అదే సమయంలో మోటార్ బైక్ లో ఆ వీధిన వెళుతూ షోడా కోసం ఓ కిళ్ళీ కొట్టు దగ్గర ఆగాడు రాళ్ళపల్లి.

 

    ఆయన పోలీస్ స్టేషన్ నుంచి యింటికెళుతూ మధ్యలో ఆగాడు.

 

    షోడా తాగుతూ తలతిప్పి చూసిన ఆయనకు దూరంగా జగ్గారావుతో మాట్లాడుతున్న నరేష్ కనిపించాడు. వాళ్ళిద్దర్నీ అలా చూస్తూ ఆయన ఆశ్చర్యంతో బిగదీసుకుపోయాడు. షోడా గొంతులోకి దిగకుండా పొరపోయింది కాలనీకంతా పేరు మోసిన గూండా అయిన జగ్గారావుతో నరేష్ అంత సీరియస్ గా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఆయనకు.   

 

    ఇదేదో పెద్ద గూడుపుఠాణీగా వున్నట్టు ఆయనకీ అనిపించింది. విషయం తేల్చేద్దామని బైక్ స్టార్ట్ చేశాడు బైక్ మీద కూర్చోగానే ఆయనకు నిద్ర ముంచుకొచ్చింది.

 

    'ఇప్పుడు లాభం లేదు. ఇంటికెళ్ళి ఓ కునుకు తీయాలి' అనుకుంటూ నేరుగా యింటి ముఖం పట్టాడు.

 

    జగ్గారావుతో మరో పావుగంట మాట్లాడాక నరేష్ కూడా తన గదికి బయలుదేరాడు.

 

                                                 *    *    *    *    *

 

    రజని నిశ్చలంగా రూఫ్ కేసి చూస్తోంది. కళ్ళు అటు చూస్తున్నా ఆమెకక్కడ ఏమీ కనబడడం లేదు. మాసిపోయిన బట్టలతో, అలసట కళ్ళతో తన ముందు నిల్చుని ఉత్తరం అందిస్తున్న నరేష్ కనపడుతున్నాడు.    

 

    ఆమె తన గదిలోని రోజ్ వుడ్ కాట్ మీద పడుకొని కలలు కంటోంది. ఆమె చుట్టూ నరేష్ రాసిన ఉత్తరాలు చెల్లాచెదురుగా పడున్నాయి. వాటిలోని అక్షరాలు నీలం పావురాయిల్లా పైకెగిరి ఆమె మనోఫలకం మీద వాలుతున్నాయి. అవి కవిత్వపు రెక్కల్ని ఠపాఠపా ఆడించినప్పుడు అనుభూతితో ఆమె ఒళ్ళు పులకరిస్తోంది.

 

    మొదట్లో తనకు వస్తున్న ఉత్తరాలు ఎవరు రాస్తున్నారో ఆమెకు తెలియదు. ఎక్కడో, ఏ మూలో అవి నరేష్ రాస్తున్నట్టు అనిపించినా ఖచ్చితంగా నిర్ధారించుకోలేకపోయింది. ఆ ఉత్తరాల్లోని ప్రేమ, అభిమానం, అనురాగం, తపన అవన్నీ ఆమెను మరోలోకంలోకి తీసుకువెళ్ళాయి. వుత్తరాలలోని వాక్యాలను తలుచుకుంటూ గంటల తరబడి ఒంటరిగా కూర్చునేది.

 

    ఆరోజు నరేష్ ఉత్తరం తెచ్చినప్పుడు అన్నిరోజులూ తనుపడ్డ ఆనందం అంతా అతనితో పంచుకోవాలనిపించింది. ఆ వుత్తరాలు ఎవరు రాశారో గెస్ చేస్తూ తను పడ్డ అవస్థ అంతా అతని ఒడిలో వాలిపోయి చెప్పాలనిపించింది. తనకోసం రోజంతా ఉత్తరాలను బట్వాడా చేసిన అతన్ని దగ్గిరకు తీసుకొని బుజ్జగించాలనిపించింది. అయితే వాటిల్లో ఏదీ చేయలేకపోయింది. అతని చుట్టూ పోస్టుమెన్ లంతా వుండడంతో ఏదో జంకు ఆమెను వెనక్కు లాగింది.

 

    ఆ తరువాత కూడా ఆమె తనంతట తాను అతని కోసం వెళ్ళలేకపోయింది. బిడియం, సిగ్గు ఆమెకి తాత్కాలికంగా సంకెళ్ళు వేశాయి.

 

    అయితే అతనితో మాట్లాడలేకపోతే యిక నిలవలేని స్థితికి చేరుకుందామె. అతనిపట్ల తనకి కలిగిన భావన జాలో, ప్రేమో అన్న సందేహం కూడా వుండేది మొదట్లో. తన అంతరంగాన్నంతా వెదకి వెదకి అది ప్రేమే అని తెలుసుకుంది. ఇక ఆ ఒత్తిడిని భరించలేకపోతోంది. ఎంత త్వరగా అతనికి తన మనసును విప్పి చూపిద్దామా అనే ఆరాటంతో ఆమె తల్లడిల్లిపోతోంది.

