"స్వయంగా కల్పించుకున్నదానికి ఇతరులు బాధ్యులుకారు."

 

    "అని నేను అనటంలేదు. మండే గుండెలు బాధను అర్ధం చేసుకోగల మనసులేని మనుషుల్ని భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడా అని..."

 

    విమల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

 

    "మాధవ్! మీరన్నది నిజం. అతి సున్నిత హృదయం గల కళాకారుడు కూడా ఒకోసారి ఒక్కొక్కళ్ళపట్ల కఠినశిలగా మారిపోతాడు. ఎందుచేత?"

 

    "సత్యం నిన్ను ప్రేమిస్తున్నాడు!"

 

    విమల చివ్వున తలెత్తిచూసింది. తను ఊహించినట్టు అతని కంఠంలో అసూయగానీ, కళ్ళల్లో ద్వేషంగానీ లేవు.

 

    "మాధవ్! అది నిజంకాదు. నానుంచి దూరంగా పారిపోయాడు. అతను నానుంచి దూరంగా వుండటానికే ఇంతపని చేశాడు."

 

    "నిన్ను నాకు దగ్గరగా చేయటానికై తను నీకు దూరంగా వెళ్ళిపోయాడు. తన స్నేహితునికోసం తన సర్వస్వాన్ని త్యాగంచేశాడు. సత్యం ముమ్మూర్తులా త్యాగమూర్తి-" అతని కంఠం వణికింది.

 

    విమల చెంపలమీద కన్నీటిబొట్లు కదిలించిన గులాబిరెక్కలమీది మంచు బిందువుల్లా జారాయి.

 

    "నా పెళ్ళయిన మర్నాడే సత్యం తిరిగి మన మధ్యకు వస్తాడు. నేనొక ఇంటివాడ్ని అయేంతవరకు అమ్మ జబ్బు నయం కాదు. సత్యానికి మనశ్శాంతి ఉండదు."

 

    "మాధవ్! ఇంతకాలం ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు?"

 

    "చెప్పి ప్రయోజనం లేదు గనక. నేను నిన్ను ప్రేమిస్తున్నానని అతనికి తెలుసు. నువ్వు నన్ను ప్రేమించటం లేదని కూడా సత్యానికి తెల్సు. మనిద్దరిమధ్యా తను అడ్డంగా వున్నట్టు భావించాడు. తొలగి దూరంగా పోయాడు. అలా మనిద్దర్నీ ఏకం చెయ్యగలడని భావించాడు. అమ్మా, నేనూ అతనికి రక్తబంధువులం కాకపోవచ్చు. అంతకుమించిన ఆత్మబంధువులం. మాకోసం ఇంత త్యాగం చేశాడు. నా పెళ్ళయిన మర్నాడే ఎక్కడున్నా రెక్కలు కట్టుకొని వచ్చి మామధ్య వాలిపోతాడు. ఆ విశ్వాసం నాకుంది."

 

    "మాధవ్! మీ ఉద్దేశ్యం నేను-" తర్వాత మాట మింగేసింది విమల.

 

    "అవును. నువ్వే కారణం, నా ప్రాణస్నేహితుడు నానుంచి దూరం కావటానికి."

 

    "ఇంకా నన్నెందుకు చిత్రవధ చేస్తారు? నన్నేం చెయ్యమంటారో తేల్చి చెప్పండి."

 

    "ఆ మాట నీ మనస్పూర్తిగానే అంటున్నావా?"

 

    "నా హృదయం ఎప్పుడో చితికిపోయింది! మీ స్నేహంకోసం, సత్యంకోసం మీరు నన్నేం చెయ్యమంటారో చెప్పండి?" నిర్లిప్తంగా అన్నది విమల.

 

    విమలకేసి మౌనంగా చూస్తూ మాధవరావు ఆలోచనలో పడిపోయాడు. విమల ఉద్దేశ్యం ఏమిటి? తనను పెళ్ళిచేసుకోవడానికి సంసిద్ధమవుతుందా? తను ప్రేమించిన సత్యంకోసం తన ప్రేమను త్యాగం చెయ్యటానికి సిద్ధం అవుతుందా?

 

    "నువ్వు చెయ్యగలిగిందీ, చెయ్యాల్సిందీ ఒక్కటే ఉంది."

 

    చెప్పండి- తలవంచుకొనే అన్నది విమల.

