Read more!

నానీ


    అద్దంలో తనరూపం చూసుకున్న నానీకి ఏడుపు రాలేదు కాని పత్రికలో తన ఫోటో చూసిన వాళ్ళెవరూ గుర్తించరని ధైర్యం వచ్చింది.

 

    అప్పుడు గుర్తొచ్చింది. ఊళ్ళో తనజుట్టు కత్తిరించుకున్నాక తాతయ్య డబ్బులిచ్చే విషయం.

 

    దిగులుగా జేబులు తడుముకుంటున్న నానీని జాలిగా చూశాడు షాపు యజమాని. "ఏ యింటిబిడ్డవో తెలీదు కాని బాబూ! నువ్వడక్కుండానే నీ ఉంగరాలజుత్తుని కత్తిరించేశాను. కోపం తెచ్చుకోకు. ఆళ్ళదృష్టి నీమీద పడకూడదని అంతే! నీకు తెలీదు బాబూనిన్ను వెంటాడుతూ వచ్చారే! అళ్ళెంత రాక్షసులంటే నడిరోడ్డుమీద నలుగురూ చూస్తుండగా నిలువునా ప్రాణాలు తీయగల సమర్థులు. నేనూ ఆళ్ళని ఎదిరించలేనయ్యా! డబ్బులివ్వకుండా జుత్తు కత్తిరించగలనేమోకాని, డబ్బులిచ్చినా గొంతు కత్తిరించలేను."

 

    అతడు సంజాయిషీ అంతా చెప్పుకుపోతున్నాడు. అలసిపోయిన ఆ పసికందు జీవనయానంలో అరక్షణంపాటు ఆర్థ్రతగా పరామర్శించిన మంచినేస్తం... అందుకేనేమో ముందు కన్నీళ్ళుబికాయి.

 

    చీకటిలోకి కదిలిన నానీకి ఇప్పుడు ఆ వ్యక్తులు కనిపించలేదు. కాని ఆ పరిసరాలు బాగా పరిచయమయినవిగా కనిపించాయి.

 

    రోడ్లు సందడిగా వున్నాయి.

 

    అయినా దిక్కులు పరికిస్తూ నడిచి నడిచి ఓ యింటికి చేరాడు.

 

    ఆ ఇంటిలోనే అమ్మప్రేమను చవిచూసింది.

 

    తెరుచుకుని వున్న ద్వారం దాటి నిశ్శబ్దంగా లోపలికి అడుగుపెట్టాడు. అలికిడి లేని అనసూయ ఇల్లు ఒకరోజు క్రితం హత్య జరిగిన మృత్యుగృహంలా లేదు. అమ్మ ఒడిలాగే అనిపించింది.

 

    నిన్న అనసూయ నానీకి రక్షణ ఇవ్వడమే నిజమయితే ఆ ఫిల్మురీల్ ఆ యింటిలోనే బహుశా వుండవచ్చు అన్న మీమాంసతో డి.ఎస్పీ. సుందర్ తనే స్వయంగా అక్కడికి రాబోతున్నాడని తెలీని నానీ ఆకలితో అలాగే ఓమూల సొమ్మసిల్లి నిద్రపోయాడు.

 

    అదే నానీ అమాయకంగానైనా చేసిన మరో పొరపాటు.  

 

                                                 *    *    *

 

    "బ్రేవో మైడియర్ యశస్వీ!" ఉత్సాహంగా జేబులోని బాటిల్ తీసి మరోగుక్క తాగాడు రామసూరి. "ఒక పోలీసాఫీసరువయ్యుండి నీకేమీకాని ఓ పసికందు కోసం నువ్వు నమ్మిన నిజాన్ని కాపాడబడటంకోసం నువ్వు చూపిన సాహసాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఒక్కడు... నీలాంటి ఏ ఒక్కడు వున్నా చాలయ్యా యీ వ్యవస్థ రామరాజ్యంలా మారకపోయినా కనీసం రాక్షసనిలయం కాకుండా పోతుంది. అయామ్ ప్రౌడాఫ్ యూ మైబోయ్..."

