ఆహారం + వ్యాయామం = ఆరోగ్యం
posted on Mar 2, 2023
ఆహారం + వ్యాయామం = ఆరోగ్యం
అందంగా, తక్కువ బరువుతో మెరుపు తీగలా కనిపించాలని కోరుకుంటారు ఎవరైనా. దానికోసం నోరు కట్టేసుకుని ఏమీ తినకుండా కూడా వుంటారు. అయితే తినడం మానేస్తే బరువు తగ్గుతారనుకోవటం అపోహ మాత్రమేనని, సరైన ఆహారం, వ్యాయామం రెండూ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాల పట్ల కొంచెం శ్రద్ద పెట్టండి చాలు... మీరు కోరుకున్నట్టు మెరుపు తీగలా మారటం ఖాయం అంటున్నారు.
1. మొదట గుర్తుపెట్టుకోవలసిన విషయం.." ఒక్కొక్కరి ఒంటి తీరు ఒక్కోలా వుంటుంది. కొందరిలో కొవ్వు ఇట్టే పేరుకుపోతే మరికొందరు ఎంత తిన్నా లావెక్కరు. కాబట్టి అందరికీ వర్తించేలా సూత్రాలు ఏవీ ఉండవని గ్రహించి, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఒకసారి పోషకాహార నిపుణులని కలసి, మీ జీవన విధానం , తీసుకునే ఆహారం వంటివి చెప్పి సలహా అడగాలి. వారు సూచించిన ప్రకారం ఆహారం తీసుకుంటే బరువు తగ్గటం అందని ద్రాక్ష ఏమి కాదు.
2. యోగ చేయాలని, అది శరీరాన్ని, మనసుని ఆరోగ్యంగా ఉంచుతుందని ఎప్పటి నుంచో వింటున్నాం. ఒకరోజు చేసి, ఒక రోజు మానేసి లేదా ఏ టీవీలోనో చూసి సొంతగా చేయటం కాకుండా, ఈ యోగకి కూడా ట్రైనింగ్ తీసుకుంటే.. ఆ ట్రైనర్ మీ శరీర తత్వాన్ని బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి మీరు ఏ ఆసనాలు వేయచ్చు అన్నది నిర్ణయిస్తారు. అప్పుడు మీరు కోరుకున్న లక్ష్యం చేరటం కష్టం కాదు.
3. నడక వెంటనే మొదలు పెట్టగలిగిన ఓ వ్యాయామం. ప్రకృతితో మమేకం అయ్యేలా చేసే శక్తి నడకకి వుంది. ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
4. డాన్స్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం. కాని ఇప్పుడు టైం లేదు... అనేది చాలామంది చెప్పగా వింటుంటాం. చిన్నప్పుడే కాదు.. ఇప్పుడు డాన్స్ చేయచ్చు మీ ఫిట్‌నెస్ కోసం. వీలైతే నేర్చుకోండి. లేదా చక్కగా పిల్లలతో కలసి పాటలు పెట్టుకుని మీకు నచ్చినట్టు, వచ్చినట్టు డాన్స్ చేయండి. రోజు అలా చేస్తే ఉల్లాసంగా ఉండచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండచ్చు. శరీరంలోని ప్రతి అవయవాన్ని కదిలించేలా డాన్స్ చేస్తే కాలరీలు ఇట్టే ఖర్చు అవుతాయి.
5. మంచి నీరు సరిపడా తాగుతున్నారో లేదో చూసుకోండి. పళ్ళ రసాలు తాగటం మంచిదే కాని అందులో పంచదార వేయకుండా తాగితేనే ఫలితం.
ఫిట్‌నెస్ కావాలంటే ఈ చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి. ఫిట్‌గా వుంటే ఆక్టివ్‌గా ఉండచ్చు. ఆక్టివ్‌గా వుండేవారి వయసు పెరగదుట. ఎప్పుడూయూత్‌లానే కనిపిస్తారు. మరి మీరు ఆ కాంప్లిమెంట్స్ పొందాలంటే ప్రయత్నాలు ప్రారంభించండి.
-రమ