 

    "సత్యాన్ని పెళ్ళిచేసుకోవడం!"

 

    "మాధవ్!" విమల కళ్ళు తేజోవంతం అయాయి. అంతలోనే ఆమె కళ్ళలో నీలినీడలు ఆవరించాయి.

 

    "త్వరలోనే వస్తాడు. ఎక్కడున్నా వస్తాడు. ఏ పత్రికలోనైనా మా దంపతుల ఫోటో చూసి వస్తాడు."

 

    "మాధవ్! మీరంటున్నదేమిటి? మీ పెళ్ళి అయిపోయిందా?"

 

    "పెళ్ళికి నిన్ను పిలవకుండానే చేసుకుంటాననుకున్నావా? సత్యం లేకపోయినా మీరయినా రావాలిగదా! వచ్చే మంగళవారం. మాష్టారికి చెప్పి వెళదామని వచ్చాను."

 

    "వధువు ఎవరు? ఏ ఊరు?"

 

    "ఏ ఊరో నాకు తెలియదు. మా అమ్మ ఒక నర్సును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొన్నది. ఆవిడ్ని చేసుకోమని అమ్మగారి ఆజ్ఞ! శిరసావహించాను!"

 

    "నర్సా!"

 

    "ఏం? నర్సుమాత్రం ఆడది కాదా?"

 

    "సారీ! అదికాదు నేనంటున్నది. ఆమెను మీరు ప్రేమించారా?"

 

    "మా అమ్మగారు ఆవిడ్ని ప్రేమించారు. నేను మా అమ్మను ప్రేమిస్తున్నాను. దేర్ ఫోర్-"

 

    "మాధవ్! పరిహాసాలకు సమయాసమయాలుంటాయి. ఇష్టంలేని పెళ్ళిచేసుకొని మీరేం సుఖపడతారు? ఆ అమ్మాయినేం సుఖపెడ్తారు?"

 

    "ఇష్టంలేదని నేనలేదే?"

 

    "వేరే అనాలా? ఆ అమ్మాయిని మీరు ప్రేమించటం లేదు."

 

    "ఆ అమ్మాయీ నన్ను ప్రేమించటం లేదు. సరిపోయిందిగా?"

 

    "ఘోరంగా మాట్లాడుతున్నావు మాధవ్!"

 

    "ఇందులో ఘోరం- అన్యాయం- ఏముంది? మా అమ్మ కోరిక చెల్లించటానికి ఆ అమ్మాయి ఒప్పుకొంది. నేను ఒప్పుకొన్నాను. పెద్దవాళ్ళు చెప్పినట్టు విని, చక్కగా పెళ్ళి చేసుకొంటున్నాము. హాయిగా సంసారం చేస్తాం. పిల్లల్ని కంటాం. నర్సు కాబట్టి ఇంట్లో ఎవరికి జబ్బు వచ్చినా, హాస్పిటల్ కు వెళ్ళే అవసరం లేకుండా సేవ చేస్తుంది. అంతకంటే ఇంకా ఏం కావాలంటావ్ విమలా?" - మాధవ్ గొంతు చేదుచేదుగా తోచింది విమలకు. ముఖం వివర్ణమయింది.

 

    "ఏం? విమలా? మాట్లాడవేం? నేనూ ప్రేమించాను. మనసిచ్చాను. కాని ఫలితం ఏమైంది? నా ప్రేమ తిరిగి ప్రేమను పొందలేకపోయింది. తిరస్కారాన్నే పొందింది. అందుకే ఆ నర్సును కూడా ప్రేమించలేదు. ఇప్పుడు అర్ధం అయిందా విమలా?"

 

    విమల కళ్ళల్లో నీళ్ళు ఉబికి వస్తున్నాయి. కన్నీటి పొరల్ని చీల్చుకొంటూ ఆమె మాధవ్ ను చూట్టానికి ప్రయత్నించింది.

 

    మాధవ్ లేచి నిలబడ్డాడు.

 

    "మాష్టారు రాగానే చెప్పు, పెళ్ళికి పిలవటానికి మాధవ్ వచ్చాడని. రేపో ఎల్లుండో శుభలేఖ పోస్టులో పంపుతాను! నాన్నగారిని తీసుకొని నువ్వు పెళ్ళికి తప్పక వస్తావుగదూ?"

 

    విమలకేసి చూడలేకపోయాడు మాధవ్. తలవంచుకొనే మెట్లు దిగాడు. గేటు తీసుకొని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.


