ఆమె ముందు ఎవరెస్టయినా తలవంచాల్సిందే!

 

 

మే 21 మన వార్తాపత్రికలు ఎప్పటిలాగే మసాలా కబుర్లతో నిండిపోయాయి. ఛానళ్లు రకరకాల చర్చలతో హోరెత్తిపోయాయి. అదే సమయంలో-  ఒక మనిషి హిమాలయాల మీద మువ్వన్నెల జెండాను ఎగరవేయాలనీ, అక్కడకు చేరి బుద్ధుని స్మరించాలనీ కోరుకుంటోంది. ఇప్పటిదాకా ఎంతోమంది ఆ పని చేసి ఉంటారు. కానీ ఆమె ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే!
‘అన్షు జంపసేన’ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళ. ఆమె భర్త ‘సెరింగ్ వాంగే’ ఓ పర్వతారోహకుడు. Arunachal Mountaineering & Adventure Sports Association అనే విభాగంలో పనిచేస్తున్నాడు. స్వతహాగా పర్వతాల మధ్య పెరిగిన అన్షుకి కూడా భర్త అడుగుజాడలలో పర్వతారోహణ చేయాలన్న ఆసక్తి మొదలైంది. దాంతో భర్త పనిచేసే సంస్థలోనే చేరి పర్వతారోహణలతో కఠోర శిక్షణని పొందింది. ఓ రెండేళ్లపాటు అందులో మెలకువలన్నీ ఒడిసిపట్టిన తర్వాత, ఎవరెస్టు శిఖరాన్నయినా అధిరోహించేందుకు సిద్ధపడ్డారు అన్షు.

 

 

2011లో మొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు అన్షు. కానీ ఆ శిఖరం మహిమ ఏమిటో కానీ, ఒక్కసారి అక్కడకు చేరుకున్నాక మళ్లీ అక్కడకు వెళ్లాలనిపిస్తుందని అంటారు అన్షు. ఆ ప్రపంచపు ఎత్తుకి చేరుకున్న తర్వాత భగవంతుని స్వయంగా చూసిన అనుభూతి కలుగుతుందని అంటారు. అందుకనే మొదటిసారి ఎవరెస్టుని చేరుకున్న పదిరోజులలోనే మళ్లీ అక్కడకు వెళ్లారు. అలా పదిరోజుల వ్యవధిలో ఎవరెస్టుని రెండుసార్లు అధిరోహించిన మహిళగా చరిత్ర సృష్టించారు.

2013లో అన్షు మరోసారి ఎవరెస్టుని అధిరోహించారు. ప్చ్! అయినా తనివి తీరలేదు. ఎవరెస్టు పట్ల ఉన్న అనుబంధం ఆమెని నిలవనీయలేదు. అందుకోసం 2017 మేలో ఎవరెస్టుని, రెండుసార్లు వెంటవెంటనే ఎక్కాలని అనుకున్నారు. ఇదేమంత తేలిక కాదని ఆమెకు తెలుసు. ఎవరెస్టు బేస్ క్యాంప్ దగ్గర నుంచి శిఖరాన్ని చేరుకోవడం సాహసంతో కూడుకున్న పని. ప్రాణాలకు సైతం గ్యారెంటీ ఉండని సాహసం. శిఖరాన్ని చేరుకునేందుకు నెలరోజులకు పైనే పట్టవచ్చు. పైగా అన్షుకి ఇప్పుడు 38 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇవేవీ ఆమెకు ప్రతిబంధకంగా కనిపించలేదు. ఎవరెస్టు మీద జెండా రెపరెపలాడటం కోసం, అక్కడ తనకి లభించే అలౌకికమైన ఆనందం కోసం శిఖరాన్ని చేరుకునేందుకు బయల్దేరింది.

 

 

మే 16 నుంచి మే 21 లోపల అన్షు రెండుసార్లు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కారు. అలా ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టు ఎక్కిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. సామాన్యంగా ఒక్కసారి ఎవరెస్టు ఎక్కేసరికే ఒళ్లు హూనమైపోతుంది. మరో నెలరోజులకి కానీ శరీరంలో మన స్వాధీనంలోకి రాదు. అలాంటిది వెంటనే రెండోసారి ఎక్కడా ఆగకుండా శిఖరాన్ని చేరుకోవడం అంటే అద్భుతమే! ఒకవైపు మనసు అలిసిపోయి ఉంటుంది, శరీరంలోని నరనరమూ నొప్పి పెడుతూ ఉంటుంది. కానీ ‘లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనే ఉంటే ఎలాంటి బాధనైనా అధిగమించవచ్చు,’ అని చెబుతారు అన్షు! ఆ తపనతో అన్షు ఎవరెస్టే చేరుకోగా లేనిది.... మనం చిన్నపాటి సమస్యలని అధిరోహించలేమా!!!


- నిర్జర.