 

    వయసులో యశస్వికన్నా చాలా పెద్దవాడైన రామసూరి అనుభవంలో యిలాంటి వ్యక్తులు ఎప్పుడూ తారసపడలేదు. అందుకే ఎన్నో ఏళ్లతర్వాత ఇంతటి ఉద్విగ్నతతో మాట్లాడుతున్నాడు.

 

    ఎప్పుడో నిన్నరాత్రి హోటలుగది వదిలి వెళ్లిన యశస్వి అరెస్టు కాబడటం ఆ తర్వాత రామసూరి మూలంగానే విడుదల కావడం అంతా తెలిసిన హరిత నిశ్శబ్దంగానే వారి చర్చని వింటూంది తప్ప జోక్యం చేసుకోలేదు.

 

    యశస్వి తనకు తెలిసిన మనుషులకి భిన్నమైనవాడే అనుకుంది తప్ప ఓ మహామనిషిగా తెలుసుకుంటూందిప్పుడే! అదికాదు ఆమెనంతగా ఆకట్టుకున్నది...

 

    ఇంతచేసినా యశస్వి ప్రవర్తనలో ఏదో సాధించానన్న గర్వంలేదు. ఇంకా సాధించని న్యాయంకోసం పడుతున్న తపన తప్ప.

 

    "మిష్టర్ యశస్వీ!" ఓ క్షణం మగతగా చూశాడు రామసూరి. "కథ ఎక్కడ మొదలైనా ఇప్పుడు ఎంతదాకా మలుపు తిరిగినా ఇకముందు మరిన్ని అనూహ్యమైన సంఘటనలు ఎదుర్కోవల్సిరావచ్చన్నది నా నమ్మకం. ఎందుకంటే ప్రత్యర్థులు అప్పుడే జాగ్రత్త పడుతున్నారు. ఒక చిన్న అపశృతి చాలు, నానీ ప్రాణాలు మాత్రమేకాదు... మన బ్రతుకులూ గతి తప్పడానికి. అలా అని యిది పిరికిమందుకాదు. సమస్య పరిధి విస్తృతం అవుతుంటే నిప్పుమంటగా, మంట దావానలంగా మారుతుంది. అప్పుడు మనలో మరికొందరు ప్రాణాలకే హాని కలుగుతుందన్నది నా నమ్మకం. సో... నేను చెప్పేదొక్కటే..." సాలోచనగా నిట్టూర్చాడు. "ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ఇనీషియేటివ్ చాలు. మిగతాది నాకు వదిలెయ్! తాడు పూర్తిగా నా చేతి కొచ్చింది కాబట్టి మిగతా ముడులు నేను వేస్తాను."   

 

    అప్పుడు జోక్యం చేసుకున్నాడు యశస్వి. "నేను యిక్కడకు వచ్చాక కాకతాళీయంగా మిమ్మల్ని కలుసుకుంది మీ సహాయాన్ని కోరే తప్ప మిమ్మల్ని సమస్యలోకి నెట్టి నేను ప్రేక్షకుడిగా కూర్చోవాలని కాదు."   

 

    "నీకు తెలియదు యశస్వీ! ప్రత్యర్థుల దృష్టిలోకి వెళ్ళిన నువ్వు అనాలోచితంగా అడుగువేస్తే ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కునేదీ నువ్వూహించలేవు" అసహనంగా అన్నాడు రామసూరి.

 

    అడ్డంగా తలూపాడు యశస్వి అతడి నిశితదృక్కుల్ని చూడగానే బోధపడిపోయింది యశస్వి ఎంత దృఢంగా పోరాటానికి సన్నద్ధమవుతున్నదీ!  

