"సంధ్యా....నువ్వు పడుకో తల్లీ" అంది కాంచన.
    
    డైనింగ్ టేబుల్ మీద అమర్చిన రకరకాల పిండివంటలమీద మూతలు పెడుతూ నిట్టూర్చింది సంధ్య.
    
    కాంచనకి చాలా నీరసంగా వుంది. మందులు కూడా వేసుకోలేదు. పొద్దుట్నుండీ ఏమీ తినకపోవడంవలన కళ్ళు తిరిగిపోతున్నాయి. 'ఆయన ఎప్పుడూ ఈవేల్టిరోజు ఇలా చెయ్యలేదు. ప్రొద్దుట చెప్పాను కూడానూ' అనుకొంది బాధగా.
    
    సంధ్య తల్లిని అలా విచారంగా చూడలేక, గదిలోకి వెళ్ళి పడుకుంది. పగలంతా పని చేసి చేసి అలసిపోవడంవలన ఆమెకి త్వరగానే నిద్ర పట్టేసింది.
    
    కారు హారన్ వినిపించగానే కాంచన లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది. అది జయచంద్ర కారే.
    
    ఆమె లేని ఓపిక తెచ్చుకుని తడబడే అడుగులతో హాల్లోకి వెళ్ళే మెట్లదాకా వచ్చి అలాగే నిలబడిపోయింది.
    
    ఆ దృశ్యం ఆమెకి అంత విస్మయాన్ని కలిగించింది.
    
    చాయ తన గుండెల దగ్గరగా చీరల ప్యాకెట్లు పెట్టుకుని జయచంద్ర పక్కగా నడుస్తూ వస్తోంది.
    
    అతను ఏదో అన్నాడు. ఆమాటకి ఆమె బిగ్గరగా నవ్వుతూ అతని భుజంమీద వాలింది.
    
    ఇద్దరూ.....చాలా......చాలా సంతోషంగా అనిపించారు.
    
    కాంచన గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తన మనసులోని బాధ కంట్లోని తడిగా మారి అతని కంటపడుతుందేమోనని!
    
    ఈ విషయం గమనించిన చాయకి పూర్తిగా మనసు నిండిపోయింది. అదే ఆమె కోరుకుంది. కాంచన ముఖంలోని ప్రశాంతత ఎగిరిపోవాలి. ఆమె ఎదురుచూసి.....ఎదురుచూసి....తీరని ఆశాభంగంతో వేగిపోవాలి!
    
                                                            * * *
    
    మరునాడు జయచంద్ర లూసీ ముందు ఫ్రీగా ఫీల్ అవలేకపోయాడు.
    
    "నిన్న ఢిల్లీ నుండి జస్వంత్ లాల్ వచ్చారు....ఎక్కడ దొరుకుతారని మీ గురించి అడిగారు" అంది తల వంచుకునే లూసీ.
    
    జయచంద్ర పేపర్ వెయిట్ ని గుండ్రంగా తిప్పుతూ వుండిపోయాడు. తల కూడా పైకి ఎత్తలేదు.
    
    "నిన్నటి లెటర్స్ కొన్ని సైన్ కాక డిస్పాచ్ అవలేదు. మీరు సైన్ చేస్తే...." అని అతనిముందు ఫెయిల్ వుంచింది.
    
    జయచ్నద్ర సైన్ చేసి అందించాడు.
    
    లూసీ ఆ గదిలోనుండి వెళ్ళిపోతూ వుండగా-
    
    "లూసీ! ఆ అమ్మాయి సంధ్య స్నేహితురాలు చాలా తొందరపాటు స్వభావం కలది.....నిన్న ఆ అమ్మాయి బర్త్ డేట పాపం...." అని ఓ మాటకి ఓ మాటకీ పొంతన కుదరడంలేదని తెలుసుకుని ఆగిపోయాడు.
    
    లూసీ చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది.
    
    లూసీకి తను సరిగ్గా జరిగిన విషయం కమ్యూనికేట్ చెయ్యలేకపోయానని జయచంద్రకి తెలిసింది. కాసేపు మాటలు కూడగట్టుకుని, లూసీని పిలిచాడు.
    
    లూసీ రూంలోకి వస్తూనే "అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి సార్! పీటర్ ని ఈరోజు ఫిజియో థెరపీ సెంటర్ కి తీసుకెళ్ళాలి" అంది.
    
    జయచంద్ర ఏం మాట్లాడలేక తల ఆడించాడు.
    
    "థాంక్యూసర్!" అని లూసీ వెళ్ళిపోతూ వుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయాడు.
    
    దగ్గర వాళ్ళకి చెప్పుకోవడానికి కారణాలు కనిపించని విపరీత పరిస్థితులు ఏర్పడడం మించిన నరకంలేదు.
    
