అర నిముషంపాటు మౌనంగా వున్న రుత్వి ఆ తర్వాత ఆసక్తిగా తననే గమనిస్తున్న అందర్నీ చూసి చెప్పడం ప్రారంభించాడు.

 

    "మనం పరుగెత్తేటప్పుడు లేదా కారులోగాని మరో వాహనంపై గానీ ప్రయాణించేటప్పుడు అనిపించడమే తప్ప కనిపించని గాలి  సైంటిఫిక్ గా కొంత స్థలాన్ని ఆక్రమించగలదు. దానికి బరువు వుంది... పీడనం వుంటుంది."

 

    క్షణం ఆగాడు.

 

    "అసలు ఈ గాలి అనేది ఒక పదార్దం కాదు. దానిలో అనేక మూలకాలు వున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సయిడ్, నీటి ఆవిరి కాస్త హీలియం, ఆర్గన్ లు అందులో ముఖ్యమైనవి"

 

    రుత్వి చెబుతుంటే ప్రతి వ్యక్తీ ఏకాగ్రతగా వింటున్నాడు ఒక్క ప్రసాదభూపతి తప్ప.

 

    "ఒక వస్తువు మనకి కనిపించాలీ అంటే '4000 A' డిగ్రీలనుండి '8000 A' డిగ్రీలదాకా 'వేవ్ లెంగ్త్' వున్న కాంతి కిరణాలు ఆ వస్తువు మీద పడి పరావర్తనం చెందాలి. అలా చెంది మన కంటిని చేరాలి. అప్పుడే ఆ వస్తువు మనకు కనిపించేది. కాని గాలిలో అణువులు చాలా చిన్నవి. అంటే '2A' డిగ్రీలనుండి '10A' డిగ్రీ మించివుండవు A డిగ్రీ అంటే ఒక మీటరులో వెయ్యికోట్ల వంతు... అలాంటప్పుడు ఆ అణువులు కాంతిని పరావర్తనం చెందించలేవు కాబట్టి గాలి మన కంటికి కాక అది తెలుసుకున్న సైన్సుకి మాత్రమే కనిపిస్తుందన్నది నా థియరీ"

 

     "మార్వలస్"

 

    ముందుగా అభినందించింది రాజేంద్రకుమార్.

 

    విజూష గర్వంగా తండ్రిని చూసింది.


 
    "ఇది  నేను ఒప్పుకోను అని మీరంటే... " ప్రసాదభూపతిని చూస్తూ రుత్వి అన్నాడు "నా దగ్గర ఇంతకుమించి జవాబు లేదు."

 

    "అదికాదు మిస్టర్ రుత్వి....."

 

    ప్రసాదభూపతి ఆత్మీయుడనిపించుకునే రామస్వామి రియాక్ట్ అయ్యాడు.

 

    రామస్వామి అంతగా చదువుకోలేదు.

 

    కాని .....

 

    షిప్పింగ్ టైకూన్ మాత్రమేకాక ట్రాలర్స్ తో చేపలు పట్టివిదేశాలకి ఎగుమతి చేస్తూ కోట్లు సంపాదించాడు.


 
    అహంకారి.

 

    "నీకు తెలిసింది లేదూ ముందుగా నువ్వు ప్రిపేరయి వున్నది ఏదో చెప్పి జనాన్ని మభ్యపెట్టడం చాలా సులువు"

 

    కేవలం తనను అవమానించడాన్ని లేదా మనసు తక్కువ చేయటాన్ని యిష్టపడే యిలా మాటాడుతున్నట్టు అనిపించిన రుత్వి వెంటనే అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయేవాడే.

 

    కాని.....

 

    రుత్వి చేయి పట్టుకుంది విజూష అప్రయత్నంగా.


 
    అది తన తండ్రిని చాలా కలవరపరిచే విషయం అన్న సంగతి ఆమె పట్టించుకోలేదు.

 

    "నువ్వలా వెళ్లిపోతే...."

