చక్కెర చిక్కులు తగ్గించుకోండిలా!
డయాబెటిస్ ఒక్కటి వస్తే చాలు... దాని వెనకాల తట్టెడు రోగాలు చుట్టుముడతాయి. అందుకే దాని పేరు చెబితే చాలు ప్రపంచమంతా వణికిపోతోందిప్పుడు. అలా అని వస్తుందేమో అని భయపడుతూ కూర్చుంటే ఎలా? రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా! వీలైనంత వరకూ చక్కెరను ఒంట్లోకి వెళ్లకుండా ఆపగలిగితే మంచిది. అందుకోసం మొత్తం నోరు కట్టేసుకోనక్కర్లేదు. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు...
* స్వీట్ల మోతాదు తగ్గించండి. ఒకవేళ తిన్నా చక్కెరతో చేసిన వాటికంటే బెల్లంతో చేసిన వాటినే తీసుకుంటూ ఉంటే కాస్త బెటర్.
*ప్రాసెస్ చేసిన ఫుడ్ జోలికి పోవద్దు. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. వాటి బదులు ఫ్రూట్స్ తో చేసే ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ చాట్ లాంటివి ఎంచుకోండి.
* కూల్ డ్రింక్స్ బదులు జ్యూసులు, బటర్ మిల్క్ లాంటివి తాగండి.
* కేక్స్, కుకీస్ లాంటివి కూడా ఎక్కువ తినకూడదు. తినాలనిపిస్తే అప్పుడప్పుడూ ఓ చిన్న ముక్క. అంతే తప్ప ఒకేసారి నాలుగైదు ముక్కలు లాగించేశారో... అంతే సంగతులు.
* పాలు, పెరుగు వంటి వాటిలోని చక్కెర త్వరగా కొవ్వుగా మారిపోతుంది. కాబట్టి బయట పెరుగు కొనకండి. అవి రోజుల తరబడి నిల్వ ఉంచుతారు కదా! ఇంట్లోనే ఎప్పటికప్పుడు పెరుగు తోడు పెట్టుకుని తాజాగా ఉండగానే తినేస్తే మంచిది.
* సాస్ లనీ, డిప్స్ అనీ ఏవేవో దొరకుతున్నాయి మార్కెట్లో. అస్సలు టెంప్ట్ అవ్వొద్దు.
* ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకండి. అంతగా టెంప్ట్ అవుతుంటే నీళ్లశాతం ఎక్కువగా ఉండి, ఏదో కొద్దిగా ఫ్లేవర్ ఉండే ఐస్ ఫ్రూట్స్ ఉంటాయి. అవి తిని సరదా తీర్చుకోండి. అలాగే చాక్లెట్లు కూడా. మితిమీరి తినవద్దు. అంతగా తినాలనిపిస్తే మామూలు చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్ తినండి.
* తినగలిగితే మామూలు రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టండి. మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ మెల్లగా అలవాటైపోతుంది. అలాగే బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ తింటే ఏ భయమూ ఉండదు.
ఇవన్నీ మనం చేయగలిగినవే. ఫుడ్ విషయంలో అవసరం కంటే టెంప్టేషన్ ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. అందుకే ఆకలి లేకపోయినా తినాలనిపించి తినేస్తుంటాం. టెంప్ట్ అవ్వడం మానేస్తే అసలు సమస్యే ఉండదు. అబ్బే లేదు అంటే మాత్రం పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. చక్కెరతో చిక్కులు రాకుండా ఉంటాయి.
