రాధ గోడన వేళ్ళాడుతున్న మాధవస్వామి పటమువేపు చూసింది.
    
    అక్కడ నిశ్శబ్దం నిండి కూర్చుంది.
    
    ఎవరిమటుకు వాళ్ళకే నోళ్ళు తెరవడానికి భయంవేసి చలిమంట చుట్టూ కూర్చున్నవాళ్ళల్లా మునగదీసుకు కూర్చున్నారు.
    
    ఆ పూట విస్తళ్ళు ఎత్తే పని లేకపోయింది.
    
    వండిన వంట పెళ్లికొచ్చి బారసాలవరకూ తిష్ఠవేసుకున్న చుట్టంలా అలాగే ఉండిపోయింది.
    
    ఏదో అశుభం జరిగినట్లుగా అందరి మొహాల్లో దిగులు మేఘం ఆవరించింది.
    
    తాయారమ్మకి కూడా పరిస్థితి అర్ధమై దగ్గడంమానేసి మౌనంగా చూస్తూ పడుకుంది. దూరంగా మర్రిచెట్టు జడలు విరబోసుకుని భయపెడుతోంది రాధకి తన భవిష్యత్తులా కనిపించిందా దృశ్యం.
    
    "ఏడవకు, తల్లీ! పొద్దుట అన్నయ్యతో మాట్లాడతాను" ప్రకాశం తెగించి రాధకి ధైర్యం చెప్పాడు "చిన్నాన్న ఉన్నారుగా, భయపడకు" అంది బేలగా శాంత. పార్వతమ్మ మూగనోము పట్టినట్లుగా మరచెంబుతో మంచినీళ్ళు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది! ఆవిడకి శంకరశాస్త్రిగారి మాటలు గుర్తొస్తున్నాయి.
    
    సూరమ్మ బరువుగా నిట్టూర్చి నిద్రకు ఒరిగింది. ఆ ఇంటిమగవాళ్ళ మొండితనాలు ఆవిడకి తెలుసు!
    
    "ఏం చేద్దామనుకుంటున్నావు రాధా?" మెల్లగానయినా వాడిగా అడిగింది తిలక.
    
    "నేనేం చెయ్యగలనూ?" అసహాయంగా అంది రాధ.
    
    తిలక ఆ రాత్రి ఆలోచిస్తూ పడుకుంది. 'ఆడపిల్ల మనసు మల్లెపూరేకంత సున్నితమని తెలుసుకోరీ పెద్దలు! వచ్చీ రాని వయసులో వరసైనవాడి నెవరినో చూపించి నీ మొగుడంటారు. ఊహ తెలిశాక ఆ బొమ్మ తుడిపేసి ఇంకో సంబంధం చూపించి అక్కడయితే సుఖపడతావంటారు. ఆ తర్వాత వాళ్ళకీ, వీళ్ళకీ బేరం కుదరకపోయినా, అభిప్రాయ భేదాలొచ్చినా...కాదు, మరొకడ్ని చేసుకోమంటారు.
    
    "సూపర్ డీలక్స్ లో బావుంటుంది అని తీసుకెళ్ళి ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ అయినా చాల్లే అనీ, ఆ తర్వాత ఆర్డినరీ అయినా అక్కడికేగా చేరేదీ! ఇందులో ఎక్కు!' అనీ అనేస్తారు.
    
    జీవితాంతం చేయాల్సిన ప్రయాణం.... ఆమెకీ కొన్ని ఆశలుంటాయని పట్టించుకోరు.
    
    రాధ మనసు సూన్యంగా మారింది, అసలేం జరిగిందో ఆమెకు అంతుపట్టలేదు. మాధవ్ తనతో తమాషా చేశాడా? వెళ్ళి అడిగితే "ఆ పల్లెటూరి మొద్దుని నేనెలా చేసుకుంటాననుకున్నారూ?" అని నవ్వేశాడా? లేక అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదా?
    
    "యమునా తటినీ..." అన్న అష్టపది గుర్తొచ్చింది.
    
    రాధ మాధవుడిమీద విరహంతో దుఃఖిస్తూ, "ఓ సఖులారా! యమునా నది వద్దగల కేళీ కదంబవృక్షం వద్దకు నన్ను తీసుకుపొండి.... అతని పాద ధూళి సోకినా ఆ మట్టిని నా ఒంటినిండా పూయండి!" అని వేడుకుందట. మరి నేనేం వేడుకోను! అతని ఒంటినుండి వీచిన పరిమళం ఈ తనువంతా తాకి ఎంగిలి చేసింది..... అతని స్వరంలో లాలన మనసుని ఎక్కడో మీటి సప్తస్వరాలు పలికించింది. కళ్ళల్లో కామన.....కైవల్యానికి దారి చూపించింది!
    
