పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు?

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు?

తల్లిదండ్రుల అవసరం లేకుండా పిల్లల్ని పెంచిన వారే ఉత్తమ తల్లిదండ్రులు. ప్రతి క్షణం పిల్లలకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే తల్లిదండ్రుల లక్షణం ఎలా ఉంటుందంటే…  మనం మొక్కలు పెంచేటప్పుడు ఆ చెట్టుకు కావలసిన నీరు, ఎరువులు సమకూరుస్తాం కానీ చెట్టుకు ఇలా ఎదుగు, అలా ఎదుగు అని ప్రతిక్షణం చెప్పం కదా! అలాగే పిల్లలకు ప్రేమ, స్వేచ్ఛను ఇవ్వాలే గానీ బందీలు చేయరాదు. తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన వాటిని పిల్లల నుండి సాధించుకోవాలనే ఆలోచన పెంచుకొని వారి మీద వత్తిడి పెంచుతున్నారు. అటువంటి వారు మంచి తల్లిదండ్రులు కాలేరు. పిల్లలు ఉత్తమంగా ఎదిగే వాతావరణం కల్పించేలా చేసే వారే మంచి తల్లిదండ్రులు.

పిల్లల పెంపకం వ్యక్తిగతమైనదైనా తల్లిదండ్రులు ఆ పనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి సమాజానికి తమ సేవను సమర్ధవంతంగా నిర్వహించడానికి దీక్షతో కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో పెద్దవారు. వారు చేసే పనులు గమనిస్తూ అనుసరిస్తారు. దానిని బట్టే వారి నడవడిక, ప్రవర్తన ఆధారపడతాయి. ప్రపంచంలో సర్వదోషాలకు ఈర్ష్య, స్వార్థాలు కారణం. ఇవి పెద్దల వలన పిల్లలపై ప్రభావం చూపి చెడును ప్రేరేపిస్తాయి. పిల్లలను హద్దులో పెట్టి బాగు చేసే ప్రయత్నం కన్నా పెద్దలలో మంచి మార్పు తెచ్చుకొని బాగుచేయడం మంచిది. తల్లిదండ్రులు వారి పిల్లలను భావి పౌరులుగా ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తున్నారు. ఆ ఉత్పత్తి ప్రక్రియలో నాణ్యతా లోపం చోటు చేసుకుంటే ఆ నష్టాన్ని సమాజం 60-70 సంవత్సరాల పాటు భరించవలసి వస్తుంది. 

పిల్లలను ఎలా పెంచాలి?

ఐదు సంవత్సరాలు వచ్చే వరకూ పిల్లలను రాజకుమారుల్లా, అతి గారాభంగా పెంచాలి. ఆపై పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించాలి. పదహారు సంవత్సరాల తరువాత మిత్రునిలాగా భావించి పెంచాలి. అప్పుడే ప్రయోజకులవుతారు. పిల్లల్ని ప్రేమతో చూడడం వేరు, గారాబంగా పెంచడం వేరు. ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు. గారాబంగా పెంచితే మీకూ, దేశానికీ, కట్టుకున్న వారికీ సమస్య అవుతారు. చిన్నతనం నుంచీ మన తల్లి తండ్రి నుంచి మనం ఏమి కోల్పోయామో, ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికి వచ్చామో గమనించి ఆ తప్పులే మళ్ళి మనం చేయకూడదు. పిల్లలు పెరిగి ప్రయోజకులుగా మారి, మనల్ని ఉద్దరించే స్థితిలో ఉండాలి. కానీ మనమే వారిని చూసే స్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదని తెలుసుకోవాలి.

చిరుప్రాయంలో తల్లి ఇచ్చే శిక్షణా విధానం పిల్లల భవిష్యత్ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయంపై కొన్నేళ్ళ క్రితం ఓ సర్వే జరిగింది. ఆ సర్వేలో వెళ్ళడైన విషయం ఇది.

"ఓ తల్లి పిల్లవాడికి నడక నేర్పే ప్రయత్నంలో పిల్లవాడికి కొంత దూరంలో నిలబడి తన వైపు రమ్మని ప్రోత్సహిస్తుంది. అప్పుడు పిల్లవాడు తల్లిని చేరుకోవాలని ఆశతో ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో పిల్లవాడు అదుపుతప్పి పడిపోయి, ఏడవడం ప్రారంభించాడు. వెంటనే తల్లి పరుగున వెళ్ళి పిల్లవాణ్ణి ఓదారుస్తూ, చీ పాడునేల! నీవల్లే మా పిల్లాడికి దెబ్బలు తగిలాయంటూనే నేలను కొట్టింది. అప్పుడు పిల్లవాడు ఏడుపు ఆపేశాడు.

ఇదే విధంగా మరో తల్లి తన పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు, ఆ పిల్లవాడు తల్లి వైపు నడుస్తూ ఉండగా పడిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడి దగ్గరకు వెళ్ళకుండా దూరం నుండే 'లే నాయనా! లే లేచిరా!' అంటూ ఉత్సాహపరిచింది. ఆ పిల్లవాడు మెల్లగా లేచి నడుచుకుంటూ తల్లిని చేరుకున్నాడు.

ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళయిన తరువాత వారి స్వభావాన్ని పరిశీలిస్తే తేలిందేమిటి. మొదటి పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలకు, అపజయాలకు బయట పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులే కారణమని నిందించే స్వభావం కలిగిన వాడయ్యాడు. రెండవ పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలు, అపజయాలను ఎదుర్కోగల మనోబల సంపన్నుడయ్యాడు.

ఆలోచనలు మనం చేసే పనుల యొక్క సున్నిత రూపాలు. అవి మెదడులో చిన్న విద్యుత్తరంగాలుగా జీవం పోసుకొని, చుట్టూ ఉండే గాలిలాగ, పీల్చుకొనే ఊపిరిలాగ మనకు తెలియకుండానే మన బాహ్యమనోపరికరాలను ప్రభావితం చేస్తాయి. అందుకే  ముఖ్యంగా పిల్లల పెంపక బాధ్యత స్త్రీల మీదే ఆధారపడి వుంటుంది.

                                 ◆నిశ్శబ్ద.