మహిళల్లో ఒత్తిడికి కారణాలు, వాటికి పరిష్కారాలు!!
ఒత్తిడి ఎలా ఉంటుంది గొంతు మీద కత్తి పెట్టి దాన్ని మెల్లగా లోపలికి దింపుతూ ఉంటే శరీరంలో ఉన్న ప్రాణం మెల్లగా జారిపోతుంటే ఎలా అనిపిస్తుందో... అలాంటివేమీ జరగకపోయినా అదే ఫీలింగ్ ఇస్తూ మనిషిని మానసికంగా బలహీనంగా మార్చేస్తూ ఉంటుంది. చెప్పలేనంత అసహనం, చిరాకు, నిరాశ, నిస్పృహ అన్నిటికీ మించి ఓ దశలో చనిపోవాలనే ఆలోచన కూడా ఒత్తిడిని ఎదుర్కొనేవారిలో ఉంటుంది. చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలు ఇలా అన్నిరకాల వర్గాల వారు ఒత్తిడి భూతానికి బలి అవుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో బయటి విషయాలకే కాకుండా హార్మోన్ సమస్యల వల్ల కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఒత్తిడి ఎలా ఎదురవుతోంది దాని పరిష్కార మార్గాలు ఏమిటి వంటి విషయాలు ప్రతి మహిళ తప్పక తెలుసుకుంటే…..
ఇంట్లో ఉండే ఆడవారు అయినా, యువత అయినా, విద్యార్థులు అయినా వారి వారి మానసిక పరిస్థితి ప్రభావం ఆధారంగా మనుషుల్లో నీరసం, నిస్సత్తువ, ఆసక్తి లేకపోవడం వీటితో పాటు సరైన నిద్రలేకపోవడం వల్ల అది క్రమంగా ఒత్తిడిగా రూపాంతరం చెందుతుంది. అందరూ చేస్తున్న తప్పుల వల్లనే ఒత్తిడి అనే సమస్య ఎదురవుతోంది.
మొబైల్ ఫోన్:-
ఇప్పటి కాలంలో మొబైల్ ఫోన్ వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి స్థాయిలు అధికం అవుతున్నాయి. చాలా సులభమైన విషయం చెప్పాలంటే మొబైల్ చేతిలో ఉంటే గంటలు గంటలు దానితో గడిపేస్తుంటారు. ఫలితంగా ఎన్నో పనులు పూర్తికాకుండా అలా మిగిలిపోతాయి. దీనివల్ల తెలియకుండానే ఒత్తిడిలోకి జారుకుంటారు. ఇదొకటి అయితే ఈ సోషల్ మీడియాలో కొందరు తొందరగా ఓపెన్ అయిపోయి అన్ని షేర్ చేసుకుంటారు. ఆ తరువాత అదే పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. సోషల్ మీడియా లో ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే అందరూ తొందరగా ఒత్తిడిలోకి జారుకుంటారు. కాబట్టి మొబైల్స్, సిస్టం, టాబ్స్ ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి దూరం ఉండాలి.
గడిపే సమయం!!
సమయం గడిపే విధానంలో ప్రణాళిక ఎలాగైతే అందరికీ ముఖ్యమో…. అనవసర విషయాలు వదిలి కుటుంబం తో ఎక్కువ సమయం గడపడం అంత ముఖ్యం. ఏదైనా ఇబ్బంది అనిపించినా, సమస్య ఎదురైనా బయట ఎవరికో చెప్పుకుంటే వారు కేవలం వింటారు, ఆ తరువాత దాన్ని ఇతరులతో ఒక గాసిప్ గానో, ఫ్రెష్ న్యూస్ గానో మార్చి ప్రచారం చేస్తారు. కానీ కుటుంబ సభ్యులు అలా కాదు. సమస్య ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో చెబితే వారు మొదట్స్ కోప్పదినా, తిట్టినా, ఆ తరువాత ఖచ్చితంగా మంచి సలహా ఇవ్వడం, తోడుగా వెంట ఉండటం, పరిష్కారం అయ్యేవరకు ధైర్యం చెప్పడం చేస్తారు. కాబట్టి ఎప్పటికీ కుటుంబమే అందరికీ తోడు అని గుర్తుపెట్టుకోవాలి. ఒంటరితనం, బాధ వంటివన్నీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోగొట్టుకోగలం.
బ్యాలెన్స్డ్ లైఫ్!!
ఇల్లు, కుటుంబం, ఉద్యోగం, ఇతర పనులు వీటన్నింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటే…. వేటికి ఇవ్వాల్సిన సమయం వాటికి ఇస్తూ ఉంటే ఒత్తిడి అనే మాట పారిపోతుంది.
నియంత్రణ!!
ఒత్తిడికి లోనయ్యాము అని గుర్తించినప్పుడు దాన్ని నియంత్రించే మార్గాలు కూడా కనుక్కోవాలి. ఇప్పట్లో ఎన్నో రకాల స్ట్రెస్ రిలీఫ్ పనులను యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లలో షేర్ చేస్తుంటారు.అనుభవం కలిగిన వారు, నిపుణులు చెప్పే విషయలు ఫాలో అవ్వాలి.
కొత్త విషయాలు ఫాలో అవ్వడం, కొత్త పనులు చేయడం, ప్రతిరోజు కొత్తగా మొదలు పెట్టడం వంటివి చెయ్యాలి. ఎవరికి వారు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేవి ఉంటే ఒత్తిడిని చెవులు పిండి తరిమేయచ్చు.
◆నిశ్శబ్ద.