దాసుగారు స్తంభం చాటునుంచి వచ్చి చటుక్కున నన్ను దగ్గరకు తీసుకుని "అపర సరస్వతి పుట్టిందమ్మా మీ దంపతులకి. ఏకసంధాగ్రాహి సుస్వరాలవాణి" అన్నారు.
    
    "ఏవో పిచ్చాటలూ, లొల్లాయి పదాలూ" అంది అమ్మ.
    
    దాసుగారు వినలేదు. అమ్మాయి స్వరం గంగాఝరి.
    
    సంగీతం నేర్పాల్సిందే అని పట్టుపట్టారు. అమ్మ, నాన్న చెవిన ఈ మాట వెయ్యడానికి భయపడిపోయింది.
    
    కానీ దాసుగారు పదే పదే చెప్పడంతో చిన్నగా నాన్నతో చెప్పింది!
    
    "నాన్నగారు నన్ను పిలిచి-"సంగీతం నేర్చుకుంటావా అమ్మా?" అన్నారు.
    
    "నాకు వచ్చు నాన్నగారూ!" అన్నాను మాగాయ టెంకని మజ్జిగ అన్నంలో ముంచి నాకుతూ.
    
    ఆయన నవ్వి- "అది సంగీతం కాదమ్మా దాసుగారు నేర్పుతారు" అన్నారు.
    
    నేను ఆశ్చర్యంగా మొహంపెట్టి- "పున్నాగపూల కాడలూదితే వచ్చేది సంగీతం కాదా? కోవెల గంటలన్నీ ఒక్కసారిగా మోగితే వచ్చేదీ, మధ్యాహ్నాలు కాలువపారుతూ చేసే ధ్వనీ సంగీతం కాదా... కాకపోతే నాకిదివద్దు. అదే కావాలి" అన్నాను.
    
    నాన్నా, అమ్మా నవ్వారు దాసుగారు మాత్రం - "ఆహా....చరితార్ధులు శాస్త్రిగారూ! సంగీతంలోని సారాన్ని ఎంత సొంపుగా చెప్పింది అమ్మాయీ? మన జీవనంలో ఈ ప్రకృతిలో అన్నింటా దాగున అందమేనండీ సంగీతమంటే....ఒక్కమాట....మీరు ఏమీ అనుకోనంటే..." అని ఆగారు.
    
    "చెప్పండి దాసుగారూ... మీరు మాకు పరాయివారు కాదు" అని అన్నారు నాన్న.
    
    "అమ్మాయిని నాతో మా ఊరు పంపండి. నేను నేర్పగలది బహుకొద్ది విజయనగరంలో కళాశాల కూడా వుంది. అక్కడ చేర్పిద్దాం" అన్నారు.
    
    నాన్న చప్పరించేసి "ఆడపిల్లకి ఏదో ముచ్చటగా మూడు ముక్కలు నేర్పండి చాలు!
    
    ఎలాగూ పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోవాల్సిందేగా.... "మా ఇంటిలోనూ వుంది అటకమీద హార్మోనియా!" అంటూ అమ్మవేపు చూశారు.
    
    "అదే నా బాధండీ!" అన్నారు దాసుగారు.
    
    "అమ్మాయి గొంతు ప్రపంచం మొత్తం విని తరించాల్సింది కానీ ఇంట్లో శ్రావణ శుక్రవారానికి మాత్రమే పరిమితమయింది కాదు."
    
    ఆ రాత్రి నాన్న పడక కుర్చీలో కూర్చుని నన్ను గుండెలమీదేసుకొని జోకొడుతూ అడిగారు - "దాసుగారితో వెళతావా? పెద్ద సంగీత విద్వాంసురాలి వౌతావా?" అని.
    
    "అవుతాను. తొడమీద కొట్టుకుంటూ పాడతాను" అన్నాను.
    
    నాన్న నవ్వారు.
    
                                                                * * *
    
    అక్కడే నా జీవితం మలుపు తిరిగింది!
    
    దాసుగారితో కలిసి వాల్తేరు వెళ్ళాను. ఆయన భార్య పేరు జగదాంబ అట. నేను మాత్రం దాసమ్మగారూ అని పిలిచేదాన్ని. నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారు.
    
    నాన్నగారు ఎవరొస్తున్నా నెయ్యీ, మిఠాయిలూ, కొబ్బరికాయలూ పంపేవారు.
    
    నా సంగీత పాఠాలు నిర్విరామంగా సాగుతూండేవి. దాసుగారి కథలో హార్మోనియం నొక్కేదాన్ని. ఒక్కోసారి నాచేత మంచి కృతికూడా పాడించేవారు. కథ అయ్యాక చాలామంది బుగ్గలు పుణికి ముద్దులు పెట్టుకునే వారు. పదీ, ఐదూ చిల్లరకూడా వద్దన్నా ఇచ్చేవారు.    
    నాచేత మెట్రిక్ కట్టించాలని ఆయన పుస్తకాలూ తెప్పించారు.
    
    పండగలకీ, వేడుకలకీ ఊరెళ్ళేదాన్ని అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించి వుండటం, ఆచారిగారి వైద్యం పనిచేయకపోవటం గమనించాను.
    
