Read more!

నివేదిత


    ఇంతకీ తనని ఎటువైపు తీసుకుపోతున్నాయని? కళ్ళు చికిలించుకుని చూశాడు. అంతటి చాంచల్యస్థితిలోనూ అతని గుండె గుభేలుమంది.

 

    టిప్పూడ్రాప్ వైపే పోతున్నది రథం.

 

    మళ్లీ ఎక్కడో పిడుగు పడింది.

 

    దడదడదడమని కంపిస్తున్నది భూమి.

 

    ఎట్లా అయినా గుర్రాల నాపుజేయాలని అతడు సర్వవిధాల ప్రయత్నిస్తున్నాడు. ప్రయోజనం శూన్యం. పిడుగు పడిన శబ్ధానికి అదురుపాటుతో అవి యింకా పిచ్చెక్కి కట్టలు తెగిన ప్రవాహంలాగా మరింత వేగంగా పరిగెత్తసాగాయి.

 

    అతని కళ్ళు గిర్రున తిరగసాగాయి. కనులముందు చీకట్లు క్రమ్ముతున్నాయి. టిప్పూడ్రాప్ క్షణక్షణం దగ్గరపడుతోంది. ఆ దృశ్యం చూడ లేక గట్టిగా కళ్లు మూసుకున్నాడు.

 

    ఆ క్షణంలో అతని కేమనిపించి వుంటుంది? వేదిత గుర్తుకు వచ్చింది!

 

    తను ఆమెను మొదటిసారి చూడటం, అనుభూతి చెందటం, ఆమెతో కలసి డ్యాన్స్ చేయటం, సినిమాలో నటింపజెయ్యటం, ఆమెతో తన అవస్థలు, అనుభవాలు సినిమారీలులా గబగబ గుర్తుకువచ్చాయి.

 

    గుర్రాలు పిచ్చివేగంతో ముందుకు దూసుకు వెళ్లిపోతున్నాయి.

 

    తమతో రథాన్ని యీడ్చుకునిపోతున్నాయి నిర్థాక్షిణ్యంగా.

 

    భూమి దద్దరిల్లుతోంది. టిప్పూడ్రాప్ సమీపిస్తోంది ఫర్లాంగులు.... గజాలు.... అడుగులు.... అంగుళా....

 

    అంతే.... రవివర్మ ఒక చావుకేక పెట్టాడు. రయ్యిమని గాలిలోకి లేచి వేదిత చివరి దృశ్యంలో అధిరోహించవలసిన రథమూ, వాటిని వూన్చిన ఉత్తమజాతి ఆశ్వాలూ, రథంలోని రవివర్మ.... అంతా ఎన్నో అడుగులు క్రిందనున్న అగాధంలో పడిపోయారు.

 

    ఆ సమయానికి వేదిత నందీహిల్స్ లో తనకోసం ఏర్పాటుచేసిన కాటేజ్ లో మత్తెక్కిణ కళ్ళతో కూర్చుని, సీసానుండి గ్లాసు మీద గ్లాసు ద్రవం వొంపుకుని ఖాళీ చేస్తోంది.  

 

                                              * * *

 

    "అమ్మగారూ! అమ్మగారూ! అంటూ ఏడ్చింది త్రిమూర్తులు. "మొదట నాలుగు జీతం రాళ్ళకుగానూ మీ దగ్గర పనికి చేరిన నేను, మిమ్మల్ని వొదలలేనంతగా పెనవేసుకుపోయాను. కష్టమైనా సుఖమైనా మీతోనేననుకున్నాను. మీ దగ్గర జీతానికి పనిచేస్తున్నానన్న సంగతి మరిచిపోయాను. మీరిప్పుడు వెళ్ళిపోతానంటున్నారు. ఇన్నాళ్ళూ నా నీడన పసిపిల్లలా పెరిగారు. ఆభమూ, శుభమూ తెలీదు మీకు. ఎక్కడికి పోతారు? ఏం చేస్తారు?"

 

    వేదిత నీరసంగా నవ్వింది. రవివర్మ చనిపోయాక ఈ రెండు మూడు నెలలలోనూ ఆమెలో ఇంకా మార్పు వచ్చింది. అసలు ఇంట్లోంచి బయటకు కదలటం మానేసింది. ఎప్పుడూ సీసాలూ, గ్లాసులూ. స్నేహితులతో తిరగటం మానేసింది. ఆమె అంటే ఎవరికెంత భయమున్నా మోజు మాత్రం తీరదు. అందుకని ఈగల్లా ముసురుతూనే ఉన్నారు. తమలోకి ఈడ్చుకుపోదామని ప్రయత్నిస్తున్నారు. ఆమె కెందుకో ఈ బాధనుండి విముక్తి పొందుదామనిపించి బొంబాయి విడిచిపెడదామని నిశ్చయించుకుంది.    

