మొటిమల నివారణ
మొటిమల నివారణ
కొందరికి ముఖాన మొటిమలు పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. చర్మం ఆయిలీగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. మొన్నమొన్నటిదాకా మొటిమల నివారణ అంత తేలిక కాదు అనుకునేవారు. ఇప్పుడలా కాదు. మొటిమలను తగ్గించుకునేందుకు ఎన్నో మందులొచ్చాయి. కనుక మొటిమలు పొడ చూపగానే డెర్మిటాలజిస్టును కలవాలి. వారి వారి తత్వాలను బట్టి వివిధ చికిత్సలు ఉంటాయి.
మొటిమలు ముఖంమీదే కాదు, వీపు భాగాన, ఉదార భాగాన కూడా వస్తాయి. ఇవి నొప్పిని, జిలనీ కలిగిస్తాయి. దాంతో చాలామంది మొటిమలను గిల్లుతూ, గోకుతూ ఉంటారు. అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. గిల్లడంవల్ల నొప్పి తగ్గకపోగా, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
సాధారణంగా మొటిమలకు బెంజాయిల్ పెరాక్సాయిడ్, సాలిసైలిక్ యాసిడ్, ట్రేక్లోసన్ లాంటి యాంటీ బాక్టీరియల్ మందులతో చికిత్స చేస్తారు. ఈ మందులు క్రీములు లేదా జెల్ రూపంలో దొరుకుతాయి. ఇవి బాక్టీరియాను వెంటనే తొలగించి, మొటిమలను మాన్పుతాయి. చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తాయి. విటమిన్-౩ తో కూడిన నికోటినమైడ్ లాంటి మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నూ కలిగించవు. మనం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొటిమలను నివారించుకోవచ్చు. చర్మాన్ని నిరంతరం సంరక్షించుకోవాలి. మొటిమలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్ కు చూపించి చికిత్స చేయించుకోవాలి.
ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని ధ్వంసం చేయడానికి. నొప్పేగా ఉండటమే కాకుండా అంద విహీనతకు కారణమౌతుంది. ఏ పార్టీకో, ఫన్క్షన్ కో వెళ్ళాల్సివచ్చినప్పుడు ముక్కుమీదో, బుగ్గమీద మొటిమలు ఉన్నాయనుకోండి మహా వెలితిగా ఉంటుంది. కొంత శ్రమ, కాస్త శ్రద్ధ ఉంటే మొటిమలను నివారించుకోవడం ఏమంత కష్టం కాదు. మన శరీరంలో కళ్ళు, చెవులు, గుండె, ఊపిరితిత్తులు లాంటి అవయవాలతోబాటు చర్మం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మొత్తం శరీరాన్ని అంతా కప్పి ఉంచేది చర్మమే కదా. కనుక చర్మాన్ని కాపాడుకుంటే మొటిమలు రావు. వచ్చినా తగ్గిపోతాయి.
మందుల సంగతి అలా ఉంచి ఈ కింది జాగ్రత్తలు పాటించినట్లయితే మొటిమలు తగ్గుతాయి.
పుదీనా ఆకులను ముఖాన పరచి ఉంచి పావుగంట తర్వాత తీసి చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను రుద్దనవసరం లేదు. అలా చేస్తే మొటిమలు మరింత నొప్పిచేస్తాయి.
సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి రాస్తూ ఉంటే మొటిమలు తగ్గుతాయి.
ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు.
జాజికాయను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
నీరుల్లి గడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గుతాయ్.
. మొటిమ గనక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన రాసి అంతా వచ్చేస్తుంది.
బియ్యం కడిగిన నీటిని మొటిమల పైన మృదువుగా రుద్దితే తగ్గుతాయి.
బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి.
చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.