    పెద్దన్నయ్య రాజమండ్రిలో ఏదో ఫ్యాక్టరీలో పనిచెయ్యటానికెళ్ళాడని తెలిసింది. ఇంట్లో రోజూ నాలుగూ, అయిదూ విస్తళ్ళు అదనంగా లేస్తూనే వున్నాయి. ఊరంతా అప్పులు మాత్రమే నాన్నగారు మిగల్చగలిగారు.
    
    "నువ్వు దాసుగారింట్లో వుండటమే మంచిదయింది తల్లీ!" అంది అమ్మ దగ్గుతూ.
    
    పొడవయిన నల్లని జడ స్థానంలో చిన్న పిచికగూడులాంటి వేలి ముడివేసుకుని వున్న అమ్మ ఆయాసపడుతూ మాట్లాడుతూంటే నాకు ఏడుపోచ్చేసింది.
    
    సాయంత్రం నాన్నగారు వచ్చేటప్పటికే అప్పులాళ్ళు గుమ్మంలో కాచుకుని వుండి నిలదీయటం, ఆయన వాళ్ళను బతిమాలుతూ సమాధానపర్చటం చూస్తే మనసు వికలం అయింది.    
    
    దాసుగారొచ్చేదాకా ఆగకుండా ఒక్కదాన్నే బయలుదేరి వాల్తేరు వచ్చేసాను. ఎప్పుడూ కూనిరాగాలు తీస్తూ, చెంగున గెంతుతూ తిరిగే నేనుమౌనంగా వుండటం చూసి దాసుగారు - "ఏమ్మా...అలా వున్నావేం." అనడిగారు.
    
    "బాగా డబ్బు సంపాదించాలి నేను" అన్నాను.
    
    చిన్న పిల్ల మాటలుగా తీసుకుని ఆయన భార్యని పిలిచి చెప్పారు.
    
    ఇద్దరూ పెద్దగా నవ్వేసారు.
    
    నేను మాత్రం ఆ విషయం ప్రతిరోజూ మననం చేసుకోసాగాను.
    
    మెట్రిక్ పరీక్షకి శ్రద్దగా చదువుతూ సంగీతం సాగించాను.
    
    కమల కూడా నాతో సంగీతం నేర్చుకునేది. వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి చేత ఇంగ్లీషు పాఠాలు చెప్పించుకునేదాన్ని. నా కృషి, దీక్షా చూస్తూ దాసు దంపతులు తెగ ముచ్చట పడేవారు. నాకు జలుబు చేసినా వాళ్ళుపడే ఆరాటం, నా పాట విని వాళ్ళు పొందే తన్మయత్వం చూస్తే వాళ్ళే నాకు అసలు అమ్మా నాన్నలేమో అనిపించేది. రాత్రిళ్ళు పడుకుంటే అమ్మదగ్గుతో బాధపడటం, నాన్నగారి కష్టాలూ గుర్తుకొచ్చేవి. మళ్ళీ ఎలాగయినా డబ్బు సంపాదించాలి అని ఇంకా దీక్షగా సంగీత సాధన సాగించేదాన్ని.    
    
    నేను మెట్రిక్ పరీక్ష పాసయిన రోజున దాసుగారు పొందిన ఆనందము అంతా ఇంతాకాదు. అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పటానికి వెళ్ళిన నేను అక్కడే సమర్తాడాను. అమ్మ హడావిడేం చెయ్యకుండా మూల గదిలో చాపేసి కూర్చోబెట్టింది. ఇంట్లో పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఎసట్లోకి బియ్యం కూడా కష్టంగా దొరుకుతున్నాయి. ఇల్లు అమ్మకానికి పెట్టారుట. అమ్మకం అయినా అప్పులాళ్ళకి పోను మిగిలిందేం లేదు.
    
    దాసుగారు భార్యతో సహా వచ్చారు. వస్తూనే ఇంటి పరిస్థితి తెలుసుకుని ఇంట్లోకి సమస్తం తెప్పించారు.
    
    అమ్మకి ఒళ్లెరగని జ్వరం. దాసమ్మగారే నడుంకట్టి వండి వడ్డించారు.
    
    "అన్నదాతా సుఖీభవా!" నాన్న అన్నం కలుపుతూ డగ్గుత్తికతో అన్నారు.
    
    దాసుగారు ముద్ద ఎత్తబోయి ఆగిపోయారు.
    
    ఆయన నడిమి వెలికి మెరుస్తూ కనపడింది కాబోలు వైఢూర్యపు ఉంగరం! "నన్ను సిగ్గుపడేట్లు చెయ్యకండి బాబుగారూ!" అన్నారాయన.
    
    నన్ను సంగీత కళాశాలలో చేర్పిస్తానంటే అమ్మ అభ్యంతరం చెప్పింది. "అమ్మాయికి వయసొచ్చింది కదా! ఇంకా ఎందుకీ సంగీతం?" అంది.
    
    "నేను వెళ్ళాలి" గట్టిగా అరిచాను.
    
    నాన్నగారు అమ్మకి సర్దిచెప్పారు. దాసుగారితో వచ్చేశాను.