Read more!

ఆక్రోశం


    ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ల్ని, తన పర్సనల్ షిప్స్ లో ఏర్పాటు చేయడం మహంత సరదాల్లో ఒకటి.

 

    కాసేపు అక్కడ గెస్టులతో గడిపి...

 

    తిరిగొస్తున్న మహంత గబుక్కున రాబర్టు మర్చంట్ వైపు తిరిగాడు.

 

    "వేరీజ్ మిస్టర్ దేశ్ ముఖ్... కృపానంద దేశ్ ముఖ్?"

 

    కృపానంద దేశ్ ముఖ్ తన బర్త్ డే పార్టీకి రావడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే వుందతనికి.

 

    కృపానంద దేశ్ ముఖ్ కాలంతో పరుగెట్టే మనిషి. కొన్ని గంటల కాలాన్ని తన పుట్టినరోజు కోసం దేశ్ ముఖ్ వెచ్చించాడంటే!?

 

    ఏదో అవసరం, ఏదో ఆలోచన, ఏదో వ్యూహం లేనిదే అంత దూరం నుంచి కృపానంద ఇక్కడకు రాడు.

 

    అకస్మాత్తుగా ఆలోచనల్లో పడ్డ తన చీఫ్ ముఖంలోకి సాలోచనగా చూసాడు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రాబర్టు మర్చంట్.

 

    ఎస్.ఎమ్. బిజినెస్ వరల్డ్ లో శుక్రవర్ణ మహంత పేరు ది చీఫ్. అతన్ని ప్రతి ఒక్కరూ చీఫ్ గానే గుర్తిస్తారు, సంబోధిస్తారు.

 

    "డోంట్ వర్రీ రెస్పెక్టడ్ చీఫ్! ఇక్కడకొచ్చిన మన గెస్టుల ప్రతి కదలిక మీదా మన ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్ నిఘా వేసింది. స్పెషల్ రిపోర్ట్సు రెడీగా వున్నాయి మీరు చూస్తానంటే..."

 

    మెత్తగా, మెల్లగా నవ్వాడు రాబర్టు మర్చంట్.

 

    డిన్నర్ ప్రోగ్రామ్ తర్వాత దేశ్ ముఖ్ కన్పించలేదు. బహుశా తన గెస్ట్ హౌస్ లో రెస్టు తీసుకుంటున్నాడేమో...

 

    నో... ఇట్స్ నాట్... కరెక్ట్... తన అంచనా తప్పు.

 

    దేశ్ ముఖ్ బిజినెస్ లైఫ్ లో రెస్టు... జర్నీలప్పుడే... ఫ్లైట్స్ లోనే రెస్టు తీసుకుంటాడు. ఆ విషయం మహంతకు బాగా తెలుసు.

 

    దేశ్ ముఖ్ ని చూసిన దగ్గర్నించీ తెలియని వర్రీతో సతమతమవుతున్నాడు మహంత.

 

    "వేరీజ్ హి నౌ?" అడిగాడు మహంత.

 

    ఆ సమయంలో వాళ్లిద్దరూ...

 

    ఫోర్టు ఏరియా నుంచి లీజర్ అవర్ రిసార్టుకి వెళ్ళే సిమెంట్ రోడ్ మీద ఫోర్డు ఫిఫ్తు జనరేషన్ కారులో కూర్చున్నారు.

 

    ఆ కార్లో ప్రపంచంలో ఎక్కడికయినా, ఏ క్షణంలోనయినా మాట్లాడటానికి అవసరమయిన కమ్యూనికేషన్ సిస్టమ్ వుంది.

 

    అలాగే మార్బెల్లా సిటీలో ఎక్కడ, ఏ మారుమూల ప్రాంతాన్నయినా చూడటానికి అవసరమయిన కమ్యూనికేషన్ సిస్టమ్ వుంది.

 

    రాబర్టు మర్చంట్ పోర్టబుల్ టీవీ ఆన్ చేశాడు. లేడీస్ హేండ్ బ్యాగ్ సైజులో వుందా పోర్టబుల్ టీవీ.

 

    ఛానల్స్ బటన్స్ ని ప్రెస్ చేస్తున్నాడు రాబర్ట్ మర్చంట్.

 

    దేశ్ ముఖ్ కి కేటాయించిన గెస్ట్ 'వేస్' మెయిన్ గేట్... పోర్టికో- స్విమ్మింగ్ ఫూల్... బార్ రూమ్... లివింగ్ రూమ్... గార్డెన్... ఎక్కడా- ఎక్కడా...

 

    దేశ్ ముఖ్ కన్పించకపోవడంతో అయోమయంగా రాబర్టు మర్చంట్ మహంత వైపు చూశాడు.  