                                          28


    "మొన్ననే వస్తానన్నారుగా?" తండ్రికి కాళ్ళకు నీళ్ళిచ్చి తువ్వాలు అందిస్తూ అడిగింది విమల.

 

    "మహర్షి ఆశ్రమంలో వున్నది మూడురోజులే నమ్మా! మూడురోజులూ మూడు క్షణాల్లా గడిచిపోయినై. సత్యం బలవంతం మీద అక్కడ నుండి మద్రాసువెళ్ళి అక్కడ ఓ రోజు ఉండివచ్చాను. అతడ్ని చూసి ఎన్నాళ్ళో అయిందిగా? ఆ ఒక్కరోజు ఉంటేనే పరమానందభరితుడై పోయాడు. అలాంటి శిష్యుడ్ని పొందటం నా అదృష్టమేనమ్మా!" తువ్వాలుతో ముఖం తుడుచుకుంటున్న తండ్రి, కూతురుముఖంలో విరిసిన ఇంద్రధనుస్సును చూడలేదు.

 

    "సత్యం కన్పించాడా! ఎక్కడా? ఎప్పుడు నాన్నా?"

 

    "రమణాశ్రమంలోనే కన్పించాడు. సరిగ్గా నేను బయలుదేరదామనుకొన్న రోజే!"

 

    "రమణాశ్రమంలో ఉంటున్నాడా?" విమల కళ్ళముందు చీకట్లు కమ్మాయి. గొంతులో అపస్వరాలు పలికాయి.

 

    "లేదమ్మా! నాలాగే చూట్టానికి వచ్చాడు. గురు-శిష్యులం కాకతాళీయంగా కలుసుకున్నాం. ఒకరోజు తను ఆలస్యంగా వచ్చినా, ఒకరోజు ముందు నేను అక్కడనుండి బయలుదేరినా కలుసుకోలేకపోయేవాళ్ళం. అంతా మహాఋషి అనుగ్రహం అనుకో తల్లీ!"

 

    తనయ తహతహను తెలుసుకోలేని తండ్రి తాపీగా మహాఋషి అనుగ్రహాన్ని గురించి చెప్పుకుపోసాగాడు.

 

    "నాన్నా! సత్యం ఎక్కడ వుంటున్నాడు? ఏం చేస్తున్నాడు నాన్నా!" ఎంత తొక్కిపట్టినా ఆమె తనలో పొంగివస్తున్న ఉద్వేగాన్ని అణుచుకోలేకపోయింది.

 

    "మద్రాసులో ఉంటున్నాడమ్మా! త్యాగరాయనగర్ లో మరో ఆర్టిస్టుతో కలిసి 'కళానిలయం' పేరుతో ఒక స్కూలు పెట్టాడు. ఓ పాతిక ముప్పైమందిదాకా విద్యార్ధులు ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెద్దగా మిగిలేది ఏమీలేకపోయినా, వచ్చేది సరిపోతుందన్నట్టు మాట్లాడాడు. తమకు వచ్చిన చిత్రకళను నలుగురికీ చెప్తున్నామన్న ఆత్మతృప్తి ఒకటి పొందుతున్నట్లు వాళ్ళ మాటలు వింటుంటే నాకు అర్ధం అయిందమ్మా!" పడక కుర్చీలో మేను వాల్చి ప్రయాణపు బడలిక తీర్చుకుంటూ చెప్పాడు కేశవరావు.

 

    "ఇంకా ఏమన్నాడు నాన్నా?"

 

    "మనిషి పైకి కంపించనీయడుగాని లోపల ఏదో అగ్ని పర్వతాన్ని పెట్టుకొన్నవాడిలా నాకనిపించాడు. తను మద్రాసులో ఉన్నట్టు మాధవరావుకు తెలియనీయ వద్దన్నాడు. ఎంత తరచి తరచి అడిగినా ఏమీ బయటపెట్టలేదు" అంటూ నిట్టూర్చాడు కేశవరావు. పక్క టేబుల్ మీదున్న దినపత్రిక తీసుకొంటూ "ఇదెక్కడనుండి వచ్చిందమ్మా?" అంటూ శుభలేఖ అందుకొన్నాడు.

 

    "మాధవరావు పెళ్ళి నాన్నా! మొన్న అతను వచ్చి వెళ్ళాడు మీకోసం!"

