అక్కయ్య

    అక్కయ్య! ఛీ! అసలు దాన్ని అలా పిలవాలంటేనే అసహ్యంగా ఉంది! తనకే కాదు అమ్మకి, నాన్నకి, బంధువులకి, అందరికీ అదంటే అసహ్యం! దాని వేషాలూ, చేష్టలూ - ఛఛ! అసలు దానితో మాట్లాడాలంటేనే ఒళ్ళు కంపరమెత్తుతూంది! కానీ తప్పదు. ఇంట్లో అందరూ దాని సంపాదన మీద ఆధారపడ్డారు. దాని జీతంపైన బతుకుతున్నారు. ఆ జీతంలోంచే తనూ బట్టలు కొనుక్కుంటోంది. స్కూల్ ఫీజ్ కడుతోంది. అందుచేత అది చేసే పనులకి వ్యతిరేకత తెలియపరచలేదు. తన అయిష్టతని తెలియజేయడానికి కూడా వీల్లేదు. తెలియజేస్తే తనకు జరిగేదేమిటో కూడా బాగా తెలుసు. అనుభవం కూడా ఉంది.

 

    "నేను చేసే పనులు నచ్చకపోతే ఇంట్లోంచి పోండి!" అనేసిందోసారి. అంత లెక్కచేయని స్వభావం దానిది.

    అక్కయ్య పూర్వం ఇలా ఉండేదికాదు. ఉద్యోగంలో చేరకముందు అసలు మాట్లాడేది కాదు. తగని సిగ్గు, నాన్నగారి కోసం ఎవరన్నా వచ్చినా వాళ్ళకు కాఫీకూడా ఇచ్చేదికాదు. వాళ్ళు వెళ్లిపోయేవరకు గదిలోంచి బయటకు వచ్చేదేకాదు. అది ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలు వ్రాస్తూండగా పక్షవాతం వచ్చి నాన్న ఉద్యోగం పోయింది. కంపెనీ వాళ్ళిచ్చిన డబ్బు సంవత్సరంలోనే ఖర్చు అయిపోయింది. అప్పుడే అక్కయ్యకి పెళ్ళి చెయ్యాలని నాన్న ఎంతో ప్రయత్నం చేశారు. కానీ, సరి అయిన సంబంధం ఒక్కటికూడా కుదరలేదు. విసిగి వేసారి పోయారాయన. అప్పటినుంచీ కనబడిన ఉద్యోగానికల్లా అప్లై చేయించటం మొదలెట్టారు. రెండేళ్ళ తరువాత కో - ఆపరేటివ్ బాంక్ లో ఉద్యోగం దొరికింది.

    ఉద్యోగంలో చేరిన చాలారోజులు ఆమెలో ఏ మార్పూలేదు. తలవంచుకుని బాంక్ కెళ్ళి, ఐదవగానే తిరిగి అలానే ఇంటికి వచ్చేసేది. జీతం తెచ్చి అమ్మ చేతికి ఇచ్చేది. తనకేం కావాలన్నా అమ్మనే అడిగేది. తరువాత తరువాత ఆమె ప్రవర్తన కొంచెం కొంచెం మారుతూ వచ్చింది. ఆ రోజు తనకి బాగా గుర్తుంది. అక్కయ్య ఇంటికి ఆలస్యంగా వచ్చింది.

    "ఆలస్యం అయిందేం, లలితా!" అని అమ్మ అడిగేసరికి తడబడి, కంగారుగా "ఆఫీసులో పనుంది" అంటూ చెప్పింది.

    అప్పుడే దాని జవాబులో తనకి అసహజత్వం గోచరించింది. ఆ రోజు నుండి దాని అలంకరణలో కూడా చాలా మార్పు కనబడింది. తరువాత కొద్ది రోజుల్లోనే బజారుకి ఒంటరిగా వెళ్ళి సో, మంచి పౌడరు, ఖరీదైన చీర కొని తెచ్చుకుంది. దానికి అమ్మ ఏమీ అనలేదు. ఆ నెలలో అమ్మకి చాలా తక్కువ డబ్బు ఇచ్చింది.

