మన ముఖానికి శత్రువులు మనం వాడే వస్తువులే...!

 

అందంగా ఉండటానికి అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్ని కొన్ని అజాగ్రత్తల వల్ల మన ముఖ సౌందర్యం దెబ్బ తింటుంది. శరీరంలోని ఇతర భాగాల అందాన్ని పెంచుకునేందుకు మనం వాడే కొన్ని వస్తువులు మన ముఖానికి శత్రువులు. అవేంటో తెలుసుకోవాలని ఉందా....

పాదాల పగుళ్లకు రకరకాల క్రీములు వాడుతుంటాం. ఇవి పాదాలను బాగు చేస్తయేమో కానీ ముఖానికి తీవ్ర హాని చేస్తాయి. వాటిలో ఉండే కెమికల్ ఎక్స్ ఫాలియెంట్స్ ముఖ చర్మపు సున్నితత్వాన్ని పాడు చేస్తాయి. అలాగే హెయిర్ స్ర్పేలు. వీటిలో అధిక మోతాదులో ఉండే ఫ్రాగ్రెన్స్ లు ముఖంపై పడితే చర్మం డ్యామేజ్ అయ్యి దురద, మంట వంటివి కలుగుతాయి.

తలంటుకునేటప్పుడు చాలాసార్లు షాంపూ ముఖానికి కూడా అంటుకుంటూ ఉంటుంది. కానీ తరచుగా ఇలా జరిగితే మాత్రం ముఖం పాడవడం ఖాయం. ఎందుకంటే జుత్తుపై ఉండే జిడ్డు, మురికి వంటివి వదిలించడానికి అనువుగా తయారుచేసే షాంపూలోని రసాయనాల్ని... ముఖ చర్మంలో ఉండే డెలికేట్ మాలెక్యూల్స్ తట్టుకోలేవు. దాంతో చర్మం పొడిబారిపోతుంది. అదే విధంగా డియోడరెంట్స్, హెయిర్ కలర్స్. ఇవి ముఖానికి ఓ పరిమితి దాటి తగిలితే సున్నితమైన ముఖ చర్మానికి ఉండే స్వేదరంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది.

కొంతమంది ఒంటికి రాసుకుంటున్నాం కదా అని బాడీ లోషన్స్ ని ముఖానికి కూడా రాసేసుకుంటూ ఉంటారు. అది మంచిదే అయితే ముఖానికి ప్రత్యేకంగా క్రీములు తయారై ఉండేవి కావు. ముఖంపై ఉండే చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. అందుకే దానికి అధిక రసాయనాలు పడవు. అందుకే దాని సున్నితత్వం పాడవకుండా ఉండే రసాయనాలతో ఫేస్ క్రీములు తయారవుతాయి. కానీ బాడీ లోషన్స్ అంత సున్నితమైనవి కావు. అందుకే వాటిని ముఖానికి రాసుకోకూడదు. లేదంటే పొడి చర్మం కలవారి ముఖం మరింత పొడిగా... జిడ్డు చర్మం ఉండేవారి ముఖం మరింత జిడ్డుగా అయిపోతుంది. మెల్లమెల్లగా సున్నితత్వం మాయమైపోయి ముఖం రఫ్ గా తయారవుతుంది.

ఇవన్నీ మనం తెలియకుండా చేసే పొరపాట్లే. అజాగ్రత్తగా ఉండటం వల్ల వీటన్నిటినీ ముఖానికి పూసేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉండొచ్చు. ముఖసౌందర్యానికి ముప్పు రాకుండా చూసుకోవచ్చు. ఏమంటారు!


- sameeranj