చింతతో వడదెబ్బ చింత మాయం

 

చింతతో వడదెబ్బ చింత మాయం

 


ఎండలు ఎంతలా ఉన్నాయంటే బయటకెళ్ళి వస్తే చాలు కళ్ళు తిరిగిపోతున్నాయి అందరికి. వదదెబ్బ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నారు. అలాగని పూర్తిగా బయటకి వెళ్ళటం మానేసి ఇంట్లోనే కూర్చోవాలంటే అవ్వదు కదా. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే, ఎందుకు లేదు ఉంది. ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే వడదెబ్బ నుంచి మనని మనం రక్షించుకోవచ్చు.

 


వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఉల్లిపాయ ఒక దివ్య ఔషదం. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే బయటకి వెళ్ళేటప్పుడు ఒక నీరుల్లిపాయను మన జేబులో గాని మన చేతిలో గాని పెట్టుకుంటే మంచిది. ఒకవేళ కాస్త ఒళ్ళు వేడెక్కింది అని అనిపించగానే ఉల్లిపాయని ముద్దలా చేసి నుదుటి మీద రాస్తూ ఉండాలి. అలాగే గుండెలమీద కుడా రాయచ్చు. ఇంకా త్వరిత ఉపశమనం కోసం ఉల్లిపాయని ఉడికించి ఉప్పు, జీలకర్ర  వేసి ఆ రసాన్ని తాగించినా మంచి ఫలితం ఉంటుంది. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని ఊరికే అన్నారా పెద్దవాళ్ళు.


ఒంట్లో వేడి తగ్గటానికి కొత్తిమీర పుదీనా రసం చక్కటి ఔషదం. ఈ రెండింటిలో ఉష్ణాన్ని తగ్గించే గుణం పుష్కలంగా ఉంది. వేసవి తాపం వల్ల జ్వరాలు రాకుండా ఉండాలంటే కొత్తిమీర పుదీనా రసంలో కొద్దిగా పంచదార వేసి తాగిస్తే ఎంతో మంచిది. ఇది చర్మాన్ని కూడా పొడిబారిపోకుండా చూసుకుంటుంది.


అలాగే మెంతి కూర ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి కాసేపు నీటిలో నానబెట్టి ఆ రసంలో తేనె కలిపి ఒక చెంచాడు చొప్పున రెండు గంటలకోసారి తాగిస్తూ ఉంటే వడదెబ్బ దూరమవుతుంది. మెంతి కూరలో కూడా ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉండటం వల్ల ఇది వేసవికాలంలో ఎక్కువగా తీసుకోవటం మంచింది. పప్పులో లేదా రైస్ ఐటమ్స్ లో తగిన రీతిలో మెంతి కూరని చేర్చుకుంటూ ఉండాలి.

 


ఇక చింతకాయ గింజల విషయానికొస్తే వీటిలో విటమిన్లు, మినరల్స్ ఇంకా ఎలక్ట్రోలైట్స్ సమృద్దిగా ఉండటం వల్ల వేసవిలో వీటిని సేవించటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చింతగింజలని నానబెట్టి రాయి మీద అరగదీస్తే వస్తే గుజ్జులో కాస్త తేనె కలిపి తీసుకుంటూ ఉంటే ఒంట్లో ఉన్న అతివేడి కూడా తగ్గి ఆరోగ్యం కుదుట పడుతుంది.

 

 


వడదెబ్బని నివారించటంలో పచ్చి మామిడి రసం కూడా మంచిపని చేస్తుంది. వేడి చెయ్యకుండా ఉండాలంటే మామిడిరసంలో చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి వేసి రోజుకి రెండు మూడు సార్లు తాగితే శరీరం చల్లబడుతుంది.


వీటన్నిటితో పాటు ఎండాకాలం బయటకి వెళ్ళేటప్పుడు మొహానికి దళసరి కాటన్ గుడ్డని కట్టుకుంటూ, ఎక్కువగా ద్రవ పదార్థాలు తాగుతూ ఉంటే వడదెబ్బ మీ జోలికి రాకుండా ఉంటుంది.


..కళ్యాణి