"సర్వర్! త్రీ నెస్కేఫ్ !" అంటూ ఆర్డరిచ్చింది రాధ.

    "నాకు బాగా చలిగా ఉంది. మీకూ అలాగే ఉందా?" అడిగాడతను.

    రాధ జవాబివ్వకుండా చిన్నగా నవ్వింది.

    ఆమె వరస కొత్త అనిపించింది నాకు. ఆ మోస్తారుగా ఆమె నవ్వటం నేను చూస్తూండగా అదే మొదటిసారి. పైగా సిగ్గుపడుతూంటే ఆమె ముఖం మరింత ముద్దుగా అందంగా తయారయింది.

    "అన్నట్లు, ఈ పాపని నాకు ఇంట్రడ్యూస్ చెయ్యలేదేం?" అడిగాడతను.

    అతని మీద నాకు కోపం వచ్చింది. వయస్సు 'టీన్స్' లో జొరబడిం తర్వాత నాలుగో సంవత్సరమిది. నన్ను 'పాప' అంటాడేమిటి?

    "వెరీ సారీ! మర్చిపోయాను. దిసీజ్ మై కజిన్, భాను అతను అజిత్!" అంటూ మమ్మల్ని పరిచయం చేసింది రాధ.

    "గ్లాడ్ టు సీయూ!" అంటూ చేయి చాపాడతను. మగాడికి షేక్ హాండ్ ఇవ్వటం నాకేమాత్రం ఇష్టం లేదు. కాని, అజిత్ అందరిలాంటి మగాడు కాదు. అతని కళ్ళలోని ఆకర్షణ నన్ను పిచ్చిదాన్ని చేసింది. జీవితమంతా అతని పక్కనే... అతని చేతిలో నా చేయి ఇమిడిపోయింది. మృదువుగా నా చేయి నొక్కి విడిచాడతను. నా శరీరం ఆ కాసేపట్లో, విపరీతమయిన మార్పులు చెందింది. ఆ మార్పులు, వాటి భావాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేను. కాని, అవన్నీ మొదటిసారిగా నాలో కలిగాయి.  

    "నువ్వేం చదువుతున్నావ్?" అడిగాడతను.

    "హెచ్.ఎస్.సి." జవాబిచ్చాను.

    "సినిమా లెక్కువ చూస్తావా?" అడిగాడు.

    "వారాని కోటి!"

    "అయితే, బాగా చదువుతా వన్నమాట! గుడ్!"

    "థాంక్యూ!"

    ముగ్గురం కాపీలు తాగాం.

    అతనే బిల్లు చెల్లించివేశాడు. బయటికొచ్చి రవీంద్రభారతి పక్క నుంచి నడవసాగాం. ఖాళీగా పోతున్న టాక్సీని ఆపాడతను. అందులో టాంక్ బండ్ చేరుకున్నాం. అక్కడ ఓ బెంచీమీద కూలబడ్డాం. నియోన్ లైట్లు అందంగా వెలుగుతున్నాయి. రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకొన్నాడతను. జ్యోతిష్యం చెబుతాడేమో అనుకొన్నాను. ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకొని, "ఇంత అందమయిన చెయ్యి స్వంతమయితే ఎంత బావుంటుందీ!" అన్నాడు కళ్ళు మూసుకొని.

    రాధ కిలకిల నవ్వేసింది. అంత స్వచ్ఛంగా , నిర్మలంగా చాలా తక్కువసార్లు నవ్వింది. నాకు అప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవసాగింది. బహుశా అతనూ, రాధా ప్రేమించుకొని ఉండాలి. కాని, నాకు తెలీకుండా ఎప్పుడు ప్రేమించుకొన్నారో తెలీలేదు. రాధ కాలేజీ, మా హైస్కూలు దగ్గరే కావడం మూలాన ఇద్దరం ఎప్పుడూ కలిసే వెళ్ళి వస్తూండేవాళ్ళం. అలాంటప్పుడు అతనితో పరిచయమెప్పుడయిందో, ఎప్పుడు ప్రేమలో పడ్డారో ఆశ్చర్యంగా ఉంది. 

    ప్రేమ అనగానే ఛటుక్కున రెండేళ్ళక్రితం జరిగిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది. నాకు. హసన్ అనే కళ్ళజోడబ్బాయి అప్పుడు రాధని ప్రేమించాడు. అతనిదీ రాధ క్లాసే! క్రికెట్ అద్భుతంగా ఆడేవాడతను. రాధకు క్రికెట్ అంటే అప్పట్లో ప్రాణం అందుచేత అతన్నీ ప్రాణంగా చూసింది. అతను అడగ్గానే అతని మీదున్న సదభిప్రాయం కొద్దీ అతనితో సినిమాలకి వెళ్లింది.

