బ్యూటీ క్రీములు కాదండోయ్.. ఈ అయిదు తింటే నిత్యయవ్వనంగా ఉంటారు!
ఆహారమే ఆరోగ్యం అని అంటారు. కానీ చాలామంది జిహ్వచాపల్యం కోసం ఆహారాన్ని తీసుకుంటారు. దీనికారణంగా శరీరం తొందరగా వృద్దాప్యం బారన పడుతుంది. చాలామంది చిన్నవయసులోనే అంకుల్స్, ఆంటీలుగా కనబడటానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఇలా చిన్న వయసులోనే వృద్దాప్యం అటాక్ చేయడం వల్ల చాలామంది బ్యూటీ ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. ఫలానా క్రీము రాసుకుంటే చర్మం మీద ముడతలు పోతాయని, ఫలానావి వాడితే చర్మం తెల్లగా మారుతుందని, మచ్చలు లేని ముఖ సౌందర్యం సొంతమవుతుందని.. ఇలా రకాలుగానే ప్రజలను ఆకర్షిస్తారు. కానీ ఇలా చిన్నవయసులోనే పెద్దవాళ్లుగా కనిపించడానికి కారణం కొల్లాజెన్ లోపించడం. కొల్లాజెన్ తిరిగి భర్తీ కావడానికి కొన్ని ఆహారాలున్నాయి. బ్యూటీ ప్రోడక్ట్స్, క్రీములు వంటివి ఓ పక్కన పెట్టేసి కింద చెప్పుకున్న ఆహారాలు తీసుకుంటే చాలు.. కొద్దిరోజుల్లోనే తిరిగి యవ్వనంగా కనిపిస్తారు.
అసలు కొల్లాజెన్ అంటే ఏంటి?
కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. శరీరం 30శాతం కొల్లాజెన్ తోనే రూపొందించబడి ఉంటుంది. ఇది చర్మం, కండరాలు, ఎముకలు బలంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ విచ్చిన్నమవుతూ ఉంటుంది. శరీరంలో కొత్త కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యే ప్రక్రియ కూడా తగ్గుతుంది. అందుకే కొల్లాజెన్ ఉత్పత్తి చేసే ఆహారాన్ని తినాలి.
అశ్వగంధ..
అశ్వగంధ ఆయుర్వేదంలో గొప్ప మూలిక. దీన్ని తీసుకోవడం వల్ల వృద్దాప్య లక్షణాలను నివారించవచ్చు.
ఉసిరి..
ఉసిరి విటమిన్-సి కి గొప్ప నిధి లాంటిది. ఉసిరిలోని విటమిన్-సి కొల్లాజన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. చిన్నవయసులోనే వృద్దాప్యం రావడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
తులసి..
తులసిలో ఉర్సోలిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్, యూజినాల్ వంటి గొప్ప యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి చర్మాన్ని రక్షిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
నెయ్యి..
నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతారని చాలామంది అవాయిడ్ చేస్తారు. కానీ నెయ్యిలో విటమిన్-ఎ,డి, ఇ పుష్కలంగా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పక అవసరం. విటమిన్-ఎ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచే విటమిన్. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా చిన్నవయసులోనే వృద్దాప్యాన్ని నివారిస్తుంది.
సరస్వతి..
సరస్వతి ఆయుర్వేద మూలిక. దీన్నే బ్రాహ్మీ అని కూడా అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఇందులో ఉంటాయి. శరీరంలో కొత్త కణాలను, కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ప్రసవం తరువాత మహిళలలో స్కిన్ పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్కులను కూడా తేలికగా తొలగించడానికి ఉపయోగపుడుతుంది.
*నిశ్శబ్ద.