డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే వినాయకుడి మండపం!

డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే వినాయకుడి మండపం

పండుగ అంటే అందరికీ సంబరమే. కొన్ని ప్రాంతీయ పండుగలు అయితే మరికొన్ని జాతీయ పండుగలు. దేశం యావత్తు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. వినాయకుడు భక్తుల కష్టాలు తీర్చేవాడు. పార్వతీదేవి ముద్దుల తనయుడు. పరమేశ్వరుడి మెప్పు పొంది  ఏ కార్యంలోనైనా తొలిపూజ అందుకునే వరం పొందినవాడు. అష్టసిద్దులు పొందినవాడు. వినాయకుడి పూజ ఎంత నిష్ఠగా చేసుకుంటే అంత ప్రశాంతత. జీవితంలో కష్టాలు మెల్లగా తొలగిపోతాయి. అయితే ప్రతి ఒక్కరికీ తాము చేసుకునే పండుగ కాస్త ప్రత్యేకంగా ఉండాలని అనిపిస్తుంది. ఇందుకోసం  రకరకాల పిండివంటలు ఎలాగూ చేస్తారు. కానీ వినాయకుడి మండపం, దాని అలంకరణ అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలాగని ఊరికే ఉండలేం కదా. అందుకే వినాయకుడి మండపాన్ని చాలా ఈజీగా, పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లో మీరే స్వయంగా ఏర్పాటు చేస్తే మీ ఇంట్లోవారే కాదు.. చూసిన ప్రతి ఒక్కరూ శభాష్ అనకుండా ఉండలేరు.

వినాయక చవితి రోజు ఇల్లు అలకడం, పిండివంటలు చేయడం అందరూ చేసేదే. కానీ ప్రకృతి ప్రియుడు అయిన వినాయకుడికి  చాలా సహజంగా మండపం ఏర్పాటు చేసి,  అంతే సహజంగా డెకరేషన్ చేయచ్చు.

గ్రామీణ ప్రాంతాలలో  నివసించేవారు అయితే అరటి చెట్లు తెచ్చి పెడుతుంటారు. కానీ ఇవి అందరికీ అందుబాటులో ఉండవు. ఇలాంటి వారు ఏం చేయాలంటే  ఫ్రిడ్జ్ లు, పరుపులు, కూలర్ లు వచ్చిన అట్టముక్కలు ఉంటాయి. ఈ అట్టముక్కలను చుట్టగా చుట్టి ఏదైనా తాడు తీసుకుని బిగుతుగా కట్టేయాలి. ఇలాంటివి నాలుగు తయారు చేసుకోవాలి. వీటిని మండపానికి స్థంభాలుగా ఉపయోగించవచ్చు.  వినాయకుడి పరిమాణాన్ని బట్టి ఈ మండపాల ఎత్తు  చూసుకోవచ్చు.  నాలుగు ప్లాస్టిక్ డబ్బాలలో ఇసుక వేసి వాటిలో ఈ స్థంబాలు పెట్టాలి. ఇప్పుడు అవి బాగా గట్టిగా నిలబడగలుగుతాయి. వీటికి పైన ఒక దాన్నుండి మరొక దానికి సన్నని తీగలాంటి తాడుతో బిగుతుగా కట్టాలి. నాలుగు స్థంబాలను అనుసంధానం చేస్తూ ఇలా కట్టిన తరువాత మండపం చాలా వరకు సెట్ అయినట్టే.  ఈ అట్టముక్క స్థంబాలు బయటకు కనిపించకుండా ఉండటం కోసం  చమ్కీలతో ఉన్న చీరలకు మొదలు, చివర కుచ్చిళ్లు పెట్టి వీటిని స్తంభానికి చుట్టూరా ఉండేలా చుట్టాలి. ఇందుకోసం సేప్టీ పిన్ ఉపయోగించవచ్చు. లేదా జాగ్రత్తగా స్టాప్లర్ కూడా ఉపయోగించి ఫిక్స్ చేయవచ్చు.  రెండు స్థంభాలకు ఒక చీర చెప్పున ఫిక్స్ చేయాలి. పైన చాలా తేలికగా ఉన్న చీర లేదా చున్నీ వేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ చీరలు బరువు లేకుండా చాలా తేలికగా ఉండాలి.

వినాయకుడు ప్రకృతి ప్రియుడు.. అందుకే అలంకరణ చాలా సహజంగా పువ్వులు, తీగలు, లైట్లతో ఉంటే  బాగుంటుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను ఒకదానికొకటి ముడివేస్తూ పొడవాటి తీగలాగా తయారుచేసుకోవాలి. దీనికి తెలుపు, ఎరుపు, పసుపు మందారాలతోనూ, కాగితం పువ్వులతోనూ అలంకరణ చేయాలి. ఆకుపచ్చని ఆకులను మధ్యలో అక్కడక్కడా ఉంచాలి. ఇలా చేస్తే చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటుంది.  ఇక వినాయకుడికి ఆసనం కోసం పెద్ద పీట వేసి మధ్యలో ఆయన్ను ప్రతిష్టించాలి.  అయితే  పూజ కోసం వెలిగించే దీపాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  దీపాలు పొరపాటున చీరలకు తగిలినా సంతోషం మొత్తం విషాదంగా మారుతుంది.

మండపానికి ఇరువైపులా రెండు టేబుళ్లు వేసి వాటిమీద  ఒకే రంగు చున్నీలతో కవర్ చేయాలి. దీంతో అది ఎంతో అందంగా కనిపిస్తుంది. వీటిమీద పువ్వులు, గరిక రెండు కలిపి ఉంచితే చాలా ఆకట్టుకుంటుంది. ఈ మండపానికి మరింత మెరుపులు తీసుకురావడం కోసం  చిన్న లైట్లు అయినా సెట్ చేయవచ్చు. అవి పెట్టడానికి  అనుకూలం లేకపోతే ఛార్జ్ లైట్లు ఉంటాయి. వాటిని నాలుగు మూలలా ఏర్పాటు చేయవచ్చు. వినాయకుడి విగ్రహానికి అలంకరణ కోసం అందుబాటులో ఉన్న రంగురంగుల పువ్వులను ఉపయోగించాలి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే భక్తి్పేరుతో వినాయకుడిని పువ్వులు, పత్రితో ముంచెత్తకూడదు. వినాయకుడిని ఆసీనం చేసినతరువాత కొంచెం ముందుగా పీట వేసి పువ్వులు, పండ్లు, ప్రసాదాలు మొదలైనవి ఉంచాలి. వినాయకుడు ప్రకృతి ప్రియుడు కాబట్టి సహజమైన అలంకరణ, భక్తితో చేసే పూజ,  భక్తిగా సమర్పించే ప్రసాదం ఆయన్ను సంతుష్టుడిని చేస్తుంది.

                                             *నిశ్శబ్ద.