 

    ఎఫ్.బి.ఐ. స్పెషల్ డిటెక్టివ్ తన ఎంపైర్ లోకి రహస్యంగా చొరబడినట్టుగా వుంది మహంత పరిస్థితి.

 

    అతని ముఖం ఎందుకో అకస్మాత్తుగా వివర్ణమైపోయింది.

 

    "ట్రేస్ హిమ్ ఇమ్మీడియట్లీ" ఆర్డర్ జారీ చేశాడు మహంత.

 

    మహంత తన బ్రెయిన్ కు పదును పెట్టడం ప్రారంభించాడు.

 

    రాబర్టు మర్చంట్...

 

    అన్ని విధాలుగా దేశ్ ముఖ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు.

    
                             *    *    *    *


    సరిగ్గా...

 

    అదే సమయం...

 

    ఇండియా... ఆంద్రప్రదేశ్ లోని రాయలసీమలోని ఓ కుగ్రామం.

 

    కడపకు దాదాపు యాభయ్ మైళ్ళ దూరంలో వుందా గ్రామం... వెయ్యి గడపల గ్రామం...

 

    కరువు వాతపడి అస్థిపంజరంలా వుందా గ్రామం.

 

    ఆ ఊరు మధ్యలో ఓ శివాలయం.

 

    గర్భగుడి పైకప్పు ఎప్పుడో శిధిలమైపోయింది.

 

    శివాలయానికి పూజారి లేడు. శివలింగానికి ఆచ్చాదనా లేదు.

 

    వారానికో రోజు...

 

    అసుర సంధ్యవేళ శివుని దీనావస్థకు జాలిపడి ఆ వూరి ఎలిమెంటరీ స్కూలు లెక్కల మాస్టారు సుబ్బారెడ్డి భార్య అనసూయమ్మ, నూనెదీపం వెలిగించి దేవునికో దండం పెడుతుంది.

 

    ఊరుని కరువునుండి కాపాడమని వేడుకుంటుంది.

 

    ముప్పై ఏళ్ళుగా ఆవిడ వేడుకుంటున్నా, ఆ ఊరి పొలాల్లో పచ్చగడ్డి మొలవలేదు.

 

    పైరుగాలి నిండలేదు... ప్రభుత్వాలు పట్టించుకోవు-

 

    మసక చీకట్లో ఊరు మర్రిచెట్టులా వెలవెలబోతోంది.

 

    ప్రస్తుతం...

 

    అనసూయమ్మ చెంబుడు నీళ్ళతో శివలింగాన్ని శుభ్రం చేసింది.

 

    మట్టి ప్రమిదలో నూనె పోసి, పక్కన నిల్చున్న భర్త సుబ్బారెడ్డి వేపు చూసింది.

 

    సుబ్బారెడ్డి జేబులోంచి అగ్గిపెట్టె తీసి ఆమెకు అందించాడు.

 

    అగ్గిపుల్ల తీసి వెలిగించి, ప్రమిదలోని వత్తికి అంటించింది.

 

    వత్తి వెలిగింది. ఆ ప్రాంతమంతా చిరు కాంతితో నిండిపోయింది.

 

    ఆ వెలుగు క్షణకాలమే!

 

    తలుపులు, గోడలు లేకపోవడంవల్ల విసురుగా వచ్చిన గాలికి దీపం ఆరిపోయింది.

 

    మళ్ళీ వెలిగించింది అనసూయమ్మ.

 

    మళ్ళీ దీపం ఆరిపోయింది.

 

    వెలిగించడం, ఆరిపోవడం, భర్తవైపు నిస్సహాయంగా చూసిందామె.

 

    "నీ భ్రమ అనసూయా! గాల్లో దీపం నిలుస్తుందా? పద..." యాభై ఏళ్ళ సుబ్బారెడ్డి ప్రక్కకు తిరుగుతూ అన్నాడు.

 

    పక్కన మండపం... ఆ మండపం మీద మొండిస్తంభం. ఆ స్తంభం పక్కన నుల్చుందో అమ్మాయి.

 

    ఆ అమ్మాయికో పదహారేళ్ళుంటాయి. సన్నగా, పొడవుగా వుంది.

 

    అంతంత పెద్ద కళ్ళతో ఆరిపోతున్న దీపంవైపు, సహనంగా అగ్గిపుల్ల వెలిగిస్తున్న అనసూయమ్మ వైపు విచిత్రంగా చూస్తోంది ఆ అమ్మాయి.

 

    ఆ అమ్మాయిని చూసాడు సుబ్బారెడ్డి.