నవరాత్రుల రెండవరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది.!
posted on Oct 16, 2023
నవరాత్రుల రెండవరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది..
దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా పండుగ మొదలైపోయింది. తొమ్మిదిరోజులు అమ్మవారు తొమ్మిది అవతారాలలో దర్శనమిస్తుంది. ఈ అవతారాలకు తగ్గట్టే వివిధ పుణ్యక్షేత్రాలలోనూ, ఆలయాలలోనూ అమ్మవారిని ఒక్కొక్కరోజు ఒక్కోవిధమైన రంగు దుస్తులతో, పువ్వులతో అలంకరిస్తారు. ఆయా రోజున ఆయా రంగు అమ్మవారికి ఎంతో ఇష్టమైనదిగా చెబుతుంటారు కూడా. అయితే మహిళలు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగులను ధరించడం, అమ్మను పూజించడం వల్ల అమ్మవారు సంతృప్తి చెందుతారు. నవరాత్రుల రెండవరోజు అమ్మవారి కృపకు ఏ రంగు దుస్తులు ధరించాలంటే..
రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మవారు తెలుపు రంగు దుస్తులలో ఉంటుంది. అన్ని చోట్లా అమ్మవారికి రెండవరోజున తెలుపు రంగు దుస్తులే అలంకరిస్తారు. అమ్మవారిని పూజించే అమ్మాయిలు, మహిళలు ఈరోజున తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది.
పూజలో తెలుపు రంగు దుస్తులు ధరించడానికి వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. రెగులర్ దుస్తులలో కూడా తెలుపురంగు దుస్తులలో అనార్కలీ, లెహంగా, పరికిణీ వంటి దుస్తులు బాగుంటాయి. ఎంబ్రాయిండరీ.. స్టోన్ వర్క్, నెట్టెడ్ వర్క్ తో కూడిన తెలుపు రంగు చీరలు కూడా చాలా ఆకర్షణగా ఉంటాయి. చూడగానే లెహంగా ధరించారా అన్నట్టుగా ఉండే షరారా కూడా ఇప్పటి ఫ్యాషన్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇకపోతే తెలుపు రంగు స్వచ్చతకు, తెలివితేటలకు ప్రతీకగా చెబుతారు. ఈరోజున తెలుపు రంగు దుస్తులు ధరించి, తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే అమ్మాయిల కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి కరుణ అమ్మవారిపై ఉంటుంది.
*నిశ్శబ్ద.