మరి నా సంగతేమిటీ?

 

    "దునియా కరే సవాల్ ముఝ్ సే... క్యా జవాబ్ దూ..." ఏం చెప్పను? నేను చూడని ఒక వ్యక్తికోసం నేను అన్వేషిస్తున్నాననా? అతను నన్ను స్వీకరిస్తాడనా నా నమ్మకం! ఏవిటి నాకీ పిచ్చి?

 

    కళ్ళు మూస్తే నాకు ఓ అపురూపమయిన వ్యక్తి కళ్ళముందు ఆడుతున్నాడు.

 

    అతను అద్వితీయం... ... అతని సాహచర్యం అనిర్వచనీయం!

 

    అక్క అక్షరాల్లో అతన్ని నేను చూశాను! కడలి పాదాలచెంత ఇసుక రేణువుల్ని లెక్కిస్తున్న నన్ను చూసి జాలిగ నవ్వినవాడు! తియ్యనివాడు... మనసులోంచి తియ్యగలేనివాడు! నా భావాల్ని ఆవిష్కరించలేను. అతని వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించలేను!

 

    ఆ రాత్రి నిదురపట్టక ఆరుబయట కురుస్తున్న వెన్నెలని చూస్తూ కూర్చుంటే, మల్లెపొదలో మూడు నక్షత్రాలు పూచి తియ్యగా పలకరించాయి! మిణుగురొకటి దీపంకూడా చూపించింది.

 

    బాల్యం పాదాలక్రింద ఇసుక రేణువుల్లా మెత్తగా కరిగిపోయింది.

 

    యవ్వనం హోరుమనే ప్రవాహంలోకి తెరచాపలెత్తి పిలుస్తోంది. ప్రశాంతమయిన ఆవలితీరం చేరుస్తుందో లేక సుడిగుండంలో ముంచేస్తుందో...


                                                         *  *  *


    చీకటి పొడిపొడిగా రాలిపడ్తోంది. నేను కట్టుకున్న కాటన్ చీర మీద వున్న నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తాం అంటున్నట్లు గాలికి రెపరెపలాడుతోంది కొంగు.

 

    విక్కీ కళ్ళల్లో మెచ్చుకోలు!

 

    "మీకు సంగీతం అంటే ఇష్టమా?" నిశ్శబ్దాన్ని భంగం చెయ్యాలని అతని తాపత్రయం.

 

    "అవును!"

 

    "నాకు ఇష్టమే కానీ ఇలా ప్రత్యేకంగా అందుకు టైంకేటాయించి ప్రోగ్రామ్స్ కి ఎప్పుడు రాలేదు" అన్నాడు.

 

    "లిల్లీ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బందిలో పడేసింది."

 

    "లేదు. సంగీతంకన్నా ప్రకృతి అంటే ఎక్కువ ఇష్టం. ఆ ప్రకృతి అంతా చీరకట్టిన స్త్రీలో వుందని యీరోజు తెలిసింది" నావేపు చూస్తూ అన్నాడు.

 

    నేను చిరునవ్వు నవ్వాలో బిగుసుకుని కూర్చోవాలో నాకు తెలీని పరిస్థితి! అతను నన్ను పొగడటం నాకు ఆనందాన్నిస్తోంది. ఐనా నా ఆనందం వ్యక్తం చెయ్యడానికి అభిజాత్యం అడ్డువస్తోంది.

 

    ఈ పొగడ్త నేను కోరుకుని ఉండకపోతే నేను అద్దం ముందు అంతసేపు గడిపి తయారయి వుండేదాన్ని కాదు.

 

    "ఆ కళ్ళల్లో పొగమంచులాంటి సిగ్గు! మేఘాల్లా కదిలిపోతున్న భావాలూ... దాచుకుని దాచుకుని పిసినారిలా నవ్వే నవ్వూ. చిక్కనిరాత్రిని తమలో దాచేసుకున్న ఆ నల్లని కనుపాపలూ... వెన్నెలని పొడిగాచేసి అద్దుకున్న తెల్లని నవ్వూ! ఓహ్..అనంతమైన సౌందర్యం అంతా స్త్రీలో పొందుపరిచాడు ఆ సృష్టికర్త!" అన్నాడు.