    "నేనో వంద రూపాయలుంచుకొన్నాను. నా ఖర్చుకు కావాలి!" అని చెప్పింది. ఖరీదైన అలంకరణ చూసి అమ్మ మందలించబోతే, "సంపాదిస్తున్న దాన్ని కొంచెం ఖర్చుచేసుకోడానికి అధికారం లేదా?" అని ఎదురు తిరిగింది.

    ఓ రోజు తను బయట మంచంమీద కూర్చుని పూలు గుచ్చుతూ ఉంటే ఓ యువకుడు గేటు దగ్గిర తనవంకే చూస్తూ నిలుచున్నాడు.

    "ఎవరు కావాలి!" లేచి నిలుచుంది తను.

    "లలిత ఉందా?" అన్నాడతను.

    "ఉంది- ముందు మీరెవరో చెప్పండి?"

    "ఆమెని పిలవండి. నేను ఆమెతోపాటే పనిచేస్తున్నాను."

    ఈలోగా లలిత బయటికి వచ్చింది. ఓహ్.... మీరా! రండి!"'  అంటూ అతన్ని లోపలికి ఆహ్వానించింది. లోపల కూర్చున్నాడతను.  

    "ఇటు మా ఫ్రెండ్ ఇంటికి వెళుతూ మీరిక్కడే ఉంటారని గుర్తుకొచ్చి వచ్చాను" అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ.

    "అవును . లేకపోతే రాకూడదు కాబోలు" అక్కయ్య అంది.

    "ఆవిడ మీ చెల్లాయి కాబోలు. దబాయించేసింది నన్ను..."

    "టేకిట్ ఈజీ... దానికేం తెలీదు."

    ఇద్దరూ నవ్వుకున్నారు. అక్కయ్య అతనితో చనువుగా ఉండడం చూస్తే చికాకు కలిగింది నాకు. అది చాలదన్నట్లు నాన్నగారికి కూడా పరిచయం చేసింది. కాఫీలయ్యాక అతను వెళ్ళిపోయాడు. అతన్ని గేటు వరకు పంపి లోపలికి వస్తూన్న అక్కయ్యతో ఓ వింత కాంతిని తను గమనించింది.    

    వారంరోజులు గడిచాయి. ఆ సాయంత్రం అక్కయ్య ఆఫీసు నుంచి ఇంటికి రాలేదు. రాత్రి ఎనిమిదిన్నరయింది. అమ్మా, నాన్న కంగారుపడిపోతున్నారు. తనకి భయం వేసింది. అందరూ అంత కంగారు పడుతూంటే తను నింపాదిగా తొమ్మిదీ ముప్పావుకి రిక్షా దిగింది.

    "ఎక్కడికెళ్ళావే?" అమ్మ అడిగింది మందలింపుగా.

    "మా ఫ్రెండ్ తో సినిమాకి వెళ్లాను. అయినా, ఎక్కడికి పోతాననుకున్నారు?" చిరాకుపడింది.

    "ఎవరే ఆ ఫ్రెండ్?" కోపంగా అడిగింది అమ్మ.

    "మొన్న మనింటికి వచ్చినతను" నిర్భయంగా అంది అక్కయ్య.

    చాలా సేపటివరకు అమ్మకి నోటమాటలేదు. తరువాత ఏడ్చెయ్యటం మొదలుపెట్టింది.

    "మన పరువు, ప్రతిష్ట ఏమయినా ఉంటాయా ఇక? మగాడితో సినిమా కెళ్ళడమేంటి? ఎవరన్నా చూస్తే నీకు పెళ్ళవుతుందా? అసలు నువ్వు ఉద్యోగం అఘోరిస్తున్నందుకే ఛస్తున్నాం!"

    "నువ్వేం బాధపడిపోనక్కర లేదు. అతను నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. నీతోను, నాన్నతోకూడా వచ్చి చెబుతానన్నాడీ సంగతి!"

