ఆ రాత్రి గడిచిపోయింది.

 

    మరుసటిరోజు ఉదయమే రాఘవేంద్రనాయుడు దినచర్య ఒకింత దారితప్పి వేరే ట్రాక్ లోకి వెళ్ళింది.

 

    తన లెవెల్ సర్కిల్స్ లోని వాళ్ళకు ఫోన్స్ చేసి, తన కొడుక్కి మంచి సంబంధం చూడమని చెప్పటంలో గంట గడిపాడు.

 

    మధుకర్ పెళ్ళి చేస్తే దారిలోకి రావచ్చేమోనని తను ఏదో అనుకోకుండా చెప్పిన సలహాకే, రాఘవేంద్రనాయుడు స్టిక్ అయిపోయాడా? ఒకటి అనుకుంటే దాన్ని పూర్తి చేసేవరకూ రాఘవేంద్రనాయుడు నిద్రపోడు... రవికిరణ్  విస్మయంగా చూస్తూ అనుకున్నాడు మనస్సులో.

 

    పెళ్ళి కావల్సిన ఆడపిల్లలున్న కుటుంబాలలో... అదీ డబ్బున్న కుటుంబాలలో సంచలనం... ఉరుకులు... పరుగులు మొదలయింది.

 

    చూస్తుండగానే సాయంత్రానికి అదో పెద్ద టాపిక్ అయిపోయింది.

 

                              *    *    *    *    *

 

    "మధుకర్ కి వాళ్ళ నాన్న పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా...? నిజమే?!" తమాషాగా ప్రశ్నించింది మహతి.

 

    ఫ్రెండ్స్ అవునన్నట్లు మౌనంగా తలూపారు.

 

                              *    *    *    *    *   

 

    హాల్లో మూడీగా కూర్చున్నాడు మధుకర్.

 

    "మన బార్ లో మనం కూర్చోక, ఈ దిక్కుమాలిన బార్ లో ఎందుకురా?"

 

    చికాకుగా అడిగాడు నిధి దయాళ్.

 

    "పెరడు చెట్టు మందుకి పనికిరాదు. అలాగే మన బారూ మందుకి పనికిరాదు" విట్టు వేసాడు సురేష్.

 

    "ఆ విజయ్ గాడేడీ?" మూర్తి అసహనంగా అడిగాడు.

 

    "వాడా... వాడి గర్ల్ ఫ్రెండ్... ఏదో సినిమా కెళుతూ కనబడింది. అంతే వెనక పరుగెత్తాడు...

 

    "వాడికో గర్ల్ ఫ్రెండ్ కూడానా..." ఆశ్చర్యం వ్యక్తం చేసాడు మూర్తి.

 

    "కూడానా... అని దీర్ఘాలెందుకురా! వాడేం మగాడు కాడా?

 

    ఆ సిన్మా ఏదో అయిపోగానే ఇక్కడికే తగలడతాడులే. అవునూ- మధుకర్ ని మూడ్ లోకి తేవాలంటే జోకులుండాలా? తప్పదా? సరే... నాకు తప్పుతుందా?

 

    అయితే వినండి. ఓ జోక్ చెప్తాను. ఒరేయ్ మధూ, విన్రా... సర్వర్ హాట్ డ్రింక్ తెచ్చేలోపు నా సాఫ్ట్ జోకులు వినండి" అంటూ మొదలు పెట్టాడు నిధి దయాళ్-

 

    "ఓసారి హిట్లర్... ఓ పిచ్చాసుపత్రిని చూడ్డానికి వెళ్ళాడట. హిట్లరు వెళ్ళి, ఆ ఆస్పత్రిలోని అన్ని వార్డుల్నీ తనిఖీ చేసాడు. హిట్లరుని చూడగానే ప్రతి పిచ్చివాడూ- హీ... హిట్లరు అని, హిట్లరు తన సైనికులకు అలవాటు చేసిన పద్ధతిలోనే సెల్యూట్ చేసారు. ఆ సెల్యూట్ కి హిట్లరు చాలా ఆనందించాడు. పిచ్చివాళ్ళయినా తనని గుర్తించినందుకు, గౌరవించినందుకు సదరు హిట్లరు చాలా సంతోషించాడు.

 

    అందరూ తనకి సెల్యూట్ చేసారు కానీ, ఆ ఆస్పత్రి డాక్టర్ తనకి ఎందుకు సెల్యూట్ చెయ్యలేదో తెలీక, ఆఖరికి ఉండబట్టలేక అడిగేశాడట-

 

    మిస్టర్ డాక్టర్... నువ్వెందుకు నాకు సెల్యూట్ చెయ్యలేదు అని. ఆ డాక్టర్ ఒక్కసారి హిట్లరువేపు చూసి-

 

    రెస్పెక్టు హిట్లరూ... వాళ్ళకి పిచ్చుందిగానీ, నాకు లేదు కదా... అని అనగానే హిట్లరు ముఖం మాడ్చుకున్నాట్ట... ఎలా ఉంది జోకు?