                                                          * * *
    
    గణపతికి దుఃఖం ఎగదన్నుకొస్తోంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే పెద్దమావయ్య ఉరిమి చూస్తూ మెడపట్టుకు అవతలకి గెంటేస్తాడనీ, చిన్న మామయ్య కోపంతో ఒళ్ళెరగకుండా తిడతాడనీ... పెద్దత్తయ్య అసహ్యంతో మొహం తిప్పుకుంటుందనీ, చిన్నత్తయ్య చిరాకు పడుతుందనీ... రాధ దొంగని చూసినట్లు చూస్తుందనీ మధనపడిపోతూ ఇంట్లోకి అడుగుపెట్టాడు.
    
    కానీ.... పెద్దత్తయ్య పరిగెత్తుకు వచ్చి "వచ్చావురా నాయనా... ఎలా ఉన్నావు?" అంటూ తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లాడు దొరకగానే, కన్నతల్లి హృదయం ఊడిపడేలా ఏడ్చినట్లు ఏడ్చింది.
    
    చిన్నత్తయ్య మంచినీళ్ళు అందించి,
    
    "ముందు స్థిమితపడు!" అంటూ పైట కొంగుతో విసురుతూ కళ్ళనిండా నింపుకున్న ఆధారాన్ని చల్లగ గుమ్మరించింది.
    
    చిన్నమావయ్య బయటికి వచ్చి "అక్కయ్యా! నీ కొడుకొచ్చాడే! నువ్వింక లేచి ఎంగిలిపడు!" అన్నాడు.
    
    వాతల తాతయ్య కూడా పేపర్ మడత విప్పకుండా అరుగుమీద వాడిపోయిన మొహంతో కనిపించాడు.

    ఇంతలో లోపల్నుండి పెద్దమావయ్యొచ్చాడు. గణపతి శిక్షకి సిద్డమైనట్లు నేల చూపులు చూస్తూ "నన్ను నాలుగు తన్ను, మావయ్యా! బుద్దొచ్చేట్లు చితకబాదు" అన్నాడు.
    
    సుబ్బారాయుడు గంభీరంగా "పార్వతీ! వాడిని స్నానం చేయమని...... ఆ తర్వాత కడుపునిండా అన్నంపెట్టు, ఎప్పుడు తిన్నాడో ఏమో!" అన్నాడు.
    
    తలుపు చాటునుండి తల్లి సన్నగా ఏడవడం వినిపించింది. రాధ ఆవిడ్ని దగ్గరగా తీసుకుని ఓదార్పుగా చూస్తోంది.
    
    గణపతి వెళ్ళి సుబ్బారాయుడి కాళ్ళమీద పడి "నేనే అత్తయ్య పెట్లోంచి డబ్బు దొంగతనం చేశాను. మావయ్యా! నా పాపానికి నిష్కృతి లేదు! నన్ను ఇంత ప్రేమగా చూడకండి. బాగా తిట్టండి!" అని ఏడ్చాడు.
    
    "పారిపోయినవాడికి బుద్దొచ్చి ఇంటికి తిరిగొస్తే.....తిట్టడం ఎందుకురా మెచ్చుకోవాలిగానీ!" అన్నాడు గణపతి తలమీద చెయ్యి వేసి సుబ్బారాయుడు.
    
    కన్నతండ్రి బతికున్నా ఇంత విశాలంగా ఆలోచించేవాడు కాదనిపించింది గణపతికి.
    
    "నన్ను క్షమించు, మావయ్యా!" అన్నాడు రుద్దమైన స్వరంతో.
    
    "తప్పులు చెయ్యడం మానవ నైజంరా! వాటిని దిద్దుకున్నవాడే మహాత్ముడవుతాడు. ఏ దార్లో అయినా సరే, నీ లక్ష్యం చేరుకో.....కానీ అడ్డదార్లు తొక్కకు. అవి వేగంగా గమ్యం చేర్చినా ప్రమాదాలు తెచ్చిపెడతాయి!" శాంతంగా చెప్పాడు సుబ్బారాయుడు.
    
    గణపతి కళ్ళు తుడుచుకుంటూ తల ఊపాడు.
    
    తిలక బయటకు వచ్చింది. ఆకుపచ్చ ఓణీ పసుపు పరికిణీలో ముఖాన కుంకుమ బొట్టు పెట్టుకుని, అలంకరించిన తెలుగింటి గడపలా కళకళలాడుతోంది.
    
    "అమ్మాయ్! ఇలా రా!" పిలిచాడు సుబ్బారాయుడు.
    
    తిలక నెమ్మదిగా వచ్చింది.
    
    "మా అమ్మాయికి ఇంగ్లీషు నేర్పడానికి ఎంతకాలం పడుతుందీ?" అడిగాడాయన.
    
    "నెలలోగా ఉత్తరం రాసేటంత నేర్పుతానండీ!" అంది.