"అంటే... అంటే... నేనేం నీకు కాననా చెప్తున్నావు? వుంటే వుండు, పోతే పో అని అంటున్నావా... ఇన్నాళ్ళూ నన్ను వాడుకుని మోజు తీరగానే మళ్ళీ వాళ్ల దగ్గిరకే వెళ్ళాలని, కావాలని నన్ను రెచ్చగొట్టడానికే ఇదంతా చేస్తున్నట్లున్నావు..." కోపంగా రవీంద్ర దగ్గిరకి వచ్చి అతని షర్టు పట్టుకుని గుంజి మండిపడేట్టు కళ్ళలోకి చూస్తూ-
    "యూ ఛీట్... నన్ను వదిలించుకోవాలని చూస్తున్నట్లున్నావు. చచ్చినా నిన్నొదలను. నేనేం అంత చేతకానిదాన్ని కాదు" అరుస్తూ హిస్టీరికల్ గా అతని టై పట్టుకుని ఆవేశంగా గుంజింది.
    "వదులు ముందు... ఏమిటీ దౌర్జన్యం... ఛీ... వదులు" రంజనిని ఒక్క తోపుతోసి ఆమె చేతిలోంచి విడిపించుకున్నాడు. అతని మొహం కోపంతో ఎర్రబడింది.
    రంజని గుండెలు ఆవేశంతో ఎగిసిపడ్డాయి.
    "చెప్పు... నాకు ముందు మాటివ్వు. ఇంకెప్పుడూ నా ఇష్టం లేకుండా నీవేం చెయ్యనని, నీ పెళ్లాం పిల్లలకి దూరంగా వుంటానని ప్రామిస్ చెయ్యి. లేకపోతే నిన్ను బతకనివ్వను" అరిచింది. రవీంద్ర ఛీత్కారంగా చూశాడు. "చచ్చినా ఇవ్వను అలాంటి మాట... నాకు చూడాలని వున్నప్పుడు నాపిల్లలని తప్పక వెళ్ళి చూస్తాను... నీకోసం నాపిల్లలని మాత్రం నేను చచ్చినా వదలను" అన్నాడు పంతంగా. అతనికి పౌరుషం తన్నుకొచ్చింది.

    "వదలవూ... వదలవూ... ఛీ... నిన్ను నమ్మడం నాదెంత బుద్ధి తక్కువ! నీలాంటివాడిని, అవకాశవాదిని ఊరికే వదలను..." అంటూ ఆవేశంగా చెంపమీద కొట్టింది ఎగిసిపడుతున్న గుండెలతో.
    రవీంద్ర కళ్ళు ఎర్రబడ్డాయి. అదే ఆవేశంతో ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు. "గెటౌట్... మళ్ళీ ఇటు వచ్చావంటే బోయ్ ని పిలిచి గెంటిస్తాను" అన్నాడు రౌద్రంగా.
    "యూ ఛీట్... నిన్ను వదలను. నీ అంతు చూస్తాను" రూము బయట నించుని అరిచింది. ఆఫీసులో అప్పటికే అందరూ చోద్యం చూస్తున్నట్టు నిల్చున్నారు. రంజని కేకలకి ఇంకా అందరూ సీట్లు వదిలి వచ్చారు. అందరి మొహాల్లో 'కావాల్సిందే నీకీ శాస్తి' అన్నచూపు... రంజని కాసేపు ఆవేశంగా అరిచి అందరివంకా కోపంగా చూసి విసవిసా ఆఫీసులోంచి వెళ్ళిపోయింది.
    'పీడ వదిలింది' అన్నారంతా.
    'మళ్ళీ రాకుండా వుంటే బతికిపోతాం' అన్నారు మరికొందరు.
                                          * * *
    సాయంత్రం ఇంటికి వచ్చిన రవీంద్ర మొహం వాడిపోయి, నల్లబడి వుండడం చూసిన సునీత "ఏం అలా వున్నారు? స్వీటీ బాగానే వుందిలెండి... ఇవాళ అందుకే నేను ఇంట్లోనే వుండి చూసుకున్నాను..." అతని మొహంవంక చూస్తూ అంది.
    రవీంద్ర చేతిలో బ్రీఫ్ కేస్ కిందపడేసి చటుక్కున కిందకూర్చుని సునీత ఒళ్ళో మొహం దాచుకున్నాడు. "సునీతా, నన్ను క్షమించు. క్షమించమని కూడా అడిగే అర్హత నాకులేదు. వివాహబంధంలో వుండే పవిత్రతని, రక్తం పంచుకుని పుట్టిన పిల్లలమీద మమకారం తెంచుకోలేనివి అని అర్థం చేసుకున్నాను.
