చాయకి తన చింకి చాపా, చాలీ చాలని చిరుగుల దుప్పటీ గుర్తొచ్చాయి. నిస్సహాయంగా తల అడ్డంగా ఆడించింది.
    
    "మొత్తం సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి చక్రవర్తిని అనార్కలీ దానిమ్మ మొగ్గలు అడిగినట్లు వెధవ సెంట్లకీ, చీరలకీ ఆశపడ్తావేం" హేళనగా అంది మనసు.
    
    చాయ చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది.
    
    "నువ్వు చాలా అందగత్తెవు. నీది అపురూపమైన అందం" జ్ఞానబోధ చేస్తున్నట్లుగా అంది మనసు.
    
    "చాలు.....ఇంకేం చెప్పకు" లేచింది చాయ.
    
    చాయ ఊపిరి బిగించి చూసింది.
    
    సంధ్య మళ్ళీ గుండెలమీద చెయ్యి వేసుకుని నిశ్చింతగా నిద్రపోతోంది.
    
    శబ్దం కాకుండా తలుపు తెరుచుకుని బయటపడింది చాయ.
    
    ఆ నిశీధిలో కీచురాళ్ళ రొద ఆమెకు స్వాగతగీతాల్లా వినిపిస్తున్నాయి. ఈసారి ఆ భవనంలోని ఏ వస్తువునీ ఆమె కళ్ళు విప్పార్చుకుని ఆశ్చర్యంగా చూడలేదు. వాటి ఖరీదుల్ని అంచనా వేస్తున్నట్లుగా చూసింది. అతి నిదానంగా ఏ తడబాటూ లేకుండా మెట్లెక్కి పైకి వెళ్ళింది.
    
    రాధామాధవుల కర్టెన్ గాలికి అల్లల్లాడిపోతోంది. ఆ కర్టెన్ పక్కకి తొలగగానే ఆమెకి మంచంమీద పడుకున్న కాంచన కనిపించింది.
    
    కాంచన బాధతో విలవిలలాడుతున్నట్లుగా తల అటూ ఇటూ తిప్పుతోంది.
    
    చాయకి ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించింది. చప్పున అక్కడినుండి కదిలి జయచంద్ర గది దగ్గరకు వచ్చింది.
        
    తలుపు వేసి వుంది.
    
    ఈ తలుపు తెరవడం నాకు పెద్దకష్టం కాదు అనుకుంది.
    
    రాత్రంతా భార్య బాధతో విలవిలాడుతూ అక్కడా....ఒంటరితనంతో భేటీపడుతూ ఇతను ఇక్కడా.....రంగం సిద్దంగానే వుంది.
    
    చాయ పెదవులమీద చిరునవ్వు పరుచుకుంది. అలవోకగా తలుపుని చేతితో తోసింది. అది నిశ్శబ్దంగా తెరుచుకుంది.
    
    ఆలోచనలతో, ఒంటరితనంతో, యుద్ధంచేస్తున్న జయచంద్ర నెమ్మదిగా కనులు విప్పిచూసాడు.
    
    వెలుగు చీకట్ల నడుమ నిలబడ్డ ఎంకిలా చాయ గుమ్మంలో కనిపించింది. ఆమె మెడలోని ముత్యాలహారం అతనిలో ఏవో జ్ఞాపకాలని తట్టిలేపింది. కాంచనకి తొలిరేయినాడు తాను ప్రేమగా అలంకరించిన హారం అది. కాంచన సంధ్యకి ఇచ్చినట్లుంది. ఇప్పుడు ఇలా....ఆమె మెడలో చూడడం అతనికి ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించింది.
    
    చాయ అడుగు ముందుకు వేసింది.
    
    జయచంద్ర కళ్ళు మూసుకున్నాడు. అతడికి ఆమె రాక ఉద్వేగాన్ని అలజడినీ సమానంగా కలిగించింది. ఎందుకు వచ్చిందో అర్ధంగాక అచేతనంగా వుండిపోయాడు.
    
    చాయ అతని మంచం దగ్గిరికి వచ్చింది.
    
    అతను ఊపిరి బిగబట్టి పడుకున్నాడు. ఆమె ముందుకు వంగినట్లు ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలు అతని ముక్కు దగ్గరగా తగలడంవల్ల తెలుసుకున్నాడు.
    
    జయచంద్ర రక్తప్రసారంలో వేగం పెరిగింది.
    
