యాదగిరి అందరిలోకీ ఎక్కువ బాధపడటం చూసి మాకు ఆశ్చర్యం వేసింది.

 

    "ఏమిటి సంగతి? ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి వెళ్తాం! ఎందుకంత శాడ్ ఫీలింగ్?" అడిగాడు శాయిరామ్.

 

    "అదికాదు! మనం అమెరికా వెళ్ళి రావటం తప్పదనుకుని ఓ పత్రికలో డబ్బుకట్టి అమెరికా వెళుతున్న యాదగిరికి మా శుభాకాంక్షలు ఇట్లు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంస్థలు అన్న ప్రకటన వేయించే ఏర్పాట్లు చేసేశాను. అన్నాడు దిగాలుగా.

 

    "నేనూ- ఈ టూర్ ని నమ్ముకుని మా బంధువులందరికీ ఉత్తరాలు రాసేశాను" అన్నాడు శాయిరామ్.

 

    "అయినా మనం విచారించాల్సిన పనిలేదు. మనందరికీ విదేశాలకెళ్ళే అవకాశం మరోటి వుంది!" అన్నాడు రంగారెడ్డి.

 

    శాయిరామ్ మొఖంలోకి హటాత్తుగా కళ వచ్చేసింది.

 

    "ఏమిటి గురూ అది?"

 

    "అవే తెలుగు మహాసభలు! ఈ సంవత్సరం విదేశాలలో జరుగబోయే ప్రపంచ తెలుగు మహాసభలకు మనం గవర్నమెంట్ ఖర్చుమీద వెళ్ళొచ్చు. కొంచెం శ్రమపడినట్లయితే"

 

    శాయిరామ్ మొఖంలో పూర్తి ఆనందం వచ్చేసింది.

 

    "అవును గురూ! ఆ సంగతి మర్చేపోయాను. కానీ గవర్నమెంట్ మనల్ని ఎలా పంపిస్తుందంటావ్? 'క్లూ' లేమయినా ఉన్నాయా?"

 

    "కిందటి ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళిన ప్రకాశరావ్ నాకు బెస్ట్ ఫ్రెండ్! వాడినడిగి ఇన్ ఫర్మేషన్ తెస్తాను."

 

    అందరూ తప్పట్లు కొట్టారు.

 

    అప్పుడే టాక్సీ ఒకటి రివ్వున వచ్చి మా ముందు ఆగింది.

 

    శ్యామ్ డోర్ తెరచుకుని దిగాడు.

 

    "ఏంటి బ్రదర్స్! ఏదో మీటింగ్ జరుపుతున్నట్లున్నారే" అడిగాడు చిరునవ్వుతో.

 

    అతనికి మా ఫారిన్ టూర్ విఫలయత్నాల గురించి తెలీటం ఇష్టంలేక" ఏం లేదు ఊరికినే ఏదో ఊసుపోక" అన్నాం.

 

    "అలాగా! సరే అయితే నాకు గుడ్ లక్ చెప్పండి! నేను అమెరికా వెళ్తున్నాను"

 

    అందరం నోళ్ళు వెళ్ళబెట్టేశాం.

 

    ఎవరికీ నోట మాట పెగలటంలేదు.

 

    "అ.. అ.. అమెరికా వెళుతున్నారా?"

 

    "అవునోయ్"

 

    "ఎలా వెళుతున్నావ్? అయ్ మీన్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు?" ఆత్రుతగా అడిగాడు శాయిరామ్.

 

    "ఒకడు స్పాన్సర్ చేయాల్సిన ఖర్మ నాకేంటోయ్. ఇండో-అమెరికన్ కల్చురల్ ఎక్సేంజ్ కోటాలో నన్ను సెలక్ట్ చేసుకున్నారు అమెరికా ప్రభుత్వం వాళ్ళు."
    


    మాకు మతిపోయినట్లయింది.

 

    "అమెరికా ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని ఇన్ వైట్ చేశారా?"

 

    "అవును"

 

    "ఇన్ని కోట్లమంది భారతీయులుండగా మిమ్మల్నే ఎలా పిలిచారు?"


    
    "అదంతా బ్రేడ్ సీక్రెట్!"

 

    అందరం అతని చుట్టూ మూగిపోయాం.

 

    "బాబ్బాబు? ఆ ట్రేడ్ సీక్రెట్ ఏమిటో చెప్పవూ?" శాయిరామ్ అడిగాడు.

 

    "ఇంకెవరికీ చెప్పనని మాట ఇస్తే చెప్తాను"

 

    అందరం పట్టు వేసుకున్నాం.

 

    "మరేం లేదు! ఆ అమెరికన్ కల్చురల్ ఎక్సేంజ్ సెంటర్ లో ఓ రచయిత్రి వుంది. ఆవిడ నవల నా పత్రికలో వేసుకుంటే నన్ను అమెరికా పంపిస్తానంది. అంతే!"

 

    "మరి నీకు పత్రిక ఎక్కడుంది?" అదిరిపడుతూ అడిగాడు జనార్ధన్.

 

    "ఈనెల నుంచే ఓ పత్రిక పెట్టాను. ఎన్నిలే! వెయ్యి కాపీలు అచ్చు వేయించాను. రచయిత్రికి పాతిక్కాపీలు పంపించి మిగతాది చెత్తకాగితాల షాపులో అమ్మించేస్తే సరి! ప్రాబ్లెమ్ తీరిపోతుంది. వస్తా ఫ్లైట్ కి టైమయింది" అంటూ వెళ్ళిపోయాడతను. మేము చాలా సేపటివరకూ సామాజిక కోమాలో ఉండిపోయాం.


                                                    *  *  *  *  *