Read more!

నానీ


    చీకటిలో అతడెవరన్నదీ గుర్తించలేకపోయినా ఎక్కడో విన్నకంఠం సునాయాసంగానే జ్ఞప్తికొచ్చింది నానీకి.

 

    మొహంపై టార్చివేసి చూస్తున్న ఆ వ్యక్తి డి.ఎస్పీ. సుందర్.

 

    "ఇక్కడున్నావా?"

 

    సుందర్ గొంతులో పైశాచికమైన ఆనందం.

 

    నానీ కళ్ళనుంచి నీళ్ళు బొటబొటా రాలాయి.

 

    తప్పించుకోవడానికి సాధ్యంకాని గుహలో ఆకలితోవున్న సింహపునోటికి చిక్కిన లేడిపిల్లలా వణికిపోతున్నాడు.

 

    ఆ క్షణంలో నానీకి ఏ దేవుడూ గుర్తుకురావడంలేదు.

 

    ముందు అమ్మ జ్ఞప్తికి వచ్చింది. వెంటనే తాతయ్య స్ఫురణకొచ్చాడు.

 

    "కుర్రవెధవా!... ఎంతమందికి పనిబెట్టావురా!"

 

    మరో అడుగు ముందుకేశాడు డి.ఎస్.పి. సుందర్.

 

    నిజానికి అక్కడకు వచ్చింది అనసూయ చేతికి నానీ ఆ ఫిల్మ్ రీల్ ఇచ్చివుంటే రహస్యంగా అది శోధించాలనైతే అదృష్టవశాత్తూ నానీయే చిక్కిపోయాడు.

 

    చాలా ప్రశాంతంగా వుందిప్పుడు.

 

    వెంటనే కాల్చి అప్పారావుకి, తనకి అతిముఖ్యమైన ఓ సమస్యని అంతం చేద్దామనుకున్నాడుగాని ఒకవేళ ఫిల్మ్ రీల్ మరెవరికైనా ఇచ్చాడేమోన్న సందిగ్ధత కొద్దిగా వారించింది.

 

    ఎలాగూ అందుబాటులో వున్నాడు. అది కనుక్కుంటే ఓ పనయిపోతుంది కదా! అనుకుంటూ "నీపేరు నానేకదా!" అడిగాడు.

 

    "అవునూ... నాపేరు నానీయే అంకుల్..." కట్టెలా బిగుసుకుపోతూ జవాబిచ్చాడు.

 

    "మరేమో... నేనేం తప్పు చేయలేదు. తాతయ్య పంపితే వచ్చానన్నమాట. నిజమంకుల్... నేనస్సలు అబద్ధం చెప్పను. ఒట్టు" క్రమంగా ధైర్యం సన్నగిల్లి ఏడుపొచ్చేస్తుంటే వెక్కిపడ్తున్నాడు.

 

    "నువ్వు నిజంగా నిజమే చెపుతావట్రా?"

 

    "ఓ" తలూపాడు. "ఎందుకంటే అమ్మ, తాతయ్య బాగా నేర్పేరన్నమాట."

 

    "అయితే నువ్వర్జెంటుగా ఓ నిజం చెప్పాలి" సుందర్ ఉత్సాహం ద్విగుణీకృతమైపోతుంటే "నీ దగ్గర ఓ ఫిల్మ్ రీలుందిగా... అదేరా ఆ చచ్చిపోయిన రాందేవ్ అంకుల్ నీకిచ్చాడే..." వీలయినంత సాత్వికంగా అడిగాడు.

 

    "అదెక్కడ...?" నానీ చేతులు ఫాంటుజేబులపై బిగుసుకొన్నాయి.

 

    ఇంతకుపూర్వమే ఆ ఫిల్మ్ రీల్ కోసం వెదికి ఉప్పుజాడీలో వున్న ఆ రీల్ తీసి జేబులో పెట్టుకున్నాడు.

 

    "ఒరేయ్! నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నేను గుర్తుపట్టెయ్యగలను. ఎందుకంటే నేను పెద్ద పోలీసంకుల్ నన్నమాట. అంత గొప్ప అంకుల్ని కాబట్టే నీకు జుట్టు లేకపోయినా నువ్వు నానీవే అని టక్కున పోల్చేశాను" ఈసారి కాస్త కటువుగా అన్నాడు.

