Read more!

హ్యూమరాలజీ - 3


                                 ఆహా! విమాన ప్రయాణం

    
      (విమానాల పనితీరు ఆ రోజుల్లోనే కాదు ఇప్పుడూ అలాగే అఘోరించింది.)


              


    విమాన ప్రయాణాలు మా కాలనీ వాళ్ళకు కొత్తేం కాదు.

 

    రెండుమూడు సార్లు ఎయిర్ పోర్ట్ కెళ్ళి మా కాలనీ కొచ్చిన కొంతమంది వీఐపీలకు వెల్ కమ్ లు, సెండాఫ్ లు ఇచ్చాం.

 

    మేము వెయిటింగ్ హాల్ కెళ్ళడం, అక్కడ ఫ్లైట్ ఎనౌన్స్ మెంట్, సెక్యూరిటీ చెక్ ఎనౌన్స్ మెంట్స్ వినడం, అప్పుడు తిరిగి ఇళ్ళకు చేరుకోవడం జరుగుతుండేది.

 

    అప్పుడప్పుడూ మాత్రం లోలోపల మాకనిపిస్తుండేది- ఎప్పుడయినా మేమూ విమానంలో ప్రయాణం చేస్తే బాగుంటుందని.

 

    కానీ రైల్లో సరదాగా మాకిష్టమయిన ఊళ్ళు చూడ్డానికే ఆర్ధిక స్థోమతులేనివాళ్ళం- అలా విమానాల్లో ప్రయాణం గురించి కలలు కనడం మన డెమొక్రసీకే అవమానం గనుక మా కోరికను లోలోపలే అణచుకునేవాళ్ళం.

 

    అకస్మాత్తుగా ఓ రోజు మా రంగారెడ్డికి టెలిగ్రామ్ వచ్చేసరికి ఎవరికో సీరియస్ గా వుంది కాబోల్నని అందరం అతని ఓదార్చడానికి గుమికూడాం.

 

    తీరా చూస్తే ఆ టెలిగ్రామ్ భారత్ బ్రాంది కంపెనీ వాళ్ళ దగ్గర్నుంచి వచ్చింది.

 

    వాళ్ళు పెట్టిన "బ్రాంది మేరా సాథీ" కాంపిటీషన్ లో రంగారెడ్డికి ప్రథమ బహుమతి వచ్చిందని దాని సారాంశం! ప్రథమ బహుమతి అంటే రంగారెడ్డి ఉచితంగా మద్రాస్ కి విమాన ప్రయాణం- మద్రాస్ లో ప్రముఖ చలనచిత్ర సెక్స్ డాన్సర్ విద్యతో కలసి ఓ పెగ్గు భారత్ బ్రాంది తాగడం, తర్వాత ఆమెతో లంచ్- ఆ తర్వాత తిరిగి విమానంలో హైదరాబాద్ చేరుకోవడం-

 

    ఆ వివరాలన్నీ తెల్సేసరికి మాతోపాటు రంగారెడ్డి కూడా ఆశ్చర్యపోయాడు.

 

    "ఇదెక్కడి గొడవయ్యా! అసలిలాంటి కాంపిటీషన్ వున్నట్లే నాకు తెలీదే! దీనికి నేను సెలక్టవటమేంటి?" అన్నాడు అయోమయంగా.

 

    ఈలోగా రంగారెడ్డి భార్య కన్నీళ్ళొత్తుకుంటూ బయటికొచ్చింది.

 

    "నాకారోజే అనుమానం వచ్చిందన్నయ్యగారూ ఈ మనిషి తాగేస్తున్నారని! అక్కడికీ నిలదీసి అడుగుతే 'ఛ పిచ్చిదానా! నేను తాగడమేమిటే నీ తలకాయ! మా ఫ్రెండొకడు ఖాళీ చేసిన బాటిల్ బావుందని మనం మంచినీళ్ళు తాగడానికి ఉపయోగించుకోవచ్చనీ తీసుకొచ్చాను- అని అబద్ధం చెప్పారు" అందామె కోపంగా.

 

    ఆమె మాటతో మాకూ రంగారెడ్డి మీద అనుమానం వచ్చింది.