    "అతన్ని పెళ్ళి చేసుకొంటావా?" అని నేనడిగితే- "అతనితో తిరిగినంత మాత్రాన ప్రేమించాలని ఎక్కడుంది? ఓ వేళ ప్రేమించినా పెళ్ళాడేసేయాలనేమిటి?" అంటూ ఎదుకు ప్రశ్నలు వేసింది. ఆ తరువాత వాళ్ళిద్దరి పరిచయం ఇంకొంచెం దూరం వెళ్ళింది. రోజూ సాయంత్రం పూట కోఠీలోనూ, అబిడ్స్ లోనూ చాలామందికి కనిపించేవారు. కాని, తనెక్కడికెళ్ళినా, ఎవరితో తిరిగినా- అన్నీ నాకు వివరంగా చెబుతూండేది. అందుచేత నే నామె డైరీలాంటి దాన్నని కాలేజీ అంతా చెప్పుకొనేవారు. ఓ నెలరోజులు ఇలా గడిచిం తర్వాత ఓ రోజు సాయంత్రం ఆటో రిక్షాలో కాలేజీ నుంచి ఇంటికొస్తూంటే- "హసన్ ఒక ఇంటర్నేషనల్ ఇడియట్" అంది రాధ.

    "ఎందుకని?" అడిగాను ఆశ్చర్యంగా .

    "నీకు తెలీదులే" అంది. వివరాలు అడగడం ఇష్టంలేక ఊరుకొన్నాను. మర్నాడు మేము కాలేజీ నుంచి బయటికొస్తుంటే హసన్ కనిపించి రాధను పిలిచాడు.

    "ఇంకెప్పుడూ నాతో మాట్లాడకు. నువ్వంటే నా కసహ్యం" అంటూ అతను చెప్పేది వినిపించుకోకుండా వచ్చేసింది. అంతే! అప్పటి నుంచి హసన్ నాకు మళ్ళీ కనిపించనేలేదు. అతనితో అంత పరిచయమున్నా, ఆ తరువాత ఎప్పుడూ రాధ హాసన్ గురించి మాట్లాడలేదు. అజిత్ ను చూసేసరికి ఎందుకో ఆ కథ అంతా ఒకసారి నా కళ్లముందు కనిపించింది. మళ్ళీ ఇతనూ, రాధా ప్రేమలో పడ్డారేమో అని భయం వేసింది. ఎందుకంటే, రాధ మనసు చంచలమైనది. ఎప్పుడేం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఓసారి ఐస్ క్రీమ్ తిని , వెంటనే కాఫీ త్రాగింది. ఓ ఫ్రెండ్ తో చిన్న విషయం మీద పోట్లాడి మాట్లాడ్డం మానివేసింది. హసన్ కి అలా అడ్రస్ లేకుండా చేసింది. ఇలాంటివెన్ని చేసినా నేనేం అనుకోలేదు. కాని, ఇప్పుడీ అందాలరాజుని కూడా అలా చేస్తుందేమోనని కంగారుగా కూడా ఉంది. ఇద్దరూ అందానికి ప్రతినిధుల్లా ఉన్నారు. వయసూ, మనసులూ దగ్గరైనాయ్ కనుక ఇద్దరూ ఒకటయితే బాగుండునని మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించాను.  

    టైమ్ ఏడు దాటింది. చలి ఆ ప్రదేశమంతా అలుముకుపోయింది.

    "క్వాలిటీలో టేబుల్ రిజర్వ్ చేశాను" అన్నాడతను.

    "ముందే చెప్పాల్సింది" అంది రాధ.

    "ఏం రావటం కుదరదా? చాలా మంచి ప్రోగ్రాంలున్నాయ్ ఈవేళ"

    "ఉహు, సారీ! ఈవేళ రాలేను." మొండిగా అంది రాధ.

    "ప్లీజ్! నాకోసం" ప్రాధేయపడుతూ అడిగాడు.

    నాకు రాధమీద చెడ్డ కోపం వచ్చింది. అతను అడుగుతూంటే కాదనడానికి నోరెలా వచ్చింది? అయినా అతనిదీ తప్పు. అతను అడగకూడదు. ఆజ్ఞాపించాలి. అతని ముఖంలోకి చూస్తే ఎవరైనాసరే, ప్రాణాలడిగినా ఇవ్వడానికి వెనకాడరు. బహుశా అందుకేనేమో కాసేపు బ్రతిమాలిన తర్వాతే 'సరే' అంది రాధ.

    "మరి ఈ పాపని ఇంటికి పంపద్దూ?" అన్నాడతను.

    "అప్పుడేనా?" అంది రాధ.

    "నువ్వుకూడా ఎవరినయినా ప్రేమించావా?" నాకళ్లలోకి చూస్తూ అడిగాడతను. మళ్ళీ అదే చూపు! అదే ఆకర్షణ! నేను పిచ్చిదాన్నయి పోతున్నాను. బలవంతంగా  చూపు మరల్చాను.

    "దటీజాల్ నాన్సెన్స్!" అన్నాను.

    "ఓ! అది తప్పనుకొంటున్నావులా ఉంది. ఆ అభిప్రాయం మార్చేసుకో! త్వరగా ఎవర్నయినా ప్రేమించెయ్" అన్నాడు.

    "నాకలాంటివి నచ్చవ్" అన్నాను.

    "నీ వయసులో మేమూ నీలాగానే అనేవాళ్లం!" నవ్వాడతను.

    "భగవంతుడా! ఇతని జీవితాన్ని పంచుకొనే అదృష్టవంతురాలెవరో?" నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. క్వాలిటీలో ఆ ఎగ్జయిటింగ్ ప్రోగ్రాం ఏమిటో చూడాలని ఉంది.

    "పోనీ, భానుని కూడా మనతో తీసుకెళితే?" నా మనసులోని కోరిక గ్రహించినట్లుగా అన్నాడతను.