అతను చిన్నగా నవ్వి-
    
    "నిన్న మీరు బస్ ఎక్కేటప్పుడు బుక్ లోంచి జారిపడిపోవడం చూసి తీసి దాచాను మీరు వస్తే ఇచ్చేద్దామని కాసేపు వెయిట్ చేసాను కూడా" అన్నాడు.
    
    వార్డెన్ వెంటనే- "అసలు పాస్ పోయిన సంగతి నువ్వు గమనించనే లేదనుకుంటాను అంత నిర్లక్ష్యం అయితే ఎలా? నెలంతా నడిచి వెళ్ళేదానివి" అరిచినట్లుగా అడిగింది.

    చాయ పెదవిని మునిపంట బిగబట్టి ఆవిడవంక సూటిగా చూసింది.
    
    "నెలంతా నడిచి వెళ్ళేదానివి" అన్నమాట ఆమెకి చాలా చిన్నతనంగా అన్పించింది.
    
    అతనిముందు తనమీద అరుస్తున్న వార్డెన్ ని గొంతునులిమి చంపేయాలి అనిపించింది కూడా.
    
    కానీ ఏమీ చెయ్యలేక అసహనంగా చూస్తూ నిలబడింది.
    
    మనసులో మాత్రం నన్ను పాస్ చూపించమని అడిగే కండక్టర్ ఈ రూట్ లోనే కాదు ఈ స్టేట్ లోనే లేడు అనుకుంది.
    
    "ఇదుగోండి పాస్" అతను ఆమెకి అందించాడు.
    
    చాయ తన చేయి జాపి జాగ్రత్తగా దాని కొస పట్టుకుని అతని వేళ్ళు ఏమాత్రం తనకి తగలకుండా పాస్ అందుకుని- "థాంక్స్" అంది.
    
    "నో మెన్షన్" ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ" అతను నవ్వుతూ అన్నాడు.
    
    వార్డెన్ కి మాత్రం ఈ సంఘటన ఏమాత్రం ప్లెజర్ కలిగించనట్లు ధుమధుమ లాడుతూ- "కాలేజీకి టైమవుతోంది త్వరగా మెస్ కి వెళ్ళు" అని అరిచింది.
    
    "అవును ఇంకో పదినిమిషాల్లో బస్టాప్ లో వుండాలి నేను" అని చాయ అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయింది.
    
    వెళ్ళిపోయేటప్పుడు ఆఫీస్ రూం ముందు ఆగివున్న కారుని చేతితో తడిమి మరీ వెళ్ళిపోయింది.
    
    అతను చేతులు జోడించి- "వెళ్లొస్తాను మేడమ్" అన్నాడు వార్డెన్ తో.
    
    "వెళ్ళండి మళ్ళీ రావడం మాత్రం కుదరదు అది మా నిబంధనలకి వ్యతిరేకం" కటువుగా అందామె.
    
    అతను చిన్నగా నవ్వి- "మీ పేరు తెలుసుకోవచ్చా మేడమ్?" అన్నాడు.
    
    "దయామణి" కఠినంగా అంది.
    
    "అచ్చం పేరుకు తగ్గ ముఖం. ఆ ముఖాన్ని చూడటానికి రోజూ రావాలనిపిస్తోంది. కానీ వద్దన్నారుగా రానులెండి" కాస్త బాధగా అన్నాడు అతను.
    
    దాయామణి కాస్త మెత్తబడి- "చూడు బాబూ! ఇది ఆడపిల్లలుండే హాస్టలు నువ్వు గొప్ప మనసుతో ఆ పిల్ల అడ్రస్ చూసి పాస్ పట్టుకుని రావడం చూస్తే మంచివాడివని తెలుస్తూనే వుంది. కానీ నువ్విలా లోపలకు రావడం మాత్రం రూల్స్ కి వ్యతిరేకం, పైనుంచి మాకు మాటొస్తుంది" అంది.
    
    "మీ బంధువులకి కూడా ఆ రూల్ వర్తిస్తుందా?" అడిగాడతను.
    
    ఆ మాటలకూ దయామణికి ముఖం కళ తప్పింది.
    
    "బంధువులా! అలాంటివాళ్ళు నాకెవరూ లేరు" బాధగా అంది.
    
    "అలా అనకండి. ఇప్పట్నుంచి మీకో తమ్ముడున్నాడనుకోండి. మిమ్మల్ని చూడ్డానికి అప్పుడప్పుడు రావచ్చా సిస్టర్?" ఆత్రంగా అడిగాడతను.
    