 

    "ఇదేం పని గురూ! నువ్వేం రాజకీయ నాయకుడివా? రోజూ తాగడానికి? మేము ఎప్పుడయినా పార్టీకి ఇన్ వైట్ చేస్తే న్యూ ఇయర్స్ డే ఒక్కరోజు తప్ప ఇంకెప్పుడూ తాగనని పెద్ద ఫోజిచ్చేవాడివి కదా!" అన్నాడు శాయిరామ్ ఉడికిపోతూ.

 

    రంగారెడ్డికి తిక్క పుట్టుకొచ్చింది.

 

    "ఏయ్- మీకేం మతుందా లేదా? నేను తాగడమేంటయ్యా! తాగుతున్నానని చెప్తే నాకేం భయమా? ఈ భారత్ బ్రాందీ గొడవేంటో నాకేమాత్రం తెలీదు. ఎవరో నన్ను అభాసుచేయడానికి వేసిన ప్లాన్" అన్నాడు నెత్తీ నోరూ కొట్టుకుంటూ.

 

    అందరం కన్ ఫ్యూజన్ లో వుండగా మావెనుక సెపరేట్ గా కూర్చుని దీర్ఘంగా నిట్టూరుస్తూ కనిపించాడు చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్.

 

    అందరం వెనక్కు తిరిగి అతనివేపు చూశాం.

 

    "నీకేమొచ్చిందయ్యా- అలా ఒక్కడివే దూరంగా కూర్చుని ఏడుస్తున్నావ్?" అడిగాడు గోపాల్రావ్ అనుమానంగా. అడగడం ఆలస్యం- ఒక్కసారిగా భోరుమన్నాడతను.

 

    "ఏడవకేం చేయను గురూ! నా బ్రతుక్కి "లక్" అనేది ఏ కోశానా లేదు. ఇప్పుడే కాదు. నా చిన్నప్పటినుంచీ ఇంతే! క్లాస్ టెస్ట్ పెట్టినప్పుడల్లా క్లాస్ లో నేనే ఫస్ట్ వచ్చేవాడిని. తీరా యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏదొక ఆన్సర్ మర్చిపోవడం-రమణ గాడికి ఫస్ట్ మార్క్ లు రావడం జరిగేది. అందాకా ఎందుకు కాలేజీలో చదివేప్పుడు ఆరునెలలు కామేశ్వరి ఇంటి చుట్టూ తిరిగినందుకు ఆ అమ్మాయి జాలిపడి ఫలానా రోజు సినిమాకు రమ్మని రాసిన వుత్తరం మా రూమ్మేట్ కి దొరికింది. వాడు ఝామ్మంటూ ఆమెతో సినిమాకెళ్ళి- చివరకు ఆమెనే పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. వీటన్నికంటె దారుణమయిన విషయం ఏమిటంటే- నేను ఆ రోజుల్లోనే వెరయిటీ నవల రాయాలని చేతబడికి సంబంధించిన వివరాలన్నీ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి సేకరించాను. నవల సగం రాశాక రెండు నెలలు బద్దకించేసరికి యండమూరి కాస్తా ఆ నవల రాసి క్రెడిట్ కొట్టేశాడు. అందాకా ఎందుకూ మొన్నటికి మొన్న- ఫారెస్ట్ మీద నవల రాయాలని మా కజిన్ బ్రదర్ ఫారెస్ట్ రేంజర్ గా పని చేస్తున్న ఓ అడవికెళ్ళి అడవులకు సంబంధించిన వివరాలన్నీ సేకరించుకొని నవల రాయడం మొదలుపెట్టానో లేదో ఇంకో రచయిత అదే సబ్జెక్ట్ తో సీరియల్ మొదలు పెట్టేశాడు..."

 

    మేము అడ్డుపడకపోతే అతనలా అన్నం, నీరు లేకుండా యుగాల తరబడి చెప్తూనే వుంటాడని మాకు అనుభవపూర్వకంగా తెలీడం వల్ల ఠక్కున అతని నోరు మూసేశాము.

 

    "అదంతా ఎందుగ్గానీ ఇప్పుడు నీ ఏడుపుకి కారణం ఏమిటో చెప్పు చాలు" అన్నాడు జనార్థన్.

 

    "అదే చెపుతున్నా గురూ! నాకు చిన్నప్పటినుంచీ-"

 

    "అదే వద్దన్నాను ఇప్పటి సంగతి మాట్లాడు! చిన్నప్పటి సంగతి చెప్పకు" కోపంగా అన్నాన్నేను.