 

    "పెళ్ళా? శుభం! ఎప్పుడూ?" అంటూ కేశవరావు కవరులోనుంచి వెడ్డింగ్ కార్డుతీసి చదవసాగాడు.

 

    "నాన్నా! మాధవరావు పెళ్ళి అని తెలియజేస్తూ సత్యానికి టెలిగ్రాం ఇవ్వండి."

 

    "అదేమిటి విమలా! సత్యం తను ఎక్కడ వుందీ వాళ్ళకు తెలియనివ్వదు అంటుంటే టెలిగ్రాం ఇవ్వమంటావు?"

 

    "మాధవరావు పెళ్ళిసంగతి వింటే తప్పకుండా వస్తాడు. ఆ రోజుకోసమే సత్యం అజ్ఞాతవాసం గడుపుతున్నాడు. నాకు తెలుసు నాన్నా! సత్యం తప్పకుండా వస్తాడు. వాళ్ళిద్దరూ ఒక తల్లి కన్న బిడ్డలకంటే మిన్నగా ఉంటారు."

 

    తండ్రి, కూతురుకేసి విస్మయంగా చూశాడు. అతని మనసులో ఏవేవో పాత జ్ఞాపకాలు మెదిలాయి. మాధవరావు-విమలా-సత్యం-వారిమధ్య తనకు ఇదమిద్దమని తెలియని అనుబంధాలేవో ఉన్నాయని మాత్రం తనకు తెలుసు. తెలిసీ తను చేయగలిగిందేమీలేదు. అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు.

 

    రమణ మహర్షి ఆశ్రమంలో మూడురోజులు కేశవరావు పొందిన ఆముష్మికానందం తాలూకు అనుభూతులూ, స్మృతులూ తృటికాలంలో ఎగిరిపోయాయి.

 

    విమల.విమల! రేపు తను కన్నుమూస్తే తన కూతురి భవిష్యత్తు ఏమిటి? ఈ లోకంలో అన్నీ పోగొట్టుకున్న విమలకు 'నా' అని పలకరించే దిక్కుకూడా లేకుండా పోతుందే?

 

    కేశవరావు కనిగుంటలు చలమగుంటలు అయాయి. కళ్ళు మూసుకొని శుభలేఖ ముఖానికి అడ్డం పెట్టుకొన్నాడు.

 

    "నాన్నా౧ ఇప్పుడు టెలిగ్రాం ఇస్తేగాని సత్యం పెళ్ళికి అందుకోలేడు."

 

    "ఆ టెలిగ్రాం ఏదో నువ్వే ఇవ్వమ్మా!"

 

    "అడ్రసు?"

 

    "కళానిలయం, త్యాగరాయనగర్, మద్రాసు. అంటే, టెలిగ్రాం చేరుతుందనుకొంటాను."


                                         29


    ప్లాట్ ఫారం మీద నిలబడ్డ విమల గుండెలలో రైళ్ళు పడుగెడుతున్నాయి. రైలుమాత్రం ప్లాట్ ఫారం మీద లేదు. వచ్చే సూచనలుకూడా లేవు. టైం చూసుకొన్నది. ఎనిమిదీ పదిహేను అయింది. ఏడూ నలభై అయిదుకు రావాల్సిన బండి అరగంట లేటయితే ఎనిమిదీ పదిహేనుకు రావాలి. మరో ఐదు నిముషాలు కాళ్ళు మార్చుకుంటూ ప్లాట్ ఫారం మీదే నిలబడింది.

 

    తను అంతకుముందు చూసింది పొరపాటేమోనన్న ఆలోచనతో, లేట్ ఎరైవల్స్ సూచించే బోర్డు దగ్గర కెళ్ళింది విమల. నల్లబోర్డుమీద మద్రాసు హైదరాబాదు ఎదురుగా ఉన్న అర్ధగంటను తుడిచి 'గంట' వదిలేసి పోతున్నాడు ఓ రైల్వే ఎంప్లాయి.