 

    "చిన్నమ్మీ!" అంది వేదిత. "ఎక్కడికి పోతానో, ఏం చేస్తానో నాకు మాత్రం ఏం తెలుసు? చివరకు ఈ వింత జీవితం ఏ విధంగా అంతం కానున్నదో!"

 

    "మీతోపాటూ నన్నూ తీసుకు వెళ్ళండి. ఎంత దూరమైనా సరే వస్తాను. కాని మిమ్మల్ని మాత్రం విడిచి వుండలేను" అంది త్రిమూర్తులు ఏడుస్తూ.

 

    "ఎందుకు నా దగ్గరకు మరీ మరీ హత్తుకుపోవాలని ప్రయత్నిస్తావు? నువ్వూ అలాగే నాశనం అయిపోతావు" ఈ చివరిమాట వినిపించీ వినిపించకుండా అంది.

 

    త్రిమూర్తులు సరిగ్గా వినబడక "ఏమిటమ్మగారూ?" అంది. ఉహుఁ, ఏమీలేదు చిన్నమ్మీ!"

 

    తర్వాత వేదిత తనదగ్గరున్న నగలూ, బట్టలూ అన్నీ తీసి త్రిమూర్తులకు యిచ్చేసింది. ఆమె భుజంమీద చెయ్యివేసి దగ్గరకు లాక్కుని అంది. "నాచేత్తో యింత ఖర్చుపెట్టాను కాని డబ్బంటే నాకు తెలియదు. ఈ ఊరిలో నే నడుగు పెట్టినప్పట్నుంచీ నన్ను నీడలా వెన్నంటి ఉనూ కంటికి రెప్పలా కాపాడావు. నీ ఋణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను. నాకున్న సర్వస్వమూ నీకే యిచ్చిపోతున్నాను. వీటిని సొమ్ము చేసుకుని ఎక్కడైనా స్వతంత్రంగా బ్రతుకటానికి ప్రయత్నించు."

 

    ఆమె మనస్సు యిహ మరల్చలేనని తెలుసుకుని "మీరు లేనప్పుడు ఈ ఖరీదైన నగలూ, సొమ్ములూ నాకెందుకమ్మగారు ! ఏ పంచన పని చేసుకున్నా నా బ్రతుకు తెల్లవారిపోతుంది " అన్నది ఖేదంగా త్రిమూర్తులు.

 

    "అలాకాదు. వాటినెక్కడన్నా వృధాగా పారేయటంకన్నా, నీకు లభించినట్లయితే సరియైన విలువ లభించినట్లు అవుతుంది. కాదనకు చిన్నమ్మీ!"

 

    త్రిమూర్తులు యిహ తిరస్కరించలేక వాటిని భక్తితో స్వీకరించింది.

 

    వేదిత అంతగా మనస్సు విప్పి మాట్లాడటం త్రిమూర్తులకు ఆశ్చర్యంగానే ఉంది. ఆమె ఎప్పుడు మాట్లాడినా ఓ యంత్రం మాట్లాడినట్లు బొమ్మ పెదవులు కదిలించినట్లు ఉండేదిగాని, మనిషి మనస్ఫూర్తిగా మాట్లాడినట్లు ఉండేదికాదు.

 

    వొదల్లేక, వొదల్లేక యజమానురాలి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది త్రిమూర్తులు.

 

    వేదిత అంతకుముందే సక్సేనాకు ఫోన్ చేసి వుంది అతని ఆఫీసుకు. ఓ పావుగంట గడిచాక అతను వచ్చాడు.

 

    ఇద్దరూ సోఫాలలో ఎదురెదురుగా కూర్చున్నారు.

 

    అతడామెవంక వింతగా చూశాడు. ఆమె అందం అణుమాత్రమైనా తగ్గినట్లు లేకపోయినా, ఏదో మార్పు జరిగినట్లు కనబడిందతనికి. ఆమె వయస్సు పెరిగినట్లు, యితరులకు మరింత దూరంగా జరిగినట్లు, స్తబ్ధమైన ఆమె ప్రకృతికి అంతరాయం ఏర్పడి ఏదో వేదన ఆమెను వేధిస్తున్నట్లూ అతనికి పొడగట్టింది.

 

    "వెళ్ళిపోవటానికే నిశ్చయించుకున్నారా?" అన్నాడు పొడిగా.

 

    "అవును" అంది తల ఊపి.

 

    ఆమెను వారించటానికి అతనికి ధైర్యం చాలలేదు. వారించి ఏం ప్రయోజనం? వారిస్తాడు. ఆమె బహుశా ఉండిపోతుంది. ఏం జరుగుతుంది? ఇలా ఎన్నాళ్ళు? ముగింపు ఏమిటి? అతనకి భయం వేసింది.