 

    అంతలో చప్పుడయితే మెల్లగా కళ్ళు విప్పి చూసింది. ద్వారం దగ్గర పనిమనిషి.

 

    "అమ్మాయిగారూ! రండి భోజనం చేద్దురుగానీ! నాన్నగారుకూడా భోంచేసి లేచారు" పిలిచింది పనిమనిషి అప్పాయమ్మ.

 

    రజనికి ఆకలి కావడం లేదు. అసలు ఆ ధ్యాసే లేదు. నరేష్ తో తను పంచుకోబోయే జీవితాన్ని గురించే ఆలోచిస్తోంది.

 

    "నాకు ఆకలిగా లేదు, వెళ్ళు. ఓగ్లాసు పాలు మాత్రం తీసుకురా" అని చెప్పి అటు తిరిగి పడుకుంది. తన పక్కన నరేష్ కూర్చుని వున్నట్టే ఆమె భావిస్తోంది.   

 

    ఎదురుగ్గా వున్న గోడ గడియారం పదకొండుసార్లు మొటికలు విరిచిన చప్పుడు కూడా ఆమెకు వినిపించలేదు.

 

    లేచి లైట్ ఆర్పి మళ్ళీ పడుకుంది. ట్రాన్స్ పరెంట్ చీకటికి అవతల దేదీప్యమానంగా వెలిగిపోతున్న నరేష్ ను చూస్తోంది రజని.

 

    సరిగ్గా అదేసమయంలో స్మిత కూడా నిద్ర రాకుండా అటూ ఇటూ దొర్లుతోంది తన ఇంట్లో.

 

    ఆమె కళ్ళల్లో కోరికలు కాగడాలై లేచి, వెంటనే అరిపోయినట్టు నల్లటి గీతలు పాకాయి. శరీరమంతా అనుభవానికి విచ్చుకొని, తిరిగి అవమానంతో కుంచించుకుపోయింది. మత్తులో జోగిన మనసు దెబ్బతిన్నట్టు రోదిస్తోంది.

 

    ఆమె డబుల్ కాట్ బెడ్ మీద ఏకాంతాన్ని కౌగిలించుకొని పడుకుని వుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు దూకడానికి సిద్ధపడుతున్నాయి. ఒంటరితనాన్ని ముందు నిలబెట్టి ఉమ్మెయ్యాలన్నంత కసిగా వుంది ఆమెకి.

 

    స్మిత సాయంకాలం నుంచి నరేష్ కోసం వెయిట్ చేస్తోంది. అతను ఇక రాడని తెలిశాక ఆమెను నిరాశ, నిస్సత్తువ కమ్ముకున్నాయి. అలా బెడ్ మీద పడుకొని తన జీవితాన్ని ముక్కలు ముక్కలుగా పేర్చుకొని, అది ఎంత వికారంగా వుందో చూసుకొని ఏడుస్తోంది. నరేష్ మీద ద్వేషం పెంచుకుంటోంది.

 

    స్మిత చిన్నప్పట్నుంచి పేదరికంలో పెరిగింది. తమ దరిద్రం తీరిపోతుందని ఆమెను మారుతీరావుకిచ్చి వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఫస్ట్ నైట్ తన ఆయుష్షు సిద్ధాంతాన్ని చెప్పి, మరో రూమ్ లో కెళ్ళి పడుకున్న భర్తను చూసి తన డబ్బు దరిద్రం తీరినా కోరికల దరిద్రం పట్టుకుందని అనుకొంది స్మిత.

 

    నరేష్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చూసింది. పాతికేళ్ళ వయసులో సిల్వర్ స్టర్ స్టెలోన్ లో అల్లసాని ప్రవరాఖ్యుడ్ని కలిపేసినట్టు వున్న నరేష్ ను చూడగానే మరులుకొంది. మోహంతో కాగిపోయింది. మంచాన్ని పంచుకోవాలన్న కోరిక ఆమెను పూర్తిగా ఆక్రమించుకొని వూపేసింది. తన భర్తకి అతను వూరి వాడని అబద్ధం చెప్పి ఉద్యోగమిప్పించింది. సాయంకాలం భర్త మారుతీరావు బొంబాయికి వెళతాడని తెలిసి మొదటిసారి నరేష్ ని రమ్మని కబురంపింది. అతని కోసమే ప్రత్యేకించి అలంకరించుకుంది. అయితే నరేష్ రాకపోయేసరికి ఆమె అహం దెబ్బతింది.

 

    నిద్రమాత్రలో, మగవాడో లేకపోతే నిద్రపట్టదని తెలిసిన ఆమె ఫోన్ అందుకుంది. నెంబర్ డయల్ చేసింది.

 

    అవతల నుంచి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడు.

 

                                                  *    *    *    *    *