 

    విమల గుండెల్లో రాయిపడింది. అంటే బండి వచ్చేది ఎనిమిదీ నలభై ఐదుకు. ముహూర్తం ఎనిమిదీ యాభయ్ కు. ఐదు నిముషాల వ్యవధి. స్టేషన్ నుంచి బయట పడినేరుగా పెళ్ళి పందిట్లోకి వెళ్ళినా కనీసం ఇరవై నిముషాలన్నా పడుతుంది. మాధవరావు పెళ్ళి కళ్ళారా చూట్టానికి సత్యం ఎంత ఉవ్విళ్ళూరుతున్నాడు. మాంగల్యం కట్టే సమయానికన్నా అందుకోగలిగితే ఎంత బాగుంటుంది? నవ వధువుతో పీటలమీద కూర్చున్న మాధవరావు సత్యాన్ని చూసి ఎంత సంబరపడిపోతాడో? రాజమణిదేవి ఎంత సంబరపడిపోతుందో? ఆమెను చూసి చాలాకాలం అయింది, ఏమనుకుంటుందో! సత్యం వెళ్ళిపోయాక తనకు, ఆ ఇంటికి వెళ్ళాలంటేనే మనస్కరించటం లేదు.

 

    బెంచీమీద కూర్చుని సత్యం రాకకు ఎదురు చూస్తున్న విమల శరపరంపరలుగా వస్తున్న ఆలోచనలలో మునిగిపోయింది.

 

    అరగంట గడిచింది. అయినా బండి రాలేదు. ప్లాట్ ఫారం మీద గడియారంలోని పెద్దముల్లు ఎవరో తోస్తున్నట్టు ఉండి ఉండి క్రమబద్ధంగా తూలిపడుతోంది.

 

    తొమ్మిదీ అయిదు. మంగళవాయిద్యాలు-మాంగల్యధారణ-జనం తలంబ్రాలు- వధూవరులమీద చల్లుతున్నారు. తెలిసీ తెలియని వయస్సు. మూడు ముళ్ళూ వేసి పక్కన కూర్చున్న అతన్ని క్రీగంట చూసింది తను. ఎలా ఉన్నాడూ? తన మనసులో కలిగిన భావాలేమిటి? గుర్తు రావటం లేదు. ఎవరో అరుస్తున్నారు. పెండ్లికొడుకు బండి బోల్తా కొట్టింది. తన గుండెలు చిక్కబడ్డాయి. పెళ్లికొడుక్కు మోపైన గాయాలు తగిలినై-ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదంగా ఉంది. అంతా అయిపోయింది. తన గుండెలు బ్రద్దలయాయి. తనను నాన్న గుండెలకు హత్తుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. మెళ్ళో తాడు గుంజారు. మూడు ముళ్ళు వేసింది- ఒక్కసారే తెగిపోయింది. తనకంతా చీకటి. ఎన్నాళ్ళుందో? ఆ చీకట్లో. తనకే తెలియదు. మళ్ళీ నాన్న చదువుకోమన్నాడు. ఉన్న ఊరు విడిచి నాన్నతో బయలుదేరింది. తెల్లవారింది. చీకట్లు విచ్చిపోయాయి. కాంతిరేఖలు పొడచూపాయి. చిత్రకళా ప్రదర్శనంలో మళ్ళీ చూసింది. ఆ చిత్రాల్లో సత్యం - శివం - సుందరం.

 

    "హల్లో! ఈ చిత్రకారుడెవరో మీకు తెలుసా?" మాధవరావు పలకరింపూ, కొంటెచూపులూ, చిలిపి అల్లరి.

 

    మాధవరావు - సత్యం ప్రాణ స్నేహితులు -

 

    ప్లాట్ ఫారం మీదకు కూలీలు పరుగులు తీస్తున్నారు. తన కాళ్ళకింద నేల కదులుతూ ఉంది. రైలు వస్తూంది. సత్యం వస్తున్నాడు.

 

    "నీకు తెలుసా! మాధవరావు నీకోసమే కాదు మనకోసమే ఈ పెళ్ళి చేసుకుంటున్నాడు. ఇష్టంలేని అమ్మాయిని చేసుకొంటున్నాడు. నువ్వు చేసిన త్యాగం అతడ్ని కదిలించింది. త్యాగం త్యాగాన్నే పురిగొల్పుతుంది. ద్వేషం ద్వేషాన్నే రెచ్చగొట్తుంది. మీ స్నేహం అనిర్వచనీయం. అజరామరం. మాధవరావు! నన్ను క్షమించు. నీలో యింతటి ఉన్నతభావాలున్నాయని నేను గ్రహించలేకపోయాను. ఒడుదుడుకులుగా కన్పించే నీ స్వభావం అంతరాంతరాల్లో ఎంత సున్నితమైంది!