గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..!
posted on Dec 10, 2024
గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..!
భగవద్గీత.. మనిషి జీవితంలో కర్మను తప్పక అచరించమని, దాని తాలూకు ఫలితాన్ని తప్పించుకోలేరని చెప్పే గ్రంథం. సత్కర్మల గురించి వివరించేది ఇదే.. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భయానికి, వ్యాకులతకు, పిరికితనానికి లోనైన అర్జునుడికి, శ్రీకృష్ణ భగవానుడు చేసిన బోధనే భగవద్గీత అంటున్నారు. భగవద్గీత అనగా.. భగవంతుడు స్వయంగా చెప్పిన విషయాలు. భగవద్గీతలో 18 అధ్యాయములు ఉన్నాయి. ఈ 18 అధ్యాయములలో 18 యోగములు ఉన్నాయి. భగవద్గీతను వయసైపోయిన వారు చదవే పుస్తకం అనుకుంటారు చాలా మంది. కానీ మంచి నడవడిక కోసం చిన్న పిల్లల నుండి అందరూ చదవవచ్చు. ఉగ్గుపాలతో భగవద్గీత సారాన్ని నేర్పిస్తే పిల్లల జీవితం ఆనందమయంగా ఉంటుంది. అంతేకాదు.. గర్భిణి మహిళలు కూడా భగవద్గీత ను చదవవచ్చు. దీని వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే..
స్త్రీలు గర్బధారణ సమయంలో తల్లి, బిడ్డల శారీరక మానసిక ఆరోగ్యం కోసం చాలా పనులు చేస్తుంటారు. తీసుకునే ఆహారం దగ్గర నుండి చేసే పనుల వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు బాధపడకూడదని, ఎమోషన్ కు గురవ్వకూడదని అంటారు. అందుకే.. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండటం కోసం, వారి మనస్సు దృఢంగా ఉండటం కోసం సంగీతం వినడం, మానసికంగా ఆరోగ్యంగా ఉండే కార్యకలాపాలు చేయడం చేస్తుంటారు. వాటి జాబితాలో భగవద్గీత పఠనం కూడా ఒకటి. భగవద్గీత పఠనం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక పుస్తకమే కాదు.. గొప్ప ఫిలాసఫి కూడా ఇందులో దాగుంది. ఇది మనిషి జీవితంలో లోతైన విషయాలు చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. మనిషిలో ఉండే బాధ, దుఃఖం, విచారం వంటి వాటిని సున్నితంగా మాయం చేస్తుంది. మనసు శాంతితో, స్థిరంగా ఉండటంలో సహాయపడుతుంది. గర్భవతులు ఈ పుస్తకాన్ని చదివితే అది కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.
గీత శ్లోకాలు చదవడం వల్ల తల్లి మానసిక ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. ఇది శారీరక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు. ఉట్టి అల్లరి పిల్లవాడు పుట్టాడు.. లాంటి మాటలు ఎదురుకాకుండా ఎంతో గొప్ప ఆలోచనలు, అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉన్నవారిగా పిల్లలు ఎదుగుతారు.
భగవద్గీతలో ధర్మం, కర్మ, యోగ, జ్ఞానం వంటి విషయాలు ఎంతో స్పష్టంగా బోధించారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాలు తెలుసుకుంటే.. అర్థం చేసుకుంటే జీవితం చాలా మారిపోతుంది. ఇవి గర్భవతులు తెలుసుకోవడం వల్ల గర్భం మోసే దశ చాలా హాయిగా గడిచిపోతుంది. కడుపులో బిడ్డ కూడా ఎలాంటి వికారాలకు లోను కాకుండా, పాజిటివ్ ఆలోచనలతో పుడతారని చెబుతారు.
గర్భధారణ సమయంలో మహిళలలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. ప్రతిరోజూ భగవద్గీత పఠించడం వల్ల మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా ఉండగలుగుతారు.
గీత శ్లోకాలు మానసిక ప్రశాంతతను, స్వీయ అంగీకార భావనను పెంపొందిస్తాయి. ఇవి జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా స్వీకరించేలా చేస్తుంది. ఇది గర్భవతులకు చాలా అవసరం.
గర్భంలో ఉన్న బిడ్డకు 7 వ నెల నుండి వినికిడి శక్తి వస్తుంది. ఆ సమయంలో భగవద్గీతను గట్టిగా చదవడం లేదా ఆ శ్లోకాల గురించి బిడ్డతో చర్చిస్తున్నట్టు, బిడ్డకు చెబుతున్నట్టు చేయడం వల్ల గర్బంలో పిల్లల మానసిక భావోద్వేగాలు చాలా నియంత్రణలో ఉంటాయి.
*రూపశ్రీ.