హాలీవుడ్‌ని ఏలుతున్న- ఆర్చీ పంజాబీ

 


భారతీయ సంతతికి చెందినవారు చాలామంది హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కానీ అక్కడి చిత్ర పరిశ్రమ మీద తమదైన ముద్ర వేసినవారు కొద్దిమందే! ఇన్నాళ్లకి ప్రియాంక చోప్రా అక్కడ కొన్ని అవకాశాలు దక్కించుకోవడంతో, తరచూ వార్తల్లో ఆమె పేరే వినిపిస్తోంది. కానీ రెండు దశాబ్దాలుగా ఇంగ్లిష్ ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం పొందిన ఒక భారతీయురాలి గురించి మన వార్తాపత్రికలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఆమే ‘ఆర్చీ పంజాబీ’.

 

 

అచ్చమైన భారతీయురాలు

1972లో గోవింద్, పద్మా అనే భారతీయ దంపతులకు పుట్టింది ఆర్చీ. అర్చీ చిన్నప్పుడే, వారి కుటుంబం లండన్‌లో స్థిరపడిపోయింది. అయినా కూడా భారతీయ ఆచారాలనీ, సంప్రదాయ వంటకాలనీ వారు వదులుకోలేదు. ఆర్చీ ఇంట రోటీ లేనిదే పూట గడవదు. ఇక దీపావళి వచ్చిందంటే చాలు, భారతీయులకు ఏమాత్రం తీసిపోకుండా సంబరాలు జరుపుకొంటారు. ఆర్చీ చదువు కొన్నాళ్లు ముంబైలో కూడా సాగింది. ఇక్కడ ఉండే బంధువులను కలుసుకొనేందుకు అప్పుడప్పుడూ ఇండియాకు రాకపోతే కష్టం అంటుంది ఆర్చీ.

 

 

నటన మీద మనసైంది

చిన్నప్పటి నుంచి ఆర్చీకి నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. పాశ్చాత్య దేశాల్లో స్థిరపడిన భారతీయులు, తమ పిల్లలు నటన వైపు మొగ్గుచూపేందుకు ఇష్టపడరు. కానీ ఆర్చీ తల్లిదండ్రులు ఆమెకు పూర్తి స్వేచ్ఛని ఇవ్వడంతో నటన మీద తనకి ఉన్న ఆసక్తికి అవకాశం ఇచ్చినట్లయ్యింది. నాటకాలకి సంబంధించిన శిక్షణ తీసుకుంటూ, నాటకాల పోటీలతో తనేమిటో నిరూపిస్తూ దూసుకుపోయింది.

 

 

ప్రయాణం మొదలు

1994 నుంచే ఆర్చీ చిన్నాచితకా వేషాలు వేస్తూ వచ్చినా 1999లో వచ్చిన ‘East is East’ అనే సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం కళ్లని తన వైపుగా తిప్పుకొంది. ఆ తరువాత వచ్చిన ‘Bend It Like Beckham’లో పింకీ పాత్రతో ఆర్చీ హాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించేసింది. ఒకో సినిమానే దాటుకుంటూ రసెల్ క్రోవ్‌, టిమ్ రాబిన్స్‌, యాంజలీనా జోలీ వంటి ప్రసిద్ధ నటులతో కలిసి తెరను పంచుకొంది. నటించడమే కాదు... ఆ నటనలో ప్రతిభకుగాను బెర్లిన్‌, కేన్స్‌ వంటి ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో అవార్డులనూ అందుకుంది.

 

 

టీవీమీదా తనదైన ముద్ర

ఆర్చీ పంజాబీ డజనుకి పైగా సినిమాలు చేసింది, డజన్ల కొద్దీ టీవీ సీరియల్స్‌లో నటించింది. కానీ ‘The Good Wife’ అనే సీరియల్‌ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. 2009-15 వరకు ఆరు సంవత్సరాలు పాటు నడిచిన ఈ సీరియల్‌లో ఆర్చీ ‘కలింద శర్మ’ అనే పాత్రలో ఒదిగిపోయింది. ఈ పాత్రలో ఆమె నటనకుగాను అరుదైన ఎమ్మీ అవార్డు కూడా దక్కింది. ఈ సీరియల్‌లో నటిస్తున్నప్పుడు ఆర్చీకి, తన సహచర నటికీ జూలియానా మార్గ్యులీస్‌కీ తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయి. ఆ కారణంగానే ఆర్చీ సీరియల్‌ నుంచి తప్పుకుందన్న పుకార్లు కూడా వినిపించాయి. ఈ వివాదం గురించి ఎవరెంతగా రెచ్చగొట్టిగా, ఆర్చీ దీని గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా హుందాగా ప్రవర్తించింది.

 

అందమైన వ్యక్తిత్వం

ఆర్చీ ఆరంభం నుంచి వివాదాలకు దూరంగానే ఉంటూ వచ్చింది. ఇతర నటులతో ఆమె సంబంధాలు ఏనాడూ శృతి మించలేదు. పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే చేసుకుని, అతనితో 18 ఏళ్లుగా పొరపొచ్చాలు లేని కుటుంబ జీవనాన్ని గడుపుతోంది. సినిమాలు, సీరియల్స్‌లో నటించడమే కాదు... ఆర్చీ అనేక సేవా కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటుంది. రోటరీ, ఆమ్నెస్టీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్, ఫోర్డ్‌ ఫౌండేషన్‌ వంటి ప్రతిష్టాత్మక సేవా సంస్థలతో కలిసి విద్య, ఆరోగ్యం, మహిళల రక్షణ, పేదరిక నిర్మూలనకి సంబంధించిన అనేక ప్రణాళికల్లో ఆర్చీ భాగస్వామిగా ఉంది. ఆర్చీ పంజాబీ ఎవరంటే హాలీవుడ్‌లో ఎవరైనా చెబుతారు. ఆర్చీ నటన గురించీ, కలిందా శర్మ అనే ఆమె పాత్ర గురించీ, ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి లండన్‌, న్యూయార్కులలో అందరికీ తెలుసు. కానీ అదేం విచిత్రమో! భారతీయ మీడియాలో ఆమె గురించిన కథనాలే కనిపించవు. అయినా ఆర్చీకి ఇవేవీ పట్టినట్లు లేదు. ఏ ఆర్భాటమూ లేకుండా నటన అనే తన లక్ష్యాన్ని సాగిస్తూ, సాధిస్తూ హాయిగా జీవించేస్తోంది.

 

- నిర్జర.