మహిళలు రోజూ ఇవి ఫాలో అయితే అద్భుతమైన ఫిట్నెస్ సొంతమవుతుంది!

ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుందని అంటారు. కానీ దురదృష్టవశాత్తు మహిళలే ఇంట్లో అందరికంటే పేలవమైన ఆరోగ్యాన్ని కలిగున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఉరుకులు పరుగుల నీద సాగిపోతుంది సగటు మహిళ జీవితం. పిల్లలు, భర్త, అత్తమామలు వీరికి కావల్సినవి సమకూర్చి పెట్టడంలో సగటు మహిళ తనని తాను పట్టించుకోదు. 

మరీ ముఖ్యంగా ఇప్పటి కాలంలో మహిళలు చాలా వరకు ఉద్యోగాలు చేసేవారే. ఇంటి పనులకు తోడు ఉద్యోగాలు మహిళలను తొందరగా అలసిపోయేలా చేస్తాయి. అందుకే మహిళలు ఆరోగ్యపరంగా దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. రోజంతా పనిచేస్తూనే ఉన్నాం కదా ఇదే పెద్ద వ్యాయామం అనుకునేవారు తమ ఆలోచనలను మార్చుకోవాలి. రోజంతా చేసే పనులలో శరీరంలో శక్తి మొత్తం తగ్గిపోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం ప్రతి ఒక్కరికీ ముఖ్యం. కేవలం ఆహారం ద్వారా లభించేది శక్తి అనిపించుకోదు.  దీనికోసం శరీరానికి శక్తి కూడదీసుకునే వ్యాయామాలు, యోగా అవసరం. ఈ కింది వాటిని రోజులో భాగం చేసుకుంటే శారీరకంగా ఫిట్ గా ఉండొచ్చు.

యోగ భారతీయులకు అందిన గొప్ప ఐశ్వర్యం అని చెప్పవచ్చు. యోగా సాధన కోసం కనీసం 30-45 నిమిషాలు,  వారానికి కనీసం 3 సార్లు కేటాయించడం ద్వారా అద్భుతం జరుగుతుంది. ఉదయాన్నే చేసే యోగ చాలా అనువైనది. యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన అభ్యాసాలతో రోజును ప్రారంభించడం ద్వారా మిగిలిన రోజంతా ఉల్లాసంగా గడిచిపోతుంది. శక్తి తిరిగి పుంజుకుంటుంది.   ఇందుకోసం సూర్య నమస్కారాలు బెస్ట్ ఆప్షన్.

సూర్య నమస్కారంలో మొత్తం 8 ఆసనాలు ఉంటాయి. కుడి, ఎడమకు వైపులు కలిపి మొత్తం  12 దశలతో ఇది ఉంటుంది. . సూర్య నమస్కారాన్ని ప్రారంభించినప్పుడు, కుడి వైపు నుండి ప్రారంభించాలి, ఎందుకంటే సూర్యుని శక్తి ఈ వైపు ద్వారా ప్రతీకాత్మకంగా సూచించబడుతుంది, అయితే చంద్రుడు ఎడమ వైపున ప్రాతినిధ్యం వహిస్తాడు. రెండు వైపులా కవర్ చేసినప్పుడు ఒక చక్రం పూర్తవుతుంది. ఇది 24 గణనలతో తయారు చేయబడి ఉంటుంది. 

సూర్య నమస్కారంలో ఇమిడిపోయిన ఆసనాలు..

ప్రాణం ఆసనం 

హస్త ఉతానాసన 

పాదహస్తాసనం 

అశ్వ సంచలనాసన 

సంతోలనాసనం 

అష్టాంగ నమస్కార ఆసనం 

భుజంగాసనం

అధో ముఖ స్వనాసన 

అశ్వ సంచలనాసన 

పాదహస్తాసనం 

హస్త ఉతానాసనం

ప్రాణం ఆసనం 

ఇవన్నీ వేస్తే ఒక చక్రం పూర్తవుతుంది. ఇలాంటివి 11 చక్రాలు ప్రతిరోజూ చేస్తుంటే శరీరం చాలా దృడం అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా విశ్రాంతి స్థితిలో ప్రాణాయామం, కపాల బాతి వంటివి రోజులో కొన్ని నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలో జరిగే అద్భుతం చూసి ఎవరికి వారు ఆశ్చర్యపోవాల్సిందే..

                                    ◆నిశ్శబ్ద.