 

    నేనూ నవ్వేశాను.

 

    ప్రోగ్రాం చూస్తున్నంతసేపూ నేను అతనివేపు వాలి నా మనసులో కదుల్తున్న భావాలు చెపుతూనే ఉన్నాను.

 

    నా సంతోషం... నా ఉద్యోగం... అతను చిన్నపిల్లలా కేరింతలు చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నాడు.

 

    ప్రోగ్రాం అయ్యేటప్పటికి నాకు అర్థం అయింది. అతను నాకోసం వచ్చాడని, కేవలం నన్ను చూడటానికే వచ్చాడని! స్త్రీ కోసం మగవాడు చాలా కష్టపడతాడు. ఆమె తనకి దక్కేదాకా!

 

    హాలు జనంతో క్రిక్కిరిసిపోయింది. జనం చివర చివరకి ఈలలూ గోలా మొదలు పెట్టారు. వాళ్ళకి కావాల్సింది ర్యాప్ సాంగ్స్ ట!

 

    సడెన్ గా పవర్ పోయింది. జనరేటర్ ఆన్ అయ్యేంతలో ఏదో గలాటా.

 

    "పదండి వెళ్ళిపోదాం" చెవిలో చెప్పాడు విక్కీ.

 

    నేను లేచి అతని వెనక నడిచాను.

 

    పక్కకి తోసేస్తున్నారు. అతని చెయ్యి నాకు పట్టు దొరకలేదు. "విక్కీ..." అరిచాను.

 

    ఎవరో వీపు వెనక తడుముతున్నారు. వెనక్కి తిరిగి చూసేలోగా ముందు ఎవరిదో మొరటు చెయ్యి. అప్రయత్నంగా గుండెలమీద చెయ్యి వేసుకుని "విక్కీ" అరిచాను. గోలా...విజిల్స్... అంతా అంధకారం.

 

    కాసేపు నాగరికత కళ్ళు మూసుకుంటే. మానవుడిలోని జంతువు నిద్రలేస్తాడనటానికి ఉదాహరణ! నాకు ఒళ్ళంతా చీమలూ, జెర్రులూ పాకుతున్నట్లుగా చిరాగ్గా వుంది. ఏడుపొచ్చేస్తోంది.

 

    ఎక్కడెక్కడో చేతులు... ఒంటిమీద తడుముతూ...గిచ్చుతూ... ఎటు తడిమినా  ఎవరిదో శరీరం... వెనకాల అదుముకుంటూ...

 

    పైట ఎక్కడో చిక్కుకుంది. గట్టిగా లాగితే సర్రున చినిగింది. ఎవరో నడుంవెనక చెయ్యివేసి నన్ను బలంగా లాగారు.

 

    "ఏయ్ వదులు... వదులు" అన్నాను.

 

    నాకాళ్ళు గాలిలోకి లేచాయి. చీకటికి అలవాటపడ్తున్న కళ్ళకి పొడుగ్గా వున్న మనిషి నన్ను పైకి ఎత్తుతున్నాడని అర్థం అయింది. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. వెనకాల గోడ తగిలింది.

 

    బల్లిలా కరుచుకుపోయాను. నామీద అతని బరువు ఆనుతోంది. ముఖానికి దగ్గరగా ముఖం... ఊపిరి నా నోట్లోకి వదులుతున్నట్లుగా వుంది. చెంపలకి మీసాలు గుచ్చుకుంటున్నాయి. వెడల్పుగా వున్న అతని భుజాల మధ్యలో నా గుండెలు ఒదిగిపోయి ఉన్నాయి.

 

    లైట్లు వెలిగాయి!