    సంసారం అనే రథం నడవడానికి భార్యాభార్తా ఇద్దరూ వుండాలి అని అర్థం అయింది. భార్యా భర్తల విభేదాలవల్ల, దెబ్బలాటల మధ్య పిల్లలు నలిగిపోకూడదు సునీతా. పిల్లలకి తల్లిదండ్రుల అవసరం ఎంతో వుందని ఇవాళే స్వీటీ కనపడనప్పుడే నాకూ అర్థం అయింది. పిల్లల్ని కన్నాక వాళ్ళకి తల్లినో, తండ్రినో దూరం చేసే హక్కు మనకి లేదు. సునీతా నన్ను క్షమించగలిగితే క్షమించు... మనసు చెదిరి, క్షణికోద్రేకంతో తప్పటడుగువేసి బురదలో దిగాను. ఊబిలోకి దిగిపోక ముందే మేల్కొన్నాను... నన్ను కాదనకు. నన్ను క్షమించు..." విహ్వలుడై కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూండగా ఆమె మొహంలోకి చూసి మళ్ళీ మొహం దాచుకున్నాడు.
    సునీత చేయి అప్రయత్నంగా అతని జుట్టుని ప్రేమగా సవరించింది.
                                             * * *
    వారం రోజులకి నీరదలో కాస్త ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. సెలైన్, గ్లూకోజ్ డ్రిప్ లు, గొట్టంతో ఆహారం అందించడం, రక్తంలో కల్సిన మత్తు పదార్థాలు విరుగుడికి ఇస్తున్న ఇంజక్షన్లు మంచి ఫలితాలని చూపించింది.
    మధ్య మధ్య తెలివి వస్తోంది నీరదకి. అదే శూన్యంలోకి చూపు... ఎవరినీ గుర్తుపట్టడం లేదుకాని ఇప్పుడు ఇదివరకటికంటే మత్తులో వుండే టైము తగ్గి స్పృహలో టైము పెరిగింది. తెలివి వచ్చినపుడల్లా ఆమె శరీరంలో విపరీత చలనం వుండేది. అదిప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టింది. తెలివి వున్నంతసేపు ఆమెతో మాట్లాడుతూ చేతులు, తల నిమురుతూ మాట్లాడేది శారద.
    "నీరూ... నన్ను చూడు, నన్ను గుర్తుపట్టావా? నాతో మాట్లాడవా... నేనొక్కడిని పేపరు పని ఎన్నాళ్ళు చూసుకోను? నీ సాయం లేకుండా నేనేం చెయ్యలేను నీరదా... నాకోసమన్నా నీవు మామూలు మనిషివి అవవా? నీవు లేకపోతే మనం ఇంత కష్టపడ్డ 'ఉషోదయం' ఏమైపోతుంది..." అంటూ ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ... తల నిమురుతూ రాత్రిళ్ళు కూర్చునేవాడు శ్రీనివాస్. పగలంతా శారద,రాత్రి శ్రీనివాస్ వంతులుగా నీరద దగ్గిర వుండేవారు.
    లలితమ్మని ఇంటికి పంపించారు. మందులు, ఫిజియోథెరఫీలు చేయిస్తున్నారు. చేయి కాస్త పట్టు దొరుకుతోంది. మూతివంకర చాలావరకు తగ్గి మాట కాస్త నదురుగా వస్తోంది. ఆవిడ నోట నీరదకి తెలివి వచ్చిందా అన్నది ఒకటే మాట వస్తోంది.
    నారాయణమూర్తిగారు కాస్త కోలుకుని, ఇంట్లోవుంటే పెచ్చెక్కుతోంది ఆలోచనలతో అంటూ ఆఫీసుకి వెళ్ళడం ఆరంభించారు.
    ఆఫీసుకెళ్ళేముందు ఓ గంట, సాయంత్రం ఇంటికెళ్ళేముందు ఓ గంట నర్సింగ్ హోమ్ కెళ్ళి నీరద దగ్గిర కూర్చుంటారు తల నిమురుతూ. ఆయన కూర్చున్న గంటలో శారద ఇంటికెళ్ళి స్నానం అదీ చేసి టిఫిన్, భోజనం పట్టుకుని మళ్ళీ ఆస్పత్రికి వస్తుంది. నెలరోజులుగా ఆమె కోర్టుమొహం చూడలేదు. ఈమధ్య ప్రకాష్ ఇంటికి రావా అని సణగడం మానేసినందుకు సంతోషించింది.