జుట్టుకు ఆలివ్ ఆయిల్ వాడితే ఏం జరుగుతుందో తెలుసా...

 

జుట్టుకు నూనె పెట్టడం కేశ సంరక్షణలో ప్రధాన భాగం.  జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.  తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.  జుట్టుకు కావలసినంత తేమ అంది..  జుట్టు మృదువుగా మారుతుంది. తల చర్మ సమస్యలు అయిన చుండ్రు,  తలలో పుండ్లు,  జుట్టు రంగు మారడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి.  అయితే జుట్టుకు అప్లై చేసే నూనెలను బట్టి ఫలితాలు  విభిన్నంగా ఉంటాయి. చాలామంది ఆలివ్ ఆయిల్ ను తలకు రాసుకోమని చెబుతుంటారు.  అసలు ఆలివ్ ఆయిల్ ను తలకు వాడవచ్చా? ఆలివ్ ఆయిల్ ను తలకు అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

పోషకాలు..

ఆలివ్ ఆయిల్ లో పోషకాలు సమృద్దిగా ఉంటాయి.  ఇందులో విటమిన్-ఇ, కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి జుట్టుకు పోషణను ఇస్తాయి. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తాయి.  జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.  ఇది చుండ్రు సమస్యకు చెక్ పెట్టడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.  చుండ్రుకు కారణం అయ్యే ఫంగస్ ను తొలగించడంలో సహాయపడుతుంది.  చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ గా కేశ సంరక్షణలో వాడటం మంచిది.

ఆలివ్ ఆయిల్ జుట్టుకు లోతుగా తేమను అందిస్తుంది. దీని వల్ల జుట్టు పొడిబారడం,  విరిగిపోవడం వంటి సమస్యలు రాకుడా చేస్తుంది.  దీని వల్ల జుట్టు ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.

కొన్ని రకాల నూనెలు రక్త  ప్రసరణను పెంచడంలో బాగా సహాయపడతాయి.  అలాంటి నూనెలలో ఆలివ్ నూనె కూడా ఒకటి. ఇది తలలో రక్తప్రసరణను పెంచుతుంది.   ఈ కారణంగా ఆలివ్ నూనె వాడేవారిలో  జుట్టు పెరుగుదల బాగా వేగంగా ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ ను తలకు నేరుగా అప్లై చేయడమే కాదు.. దీన్ని ఇతర హెయిర్ కేర్ పద్దతులలో కూడా వాడవచ్చు.  ముఖ్యంగా జుట్టుకు ఎంతో మేలు చేసే గుడ్డుతో  ఆలివ్ నూనె మంచి కాంబినేషన్. గుడ్డు లేదా తేనె లేదా పెరుగుతో ఆలివ్ నూనెను మిక్స్ చేసి హెయిర్ మాస్క్ గా ఉపయోగించవచ్చు.  ఇది జుట్టుకు మంచి పోషణను చాలా లోతుగా అందిస్తుంది.

జుట్టును దెబ్బ తీయడంలో సూర్యుని కాంతి చాలా కీలకమైనది. సూర్య కాంతి చాలా విపరీతంగా ఉన్నప్పుడు..  ఆ కాంతి కారణంగా జుట్టు దెబ్బితింటుంది. అయితే ఆలివ్ నూనెను జుట్టుకు రాసుకుంటే ఈ సూర్యుని అతినీల లోహిత కిరణాల నుండి జుట్టును కాపాడుకోవచ్చు.

                               *రూపశ్రీ.