    "నేనూ నీవలెనే వున్నానని ఎందుకు భావించరాదు?"

    శశి మౌనం వహించింది. కారు వేగంగా సముద్రతీరం ప్రక్కనుంచి పోతోంది. రవి అన్నాడు -" మనం ఇప్పటినుంచే కీచులాడుకోవటం ప్రారంభించాం. ఎవరన్నా విన్నా నవ్వుతారు. పోనీ ఇది శుభసూచకం అని ఇద్దరం అంగీకరిద్దామా?"

    కానీ ఈ మాటలు వినిపించుకున్నట్లు లేదు. "ఏదో ఉల్లాసకరమైన ఊహలతో, అనిర్వచనీయమైన ఆనందంతో ఇన్నాళ్ళూ రోజులు దొర్లించాను. ఈమధ్య ఘాతం ఒకటి తగిలి కృంగదీసింది. అది నిన్ను అడగనా వద్దా? అని సందేహిస్తున్నాను.

    "ఏమిటి?" అన్నాడు రవి. ఇది ఏదో ఉపద్రవానికే దారి తీస్తోందని అనుమానిస్తూ.

    "నీకు కోపం వస్తుందిలే, చెప్పను."

    "చెప్పలేకపోతే నా కోపానికి పట్టపగ్గాలుండవని నీకు తెలియదు కాబోలు!"