మోకాళ్ల నొప్పి తగ్గాలంటే ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి..!

కీళ్ల నొప్పులు ఒకప్పుడు వయసు పై బడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ నేటికాలంలో 30 ఏళ్ల వయసు గల వారిలో కూడా కీళ్ల నొప్పుల సమస్య కనిపిస్తోంది. ఈ కీళ్ల నొప్పులే చాలామందిలో మోకాళ్ల నొప్పులుగా పరిగణిస్తారు. చాలామంది కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం కోసం మందుల మీద ఆధారపడతారు. అయితే ఏ మందులు అయినా దీర్ఘకాలం వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే మోకాళ్ల నొప్పికి యోగా మంచి పరిష్కారం అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు, యోగా గురువులు. క్రమం తప్పకుండా కొన్ని యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తుంటే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మంత్రించినట్టు మెల్లిగా తగ్గిపోతాయి. ఇంతకీ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడానికి ఏ ఆసనాలు ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుంటే..
తాడాసనం..
ఈ ఆసనాన్ని సాధన చేయడానికి, నిటారుగా నిలబడి రెండు చేతులను తల పైకి ఎత్తండి. మీ శరీరం మొత్తాన్ని సాగదీసి, 10-15 సెకన్ల పాటు అలాగే ఉండండి. తాడాసనం సాధన చేయడం వల్ల బాలెన్సింగ్, మోకాళ్ల బలం మెరుగుపడతాయి.
వజ్రాసనం..
ఈ ఆసనాన్ని సాధన చేయడానికి, మీ మోకాళ్లపై కూర్చోండి. ఇప్పుడు మీ వీపును నిటారుగా ఉంచి, మీ మడమల మీద కూర్చోండి. ఈ ఆసనంలో కొన్ని క్షణాల పాటు ఉండండి. వజ్రాసనం సాధన చేయడం వల్ల కీళ్లలో పట్టుత్వం పెరుగుతుంది.
భుజంగాసనం..
ఈ ఆసనాన్ని సాధన చేయడానికి, మీ పొట్టపై పడుకుని, మీ చేతులతో మీ శరీర పై భాగాన్ని పైకి లేపండి. ఈ స్థితిలో కొన్ని క్షణాల పాటు ఉండండి. భుజంగాసనం కండరాల బలాన్ని పెంచుతుంది.
సేతు బంధాసనం..
సేతుబంధాసనంలో శరీర భంగిమ వంతెనను పోలి ఉంటుంది. సాధన చేయడానికి మీ వీపుపై పడుకోండి. మీ మోకాళ్లను వంచి, తుంటిని పైకి లేపండి. సేతుబంధాసనం మోకాళ్లను, తొడలను బలపరుస్తుంది.
బాలాసనం..
బాలాసనం వేయడానికి, మోకాళ్లపై కూర్చొని, ముందుకు వంగి, నుదుటిని నేలపై ఆనించండి. ఈ భంగిమ నొప్పి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎప్పుడైనా డిప్రెషన్ గా లేదా కోపం, బావోద్వేగాలు ఎక్కువగా అనిపించినప్పుడు ఈ ఆసనంలో కొద్దిసేపు గడపడం వల్ల మనసు శాంతిస్తుంది.
*రూపశ్రీ.


