పనితోపాటు ఆహారమూ ముఖ్యమే
posted on Apr 20, 2023
పనితోపాటు ఆహారమూ ముఖ్యమే
ఉద్యోగం చేసే ఆడవారు ఇంట్లో, బయటా పని ఒత్తిడితో తమ ఆహారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టరు. దాంతో వయసు పెరిగినకొద్దీ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. రోజువారీ తీసుకునే ఆహారం విషయంలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. సాధారణంగా రెండుపూటలా తీసుకునే ఆహారంతోపాటు మధ్యమధ్యలో తప్పనిసరిగా ఏదో ఒకటి తింటుండాలిట. అయితే ఆ ఏదో ఒకటి అధిక క్యాలరీలని పెంచేది కాక ఆరోగ్యాన్నీ, శక్తినీ ఇచ్చేది అయితే మంచిది అంటూ కొన్ని సూచనలు చేస్తున్నారు.
1. సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు సలాడ్ల వంటివి తీసుకోవాలి. సలాడ్ల వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. ఆకలి తీరుతుంది కూడా. అందులోనూ క్యాబేజీని సలాడ్‌లో కలిపి తీసుకుంటే దీనిలోని ‘గ్లాటామైన్’ అనే అమినో యాసిడ్ చిన్న పేగు ఆరోగ్యంగా పనిచేసేట్టు చూస్తుంది. డైజేషన్ ఇబ్బందుల వంటివి తగ్గుతాయి.
2. బాదం, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ నేరుగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య వుండదు. వీటిలో విటమిన్ ‘ఇ’తోపాటు మాంనీస్, విటమిన్ బి2, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. డ్రై ఫ్రూట్ర్‌ని మధ్యాహ్నం వేళ తీసుకుంటే శక్తి లభిస్తుంది.
3. వేరుశనగలు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటిలో మాంసకృత్తులతోపాటు బి3, కాపర్, మాంగనీస్ వంటి పోషక విలువలు సమృద్ధిగా వుంటాయి. కాబట్టి వేరుశనగలని వేయించి లేదా ఉడికించి ఓ చిన్న బాక్సులో వేసుకుని ఆకలి అనిపించినప్పుడు నాలుగు గింజలు నోట్లు వేసుకుంటే చాలు ఆకలి తీరుతుంది. ఓపిక వస్తుంది.
4. ఇక పండ్లు తింటే శరీరంలోకి అనవసర కేలరీలు చేరవు. ఆకలి అదుపులో వుంటుంది. అరటిపండుని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకుంటే రోజంతటికీ కావలసిన శక్తి లభించినట్టే. ఎందుకంటే అరటిపండ్లలోని కాల్షియం, ప్రొటీన్లు, ఐరన్‌లతోపాటు కార్బొహైడ్రేట్లు త్వరితగతిన శక్తినిస్తాయి. ఇక ఆపిల్స్‌లోని విటమిన్ ‘ఎ’, ఐరన్, బొప్పాయిలోని విటమిన్ ఎ, కె, ఇ తదితర పోషకాలు శక్తినివ్వడమే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.
5. మొలకెత్తిన గింజల్ని ఓ గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు వీటిలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులు శరీరానికి శక్తినిస్తాయి. చురుగ్గా వుంచుతాయి.
ఇలా రోజు మొత్తంలో అప్పుడప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే ఓపిక లేకపోవడం అన్న సమస్య వుండదు. బరువు పెరుగుతామనే భయమూ వుండదు. చలాకీగా రోజువారీ పనులు ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు.
-రమ