 

    "యశస్వీ! ఓ చిన్నకథ చెబుతాను వింటావా?" బాధగా తల పట్టుకున్నాడు రామసూరి."ఓ అసురసంధ్యవేళ సంధ్యవార్చాలనుకున్న శ్రీరాముడు తనవిల్లుని ఓ చెట్టుకి ఆనించి నదిలోకి దిగాడట. అంతా పూర్తయ్యాక తిరిగి ఒడ్డుకి వచ్చి చూస్తే తన విల్లుకొన కింద కొనవూపిరితో కొట్టుకుంటున్న ఓ కప్ప కనిపించిందంట. రాముడడిగాడు, నీ ప్రాణానికి నా మూలంగా హాని కలుగుతుంటే ఎందుకు వారించలేదూ అని. అప్పుడా కప్ప ఏమందో తెలుసా? నాకు కష్టంవస్తే రామా! రామా! అంటాను. కాని, రాముడే నాకు కష్టాన్ని కొనితెస్తే ఇంకే దేవుణ్ణి ప్రార్థించనూ అని. ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా! ఈ సొసైటీలో ఆపదలో వున్న మనిషిని రక్షించే వ్యవస్థలు ప్రభుత్వమూ, పోలీసులూ. ఇప్పుడు ఆ రెండు వ్యవస్థలకీ శతృవులమై పోయాము. ఎవరు మన మొర ఆలకించేది?" నవ్వాడు నిర్లిప్తంగా. "ఓ పత్రికా విలేఖరిగా సమస్యని ప్రజలదృష్టికి తేగలను... జరుగుతున్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించేటట్టు చేయగలను. బట్! అప్పుడు ప్రజలు మనకేమన్నా సహకరించగలరనుకుంటున్నావా? నో... వాళ్ళకు ఇంతకుమించిన సమస్యలున్నాయి. నిజం యశస్వీ. అభిమాన నటుడి సినిమాకి టిక్కెట్టు దొరక్కపోతే ఓ సమస్య. కష్టపడకుండా కొడుకు పాసవకపోతే ఒక సమస్య. పరీక్షల ముందు క్వశ్చన్ పేపర్లు లీక్ కాకపోతే సమస్య... తన పెళ్ళాం మాత్రమే పతివ్రతగా వుంటూ పొరుగు ఆడవాళ్లు పతితలుగా మారకపోతే సమస్య. ఇలాంటి కుహనా సమస్యలమధ్య నలిగే సగటుజీవులే ఎక్కువ వున్న యీ సంఘంలో ఒకటీ అరా నిజాయితీ పరులుంటే వాళ్ళను తిరిమి చంపేయడం, ఆనక వాళ్ళకి గొప్పదనాన్ని ఆపాదించి నాలుగు రోడ్లకూడలిలో విగ్రహావిష్కరణ కోసమో, సంతాప సందేశాలలో గొంతులు చించుకోడంకోసమో కాలాన్ని వెచ్చించే కళాత్మక హృదయులూ, జరుగుచున్న ఏ అనర్థానికైనా కర్మసిద్ధాంతాన్ని అన్వయించి మనకెందుకులే అనుకునే సూడో తాత్వికులూ వున్న యీ సొసైటీలో నీకేదో వాళ్ళు ఒరగబెడతారూ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నావూ అని నన్ను నువ్వు అడగచ్చు. నీటిలో కొట్టుకుపోతున్నది తేలైనా పాపం ఒడ్డున పడేద్దాం అనేది నా తత్వం. సహకరిస్తున్నా సానుభూతి లేకుండా కుట్టడం దానితత్వం. అంతే! నిరాశావాదాన్నీ ఆశాజనకంగా చెప్పే నన్ను చూసి నవ్వుకోకు మిత్రమా! ఇంకా మూడుపదులు దాటని నిన్ను చూస్తుంటే ఎందుకో మనసు కదిలింది. ఇంకా జీవిత ప్రాంగణపు  అనుభూతులు చూడని నువ్వేదో అవుతావన్న బాధ నాచేత అలా మాట్లాడిస్తుంది" లేచాడు రామసూరి హరితని చూస్తూ.