    అమ్మ నిశ్చేష్టురాలైంది. అనుకోని సంఘటన. మరింకేమీ మాట్లాడకుండా తన మంచాన్ని చేరుకుంది. అమ్మలో ఏదో దిగులు...

    మర్నాడు సాయంత్రం అతను మళ్లీవచ్చాడు. అక్కయ్యా, అతనూ కలిసి వెళ్ళిపోయారు. రాత్రి తొమ్మిది దాటిన తరువాత తిరిగి వచ్చింది అక్కయ్య.

    "అతన్ని మనింటికి రావద్దని చెప్పు" తీవ్రంగా అన్నది.

    "సరే! పార్కులో కలుసుకుంటా!" పెంకిగా చెప్పింది అక్కయ్య.

    తనకి అక్కయ్యమీద విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడే మొదటిసారిగా అనుకుంది తను- ఎలాగైనా తనూ కష్టపడి చదివి, ఓ ఉద్యోగం సంపాదించి అమ్మనీ, నాన్ననీ తనతో ఉంచుకోవాలి! ఇలాంటి మనిషిమీద ఆధారపడి ఉండడంకన్నా అడుక్కోవడం మంచిది! ఆరోజు నుంచీ మనసంతా - ఎంతో దీక్షగా చదువుపైన లగ్నం చేసింది. ఎస్ ఎస్ ఎల్ సి పాసయింది. కాలేజీలో చేరమని అక్కయ్య చెప్పింది కానీ, తను ఒప్పుకోలేదు. టైపు నేర్చుకొంటూ ఉద్యోగం ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. టైపు లోయర్ పాసయి నెలరోజులు అవుతుంది. ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు. ఈలోగా అక్కయ్య పరిస్థితి మరీ హీనంగా మారిపోయింది. ఒక ధనవంతునితో కారులో తిరుగుతూ కనిపించింది రెండు మూడుసార్లు పెళ్ళి చేసుకుంటానని చెప్పిన అతనితో తిరగడం మానేసింది. ఓ రోజు రాత్రంతా ఇంటికి రాలేదు. అమ్మ దాన్ని గురించి పట్టించుకోవడం మానేసింది. తనకే అసహ్యం వేసి నాలుగూ దులిపేసింది.

    "రాత్రంతా కూడా ఇంటికి రావడం లేదేం? అంత సిగ్గులేనిదానిగా తయారయ్యావా? నువ్వు పెళ్ళాడతానన్నావుగా! అతను కనబడడం లేదేం? పెళ్లెందుకు అవలేదింకా? కారులో అతను ఎవరు? అతన్నీ పెళ్ళాడుతున్నావా? ఛీఛీ- పెద్దదానివి- నాకు చెప్పవల్సింది పోయి, ఇలా చేస్తావా?" ఆ రోజు మొదటిసారిగా అక్కయ్య ఏడ్వడం తను చూసింది. తనకి జాలి కలగలేదు. ఇంత జరుగుతున్నా ఏమాత్రం నోరు విప్పలేదు. ఓ రోజు అమ్మ ఏడుస్తూంటే, "నేనేం చేయలేని అసహాయుణ్ణి! దాన్ని కాదని మనం మాత్రం చేయగలిగిందేముంది? దాని పెళ్ళి చేయడం చాతకాని మనిషిని నేను. దాన్నేమని మందలించను? దేవుడికి ఎంతో ద్వేషం ఉంటేగాని ఇలాంటి పరిస్థితులు కల్పించడు. నాకింకా దాని విషయాలేం చెప్పకు. అది నా అసమర్థతని వేలెత్తి చూపడమే! లేదా, మీ చేత్తో ఇంత విషం ఇస్తే హాయిగా కళ్ళు మూస్తాను" అన్నాడు నాన్న ఏడుస్తూ. మానసికంగా ఆయననుభవిస్తున్న బాధ ఆ రోజు ఆయన గొంతులో గోచరించింది. తనని దగ్గరికి పిల్చి తన తల నిమురుతూ చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు నాన్న!