    ఒకటి.....రెండు......మూడు......నాలుగు.....అయిదు సెకన్లు గడిచిపోతున్నాయి. అతను వూహించి]నట్లుగా ఆ పెదవుల స్పర్శ అతనికి తగల్లేదు. అంత దగ్గరగా వున్న ఆమె శరీరం అతన్ని రెచ్చగొడుతోంది. బలవంతంగా కళ్ళు మూసుకునే వుండిపోయాడు.
    
    ఆమె జడలోని మల్లె ఒకటి రాలి అతని గుండెలమీద పడింది.
    
    తన గుండె సవ్వడి ఆ గదిలో ప్రతిధ్వనిస్తోందా అనిపించింది అతనికి అయినా కళ్ళు తెరవలేదు.
    
    ఆమె తన తలమీద చేత్తో నిమిరినట్లు తోస్తోంది. కానీ ఆ చేతిస్పర్స అందలేదు. ఆమె ఇంకా దగ్గరగా వచ్చినట్లుగా గుప్పున గుబాళించింది ఇంటిమేట్ స్ప్రే పరిమళం.
    
    'భగవంతుడా! నాకు నిగ్రహాన్ని ఇవ్వు' అనుకున్నాడు ఇంకా కళ్ళు గట్టిగా మూసుకున్నాడు జయచంద్ర.
    
    ఆ రోజు టీవీలో చూసిన పార్లమెంట్ న్యూస్ ప్రత్యక్ష ప్రసారాన్ని గుర్తు చేసుకోవాలని ప్రయత్నించాడు.
    
    కాలిమీద మెత్తగా ఏదో పాకినట్లయింది. నిగ్రహాన్ని కూడగట్టుకుంటూ ఎంపీల మొహాల్ని గుర్తు చేసుకున్నాడు.
    
    ముఖానికి కొద్దిగా గట్టిగా, కాస్త మెత్తగా ఏదో తగిలింది.
    
    పూలన్ దేవి తుపాకీ పట్టుకుని పార్లమెంట్ లో మాట్లాడుతున్నట్లు ప్రధానమంత్రి గడగడా వణుకుతున్నట్లు వూహించుకున్నాడు.
    
    చెంపలమీద మెత్తని స్పర్శ కి వళ్ళంతా ఏదో తెలియని తీపి బాధతో వణికింది. ఆ తగిలిన వస్తువు ఏమిటో వూహించ ప్రయత్నించాడు. అతని ఊహకి అందలేదు. అతనికి వచ్చిన వూహలకి పెదవులమీద అతనికే తెలియకుండా చిరునవ్వు ప్రవేశించింది. ఇంకా ఆగలేక చెయ్యేసి పట్టుకోబోయాడు. చేతికి అందలేదు. అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం మనసుని నిలువనియ్యక ఠక్కున కళ్ళు తెరిచేసాడు.
    
    అతని కళ్ళకి అప్పుడే గది గుమ్మం దాటి వెళ్ళిపోతున్న చాయ వెనకనుండి కనిపించింది.
    
    ముకహానికి గట్టిగా తగిలిన వస్తువు ఏమిటో తెలిసినట్లయి నరాలు మెలికితిరిగి అంతలోనే నవ్వు కూడా నవ్వింది.
    
    గదిలోకి వచ్చి సంధ్య ముఖంవైపు చూసింది చాయ.
    
    సంధ్య ప్రశాంతంగా నిద్రపోతోంది.
    
    ఆ ప్రశాంతతని చూడలేనట్లు చాయ బెడ్ లైట్ ఆర్పేసింది.
    
    ఆమెకి ఒక్కక్షణం కిరణ్ మదిలో మెదిలాడు.
    
    ప్రేమ......ప్రేమ అంటాడు పాపం, అదెలా వుంటుందో అనుకుంది జాలిగా.
    
                                             * * *
    
    ఉదయం పది గంటలైంది.
    
    జయచంద్ర మరోసారి హారన్ కొట్టి విసుగ్గా కిటికీలోంచి తల బయటకి పెట్టిచూశాడు.
    
    "వన్ మినిట్. వచ్చేస్తున్నాం డాడీ" సంధ్య బ్రతిమాలుతున్నట్లు అని మళ్ళీ లోపలికి వెళ్ళింది.
    
    ఆ అమ్మాయి కూడా సంధ్యతో పాటు వస్తుంది, కారులో కూర్చుంటుంది అనుకోగానే అతని నుదుటికి చెమటపట్టింది. జేబులోంచి కర్చీఫ్ తీసి అడ్డుకుంటూ అప్రయత్నంగా పైకి చూశాడు.
    
    కాంచన కిటికీ దగ్గర కనిపించలేదు.
    
                                                              * * *