 

    కోపాన్ని దిగమింగుకుంటూ అంది విజూష -

 

    "పిరికివాడివి అనుకుంటారు మా డాడీ"

 

    మరో దారి లేనట్టు రుత్వి కూర్చుండిపోయాడు.

 

    "వెంటనే" నాకు పనుంది విజూషా" అన్నాడు యిబ్బందిగా.

 

    "వెళుదువుగాని..." గొణుగుతున్నట్టుగా అని వెంటనే  రామస్వామిని చూసింది విజూష.

 

    "పాపం అంకుల్ హర్టవుతారు.. ఆయన్ని కూడా టెస్ట్ చేయనియ్."

 

    "ఎస్" రామస్వామి ఎగతాళిగా నవ్వాడు.

 

    రుత్వికిదంతా అసహనాన్ని కలిగిస్తోంది.

 

    అయినా కోపాన్ని నిబాయించుకున్నాడు.

 

    యుద్దంలోకి అడుగుపెట్టకూడదు.

 

    అడుగుపెట్టాక ఓడాలి లేదూ గెలవాలి.

 

    లేదూ అంటే అది పలాయనం అనిపించుకుంటుంది.

 

    వ్యూహం ఎలాంటిదయినా కానీ ఓడించడానికి ప్రయత్నించడం ముఖ్యం.

 

    "మీరే బిజినెస్ చేస్తుంటారు?" అడిగాడు రుత్వి రామస్వామిని చూస్తూ.

 

    "షిప్పింగ్ టైకూన్" గర్వంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు.

 

    "నేను ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తుంటాను నాకు నాలుగు షిప్పులున్నాయి ఓ ఇరవైదాకా ట్రాలర్స్ వున్నాయి"

 

    "అంటే మీ వ్యాపారం ఎక్కువ నేలమీద కాక సముద్రజలాల మీదే సాగుతూ వుంటుందన్నమాట.

 

    "య్యా"

 

    గేప్ యివ్వలేదు రుత్వి.

 

    "నాకు తెలియని ఓ ప్రశ్నకి జవాబు చెప్పగలిగేది మీరే."

 

    అంతసేపూ చాలా తెలివయిన వాడనిపించుకున్న రుత్వి ఇలా ఓ సందేహాన్ని ప్రకటించడం,  అందులోనూ తనముందు తనను తాను తక్కువచేసి మాటాడుకోవటం రామస్వామికి చాలా ఆనందాన్నిచ్చింది.

 

    "నేను అడిగేది మీ షిప్స్ కి వాటి ప్రయాణానికి సంబంధించింది"

 

    ఈ స్టేట్ మెంట్ మరింత బలాన్నిచ్చిందేమో "అడుగు" అన్నాడు రామస్వామి వుత్సాహంగా.

 

    గట్టిగా నిట్టూర్చిన రుత్వి -

 

    "ఓడల వేగాన్ని 'నాటికల్ మైల్స్' గా కొలుస్తారుగా " అన్నాడు.

 

    "అవును."

 

    "ఒక వాహనం ప్రయాణవేగాన్ని మైల్సులో లేదూ కిలోమీటర్సులో కొలుస్తారు. కాని నాటికల్ మైల్ అంటూ షిప్పు ప్రయాణం గురించి ఎందుకు అంటారు? అసలు ఆ  నాటికల్ అనే పదం ఎలా వచ్చిందో చెప్పండి?"

 

    అదిరిపడ్డాడు రామస్వామి.

 

    సుమారు పదేళ్లుగా ఓడల వ్యాపారంలో వున్నా 'నాటికల్ మైల్' అనేపదం తరచూ వింటున్నా అలా ఎందుకనేది అతడికి తెలీదు.

 

    "అదేదో పెద్ద ప్రశ్నలాగా ఆలోచిస్తావేం రామస్వామీ! చెప్పేయ్" అన్నాడు రాజేంద్రకుమార్.