 

    హిట్లరు మొహంలాగా, నీ మొహంలాగా ఉంది. జోకంటే కొంచెం నవ్వు రావాలిరా" అన్నాడు సురేష్.

 

    "పోనీ నువ్వు చెప్పరా... చూస్తాను."

 

    సర్వర్ డ్రింక్ సర్వ్ చేసాడు. అందరూ పొలోమని ఛీర్స్ చెప్పుకుని తాగడం మొదలుపెట్టారు.

 

    డ్రింక్ ని చప్పరించి నిధి దయాళ్ మరో జోక్ చెప్పాడు.

 

    "ఓ ఫ్రెంచ్ బార్ కి ఓ అమెరికన్ వెళ్ళాట్ట... ఆ అమెరికన్ కి ఫ్రెంచ్ రాదు.... అతనికేమో పుట్టగొడుగుల ఆర్డర్ చెయ్యాలని ఉంది. మరి చెప్పడం ఎలాగో అర్థంకాలేదు. వెంటనే జేబులోంచి పాకెట్ నోట్ బుక్ తీసి, అందులోంచి ఓ పేపరు చింపి, దానిమీద పుట్టగొడుగు బొమ్మ వేసి సర్వర్ కి నవ్వుతూ ఇచ్చాడు.

 

    సర్వర్ అర్థమైందని, ఆనందిస్తూ వెళ్ళి అయిదు నిముషాల్లో తిరిగి వచ్చాడు.

 

    "సర్వర్ ఏం తెచ్చాడో తెల్సా?" అందరివేపు చూస్తూ అన్నాడు నిధి దయాళ్.

 

    "చెప్పు..."

 

    "గొడుగు."

 

    అందరూ పొలోమని నవ్వారు, ఆ జోకుకి.

 

    "బావుంది... బావుంది..." అన్నాడు సురేష్.

 

    "జోకా... డ్రింకా?" మూర్తి అడిగాడు.

 

    "డ్రింక్" బదులిచ్చాడు సురేష్.

 

    "అదిరా అసలు జోకు...." నవ్వారందరూ.

 

    మధుకర్ సిగరెట్ మీద సిగరెట్ వెలిగిస్తూ, మొదటి పెగ్గు పూర్తి చేసేసాడు.

 

    "రిపీట్ ది డ్రింక్" అని స్టీవార్డ్ తో చెప్పాడు.

 

    తనెంత ఫూలయ్యాడో తలచుకుంటే కోపం రెట్టింపైపోతోంది.

 

    తన పరిస్థితి తనకే అసహ్యంగా వుంది. మహతి రెండుసార్లు దెబ్బ తీసింది. మొదటిది డబ్బుతో పోయింది.

 

    కానీ రెండోది... ఇట్స్ ఏ మాటర్ ఆఫ్ ప్రెస్టేజ్!

 

    ఆ బార్ నిండా మహతి నవ్వులే విన్పిస్తున్నాయి మధుకర్ కి.

 

    "ఈసారి తన చేతిలోంచి మహతి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను..."

 

    రెండో పెగ్గును అందుకుంటూ అనుకున్నాడు మధుకర్.

 

    అప్పటికి, అందరూ మూడో పెగ్గు ప్రారంభంలో ఉన్నారు.

 

    "చిన్న ఓ జోకు చెప్పరా" అని నిధిని రిక్వెస్ట్ చేసాడు సురేష్.

 

    అయితే చెప్తాను విను... ఓ బారువాళ్ళు ఓ పేపరులో యిలా ప్రకటించారు.

 

    Wanted Bar- Madi- Bust be attractive...."

 

    ఆ ట్విస్టుకి అందరూ నవ్వారు. మధుకర్ తో సహా.

 

    మధుకర్ ఇప్పుడు ఫార్మ్ లో కొచ్చాడు.

 

    "ఒరేయ్, జోకుల పార్ట్ కి ఎండ్ చెప్పండి... మీరు నాకు కోపరేట్ చేస్తారా, లేదా... చెప్పండి" సీరియస్ గా అడిగాడు మధుకర్.

 

    "దేనికో చెప్పు... చెప్తాం" నిధి దయాళ్ అన్నాడు.

 

    మూర్తి తప్ప మిగతా ఇద్దరూ షాక్ తిన్నారు ఆ మాటకి- కొద్ది క్షణాలక్కడ  లోతయిన నిశ్శబ్దం పేరుకొంది.

 

    "మహతిని రేప్ చేస్తావా?"

 

    "ఎస్... ఐ వాంట్ టు రేప్ హెర్... నా తడాఖా ఏమిటో చూపిస్తాను. లేకపోతే నన్ను ఫూల్ ని చేస్తుందా? మహతి పొగరుబోతుతనాన్ని అణిచివేసి, ఎందుకూ పనికిరాకుండా చెయ్యకపోతే... నా పేరు మధుకర్ కాదు."