మనశ్శాంతి కరువైందా.. వెంటనే ఈ నాలుగు విషయాలు వదిలెయ్యండి..

జీవితంలో మనశ్శాంతి కరువైందని చెప్పేవారు చాలామంది ఉంటారు. మనశ్శాంతి ఉంటే ఎంత సమస్యలు ఎదురైనా వాటిని చాలా నేర్పుగా ఏదుర్కొంటారు.  చాలామంది మనశ్శాంతి కేవలం సమస్యల  వల్ల ఉండదని  అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మనశ్శాంతి అనేది సమస్యల వల్ల కాదు చేతులారా చేసే నాలుగే నాలుగు పనుల వల్ల కోల్పోతారు.  సెల్ప్  లవ్ ఉన్నవారు తమ మనశ్శాంతిని పోగొట్టుకోకుండా దాన్ని ఎవరి గుప్పెట్లో వారు ఉంచుకోవాలంటే కేలవం నాలుగు పనులు చేస్తే చాలు. ఆ నాలుగు పనులు ఏంటో తెలుసుకుంటే..

ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరం ఉండటం..

చాలా సార్లు ఆత్మీయులుగా అనిపించే   కుటుంబం, స్నేహితులు మరియు జీవిత భాగస్వామి మొదలైనవారు   ఆందోళనలకు దుఃఖాలకు కారణం అవుతారు.  అయితే దీన్ని అంగీకరించడం చాలా కష్టం. వాళ్లు నా వాళ్ళు వారి గురించి ఇలా అనుకుంటే ఎలా నేను పొరపడుతున్నానేమో అని మభ్యపుచ్చుకోవడం చాలామందిలో కనిపిస్తుంది. మరికొన్నిసార్లు నా వాళ్లే కదా నా మంచికోసమే చేసుంటారు అనే ఒకానొక అమాయకపు భావన కూడా మూర్ఖులుగా మార్చేస్తుంది. కానీ ఒకరి  శాంతి,  ఆనందం కోసం  ఇతరుల జీవితాలను ఇబ్బందులకు గురిచేయడం ఎప్పుడూ సరైనది కాదని తెలుసుకోవాలి. అందరూ మీ జీవితాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందుల పాలు చేస్తుంటే   అది  చాలా నష్టాన్ని కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని  జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నవారికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.

ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని వదిలేయడం..

మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఎక్కడ పని చేస్తారు? ఈ విషయాలు ఎక్కువగా  జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడితో కూడిన వాతావరణం  ఆనందాన్ని,  శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ గురించి శ్రద్ధ వహిస్తే, జలగలాగా మీ మనశ్శాంతిని నెమ్మదిగా నాశనం చేసే  వాతావరణం నుండి వెంటనే  దూరం వెళ్లాలి. లేకపోతే అది క్రమంగా మానసిక జబ్బున్న వ్యక్తిగా మిమ్మల్ని మార్చేస్తుంది.

బయటి విషయాలను బాధ్యులుగా మార్చకుండా ఉండటం..

మీరు మీ సమస్యలన్నింటికీ బయటి  పరిస్థితులను నిందిస్తే  జీవితంపై నియంత్రణను కోల్పోతారు. ఇలా చేసేవారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని వదిలివేస్తారు. ఇలాంటి  పరిస్థితిలో సొంతంగా చేసే   తప్పులు,  బాధల బాధ్యతను,  పర్యావసానాలను  అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  ఈ రోజుకు   రేపటిని మార్చే శక్తి ఉంటుందనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

అందరినీ సంతోషంగా ఉంచడానికి తమ సంతోషాన్ని త్యాగం చేయడం..

అందరినీ సంతోషంగా ఉంచడం సాధ్యం కాని పని . ఇలాంటి  పరిస్థితిలో తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ  ఇతరులకు సుఖాన్ని లేదా ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. అందువల్ల, ఒక వ్యక్తి తన స్వంత ఆనందాన్ని త్యాగం చేయడం ద్వారా ఇతరులను సంతోషంగా ఉంచడానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేని మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

                                                       *నిశ్శబ్ద.