గుమ్మడి విత్తనాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

గుమ్మడి విత్తనాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి అని చిన్నప్పుడు భలే ఆడుకునేవాళ్ళం. అయితే ఇప్పుడేంటట అనే ప్రశ్న వద్దులెండి. గుమ్మడికాయ ఒక కాయగూర గానే కాకుండా భారతీయ హిందూ సాంప్రదాయంలో కూడా భాగం. క్రమక్రమంగా మాంసాహారం వైపు మళ్ళుతూ సాంప్రదాయ వంటకాలను కూరగాయలను మరుగున పడేస్తున్నారు నేటితరం వారు. ఇప్పుడు గుమ్మడికాయ స్తోత్రం ఎందుకట అనే ప్రశ్న గనుక మీరు వేస్తే దానికి సమాధానం గంపెడంత గుమ్మడి పొట్టలో మెరిసే విత్తనాల రాజసం గురించి చెప్పాలి.

దోస, గుమ్మడి, పుచ్చకాయ వంటి విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒకప్పుడు ఈ కాయలలో వేటిని కట్ చేసినా పండు తినేసి విత్తనాలు పడెస్తూ ఉండేవారు. ఏ కొద్దిమందో ఆ విత్తనాలను ఎండబెట్టుకుని టైంపాస్ గా తింటూ ఉంటారు.అయితే ప్రస్తుత కాలంలో వీటికి ప్రాధాన్యత పెరిగింది. దోస, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్, కర్భూజ వంటి విత్తనాలను ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకోవాలని పోషకాహార నిపుణులు మొత్తుకుని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు వీటిని ఎంత తీసుకుంటే అంత మంచిదని అంటున్నారు. ఇంతకూ గుమ్మడికాయ విత్తనాలు ఎందుకు తీసుకోవాలి వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటి వంటి విషయాలలోకి వెళితే..

విత్తనం చిన్నదే అయినా అందులో ఉన్న పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. గుమ్మడి విత్తనాలలో పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్ సహా  ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉంటాయి. ఈ క్రొవ్వులు శరీరంలో అధిక శాతంలో ఉండే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీని ఫలితంగా చాలా మందిని ఇబ్బంది పెట్టే టైప్-2 డయాబెటిస్ రాకుండా చేయడంలో గుమ్మడి విత్తనాలు సహాయపడతాయి. 

ఇక గుమ్మడి విత్తనాలు నిద్రకు మంచి మందు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్, జింక్ అనే రెండూ కలసి సెరటోనిన్ గా మార్పు చెందుతుందట. ఈ సెరటోనిన్ కూడా మెలటోనిన్ అనే హార్మోన్ గా రూపాంతరం చెందుతుంది. మంచి నిధ్ర పట్టడానికి ఈ మెలటోనిన్ అనే హార్మోన్ చాలా సహాయపడుతుంది. అందుకే రాత్రి నిద్రపోయే ముందు ఓ పది గుమ్మడి విత్తనాలు తిన్నా అద్బుతమైన నిద్ర సొంతం చేసుకోవచ్చు. 

నిద్రకే కాదు అధిక బరువు ఉన్నవారికి కూడా ఈ గుమ్మడి విత్తనాలు వరమని  చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని కొద్దీ మొత్తంలో తీసుకున్న తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల ఎక్కువసేపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండే వెసులుబాటు కలుగుతుంది. ఎలాగూ ఇందులో ప్రోటీన్లు, కెలోరీలు అధికంగా ఉంటాయి. అయితే ఇవి ఆరోగ్యకరమైన క్రొవ్వులు కాబట్టి, వీటిని తక్కువ మొత్తంలోనే తీసుకుంటాం కాబట్టి వీటి ద్వారా శరీరానికి అందే క్రొవ్వులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే… ఈ కారణంగా ఇది జీర్ణాశయంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడంలో బెస్ట్ గా పని చేస్తుంది. అధిక బరువుకు దూరంగా కూడా ఉండవచ్చు.

ఇమ్యూనిటీ బూస్టర్!!

గుమ్మడి విత్తనాలు గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తాయి. వీటిలో ఉండే జింక్ గాయాలను, బాక్టీరియా, వైరస్ లతో సమర్థమవంతంగా పోరాడగలుగుతుంది, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఇందులో ఉండే మాంగనీస్, విటమిన్ కె శరీరంలో ఎక్కడైనా  గాయాలు అయితే అవి నయం అవడంలో సహాయపడతాయి. ఉదయం టిఫిన్ తినే సమయంలో లేదంటే మధ్యాహ్నం లంచ్ చేయడానికి ముందు లేదంటే ఉదయం నుండి  అప్పుడప్పుడు బ్రేక్ సమయాల్లో గుమ్మడి గింజలను ఓ 10 నుండి 15 వరకు తిన్నా సరిపోతుంది. చెప్పలేనంత శక్తి, రోగనిరోధక శక్తి లభిస్తాయి. 

కురులకోసం..

చాలామంది ఇప్పట్లో గుమ్మడి విత్తనాలను వాడేది కేవలం జుట్టు సంరక్షణ కోసమే. జుట్టు పెరుగుగుదలకు  తోడ్పడే కుకుర్ బిటాసిన్, అమినో యాసిడ్స్ గుమ్మడి విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ, కేరోటినాయిడ్లు జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. కొల్లాజెన్ తయారవడానికి దోహదం చేసి జుట్టు, చర్మం, గోర్లు  ఆరోగ్యవంతంగా ఉండటానికి దోహదపడుతుంది. చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

ఇవీ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.


                                      ◆నిశ్శబ్ద.