    దయామణి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళూరాయి!
    
    "తమ్ముడా?" అంది.
    
    "ఏం? నన్ను తమ్ముడిగా ఏక్సెప్ట్ చేయలేరా? పోనీలెండి. ఏదో మిమ్మల్ని చూడగానే నా చిన్నప్పుడు చనిపోయిన మా అక్క గుర్తొచ్చింది. అందుకే అలా అన్నాను" అన్నాడు.
    
    "అయ్యో! అదికాదు బాబూ! నాకో తమ్ముడు దొరకడం నాకు మాత్రం సంతోషం కాదూ! ఇంతకీ మీ అక్క ఎలా పోయింది?" కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటూ అడిగిందామె.
    
    "ప్రేమించినవాడితో పెళ్ళి జరగలేదని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది" అన్నాడు.
    
    "భగవాన్" బాధగా అంది దయామణి.
    
    "అనవసరంగా మీ మనసు పాడుచేస్తున్నాననుకుంటా. వెళ్ళొస్తాను మేడమ్" అన్నాడతను వాచీ చూసుకుంటూ.
    
    "మేడమ్ కాదు అక్కా అను బాబూ" అంది.
    
    "అలాగే వెళ్ళొస్తానక్కా" అన్నాడు.
    
    "కాఫీ తాగి వెళ్ళు బాబూ" అని ఆమె బాయ్ కోసం బెల్ నొక్కబోయింది.
    
    అతను కంగారుగా- "ఒద్దొద్దు ఇప్పుడు కాదు టైంలేదు, మరోసారి వస్తాను" అంటూ లేచాడు.
    
    'మరో పది నిముషాల్లో బస్టాప్ లో వుండాలి' అన్న చాయ మాట తనకి హింట్ అని అతనికి తెలిసింది.
    
    "ఫర్వాలేదు కూర్చో బాబూ! ఇంతకీ మీ అక్క పెళ్ళికి మీవాళ్ళు ఒప్పుకోలేదా? లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళా?" ఆమె కుతూహలంగా ప్రశ్నలు మొదలుపెట్టింది.
    
    "చచ్చాంరా బాబూ! లేని అక్కని సృష్టించి ఆమెకో ప్రేమకథ అల్లడమే కాకుండా చంపేసాను కూడా. ఇప్పుడు అందుకు కారణాలు చెప్పమంటోంది ఈ ముసల్ది. ఇక్కడ కూర్చుని ప్రేమకథలు అల్లడానికా తను వచ్చింది? తన జగన్మోహినితో పరిచయం కోసం కానీ" అనుకున్నాడు. పైకిమాత్రం- "ఇంకోసారి వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెప్తాను సిస్టర్! ఇప్పటికే చాలా ఆలస్యమయింది- నమస్తే" అన్నాడు.
    
    ఆమె అంగీకారంగా తలూపింది.
    
    అతను హడావుడిగా వెళుతుండగా- "బాబూ ఒక్కమాట" అని అరిచింది.
    
    అతనికి చిరాకేసినా అణుచుకుని- "ఏమిటీ" అన్నాడు.
    
    "ఆదివారం ఉదయం పన్నెండువరకు విజిటర్స్ ని ఎలౌ చేస్తాం" అంది.
    
    అతని ముఖం వెలిగిపోయింది.
    
    "అలాగే సన్ డేస్ వస్తూ వుంటాను సిస్టర్" అన్నాడు.
    
    అతను హుషారుగా విజిల్ వేస్తూ కారు స్టార్ట్ చేస్తూ వుండగా-
    
    "బాబూ మరో మాట" అంది.
    
    "మళ్ళీ ఏమిటి?" ఈసారి కాస్త విసుగ్గానే అడిగాడు.
    
    "నీ పేరు చెప్పనేలేదు" అందామె.
    
    "ఓ! సారీ....నాపేరు కిరణ్" అన్నాడు.
    
                                              * * *
    
    "ఎలా వుంది నా పేరు బావుందా?" అడిగాడు చాయతో కిరణ్.
    
    అతని మాటలు చాయ వినలేదు.
    
    ఆమెకి అలా కారులో కూర్చుని రోడ్ మీద వెళ్ళేవాళ్ళని చూడ్డం గొప్ప థ్రిల్లింగ్ గా వుంది. అసలే పెద్దవైన కళ్ళు ఇంకా పెద్దవిగా చేసుకుని ఆమె ప్రపంచాన్ని మొదటిసారి చూస్తున్నంత ఆశ్చర్యంగా చూడసాగింది.