                                                            * * *
    
    "ఏమంటోంది నీ డార్లింగ్? ప్లాట్ చూపించావా?" బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేస్తూ అడిగింది లూసీ.
    
    "అహ....ఇప్పుడేకాదు.....ఇంకా సమయం రాలేదు...." అన్నాడు కిరణం.
    
    "ఏం?" అర్ధంకానట్లు ముఖం పెట్టింది లూసీ.
    
    కిరణ్ తినడం ఆపి, కళ్ళు అరమోడ్చి చెప్పసాగాడు. "మా స్వర్గసౌధం ఇంకా పూర్తికాలేదు. ఆమెలాంటి సౌందర్యరాశి ఆ ఇంట్లో తిరుగుతూ పనిచేసుకోవాలంటే, ఆ ఇంటికున్న అర్హతలు చాలవు. మెత్తని గులాబీ రేకులు పరిచినట్లుండే లాంటి కార్పెట్ లేకపోతే, నా దేవత పాదాలు కందిపోవూ! ఎయిర్ కండీషనర్ ఆగిపోతే.....ఆమె నుదుటిమీద శ్వేదం....అమ్మో ఇంకేమయినా వుందా? అందుకని మంచి జనరేటర్ కావాలి. వంటింట్లో కుకింగ్ రేంజ్.....బెడ్ రూంలో వాటర్ బెడ్.....బాత్ రూంలో బాత్ టబ్..."
    
    "కిరణ్!" అతన్ని ఈ లోకంలోకి తెస్తూ గట్టిగా అరిచింది లూసీ. "ఇవన్నీ లేకపోతే బ్రతకలేమా?" కాస్త కోపంగానే అడిగింది.
    
    "బతకచ్చనుకో! ఈరోజు పావ్ భాజీ ఎందుకు చేశావు? ఆమ్లెట్ వేసెయ్యాల్సింది."
    
    "రోజూ అదేనా?" అయినా పావ్ భాజీ నీకిష్టం కదా!"
    
    "కానీ కష్టం కదా! టైం ఎక్కువ పడుతుంది."
    
    "కష్టమని మానేస్తామా?"
    
    "ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి అవునా....? అదే....అదే నేను చెప్పేదీనూ టైం ఎక్కువ పట్టినా, కష్టమైనా రుచిగా చేసుకుని తినాలనుకుంటాంగానీ పచ్చికూరలు తినెయ్యలేముగా! అలాగే జీవితాన్ని కూడా కష్టమైనా అందంగానే మలుచుకోవాలి."
    
    "ఇలాగా!" అతని షర్ట్ కాలర్ ఎత్తి అక్కడున్న చిరుగును చూపిస్తూ అడిగింది లూసీ.
    
    కిరణ్ నవ్వేస్తూ "కొన్ని రోజులు ఓపికపట్టు అప్పుడు చూడు వీడి జీవితం.....కింగ్....కాదు....ఎంపరర్ లా గడిచిపోతుంది" అన్నాడు.
    
    లూసీ అతనివైపు జాలిగా చూసింది.
    
    "నిన్ను ఒకత్తినే మా ఇంటికి రావడానికి ఎలవ్ చేస్తాను. ఇంకా ఎవరొచ్చినా ఒప్పుకోను. మా ప్రైవసీకి కాస్త కూడా భంగం కలగకూడదు.....తను వంటింట్లో వంట చేస్తూ వుంటుంది. నేను వెనుకనుండి వెళ్లి వేగుతున్న కూరలో బొమ్మతేళ్ళు వేసి.....అరిచి ఆమెను భయపెడతాను. తను బిత్తరపోయి పెద్దపెద్ద కళ్ళనిండా నీళ్ళు తెచ్చుకుంటే, కితకితలు పెట్టి నవ్విస్తాను. షేవింగ్ చేసుకుంటూ....తిలకం పూసేసుకుని మెడ తెగిందని క్రిందపడి కొట్టుకుంటాను. ఆమె బేలగా మారి పెద్దగా ఏడ్చేస్తే....లేచి నిజం చెప్పేసి దెబ్బలు తింటాను. తను హడావుడిగా బైటికి వెళ్ళాలని చెప్పులు తొడుక్కుని, అడుగు కూడా ముందుకు వెయ్యలేక అయోమయంగా చూస్తూ నిలబడిపోతుంది. జాదూటోనాలా నేను ముందుకి వచ్చి వాటికి ఫెవికాల్ రాసి నేలకి అతికించేసానని చెప్పేస్తాను. ఇలా రకరకాలుగా తనను ఏడిపిస్తూ.....    ఊరడిస్తూ....నవ్విస్తూ....ఓహ్! లూసీ! అద్భుతంగా వుంటుంది కదూ....!" కలలో జీవిస్తున్నవాడిలా అడిగాడు.