 

    "నిజమే అంకుల్! రీల్ నాదగ్గరే వుంది" ఇక్కడా అబద్ధం చెప్పలేదు "చచ్చిపోతున్నప్పుడు పోలీసంకుల్ కివ్వమని చెప్పాడు ఆ చచ్చిపోయిన అంకుల్ కూడా."

 

    "అలాగట్రా! మరిచ్చెయ్."

 

    "మరి నన్ను ఏమీ అనవు కదా!"

 

    సుందర్ సహనం యిక్కడే నశించిపోయింది. వేలెడంత లేని ఈ గడుగ్గాయి యిన్ని కండిషన్లు పెట్టడం అసలు నచ్చలేదు. దూకుడుగా రెండడుగులు ముందుకేసి నానీ రెక్క పట్టుకోబోతుంటే ముందు అడుగుల చప్పుడు వినిపించింది.  

 

    వెంటనే "గుడీవినింగ్" అన్న పలకరింపు.

 

    ఊహించని ఈ అవాంతరానికి ముందు కంగారు, మరుక్షణం నానీ కంటబడతాడన్న తొట్రుపాటు అతడ్నెంత హడావుడి పరిచిందీ అంటే వేగంగా ద్వారందాటి బయటకొచ్చాడు.

 

    అక్కడ ద్వారానికి ఆనుకొని వున్న అరుగుపై రామసూరి కూర్చుని వున్నాడు పెదవులమధ్య బాటిలుంది. గటగటా త్రాగుతూ "అవునూ! విష్ చేశానే... జవాబు ఇవ్వరేంటి?" అన్నాడు.

 

    ఇలాంటి అతిముఖ్యమైన వేళ రోజులతరబడి తమని వేధిస్తున్న ఓ సమస్య కొలిక్కి వస్తున్న తరుణంలో సరిగా రామసూరిలాంటి అతి ప్రమాదకరమైన వ్యక్తి రావడం ఎంత అసహనానికి గురిచేసిందీ అంటే "అసలు నువ్విక్కడి కెందుకు వచ్చావు" అంటూ అరిచాడు ఉద్వేగంగా.

 

    "మీరెందుకొచ్చారో చెక్ చేద్దామని."

 

    "నువ్వెవడివి?"

 

    నవ్వాడు.

 

    "ఎవడినని అంత హైరానా పడిపోతున్నారు."

 

    నానీ ఏ క్షణంలోనైనా బయటకొస్తే తన పథకం అంతా మట్టిగొట్టుకుపోతుంది.

 

    "మిష్టర్ రామసూరీ! ఓ పోలీసాఫీసర్ గా నేను ఎక్కడికన్నా వెళ్ళగలను."

 

    "నేనూ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ఏ మూలదాకయినా మిమ్మల్ని వెంటాడగలను."

 

    "నువ్వెవడివి నన్ను వెంటాడటానికి? హూ ఆర్యూ ఐ సెడ్?" సుందర్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

    "అలా అరవకండి సుందర్ గారూ! ఏ పదవిలో వున్నవాడైనా నేరస్థుడైతే చాలు యిలా ఫాలో అవుతుంటాను."

 

    "వ్వాట్?"

 

    "అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. సామాన్యంగా అనుమానితుడ్ని మీ డిపార్టుమెంటు వాళ్ళు వెంటాడ్తుంటారు. కాని చిత్రంగా మా జర్నలిస్టుల లిస్టులో అనుమానితుడు కావడంతో మా కుర్రాళ్ళకి చెప్పాను మీమీద కన్నేసి వుంచమని. ఓ పదినిముషాల క్రితమే కబురందింది. ఇలా సరాసరి వచ్చాను మరేంలేదు. హరి తాలూకా ఆధారాలు గట్రా చేరవేసే ప్రయత్నమేమన్నా చేస్తున్నారేమో అని."

 

    "యూ" ఉక్రోషంగా మీదకు రాబోయాడు.

 

    చూపుడువేలిని ముక్కుకి అడ్డంగా వుంచుకున్నాడు రామసూరి. "తప్పు... ఆవేశపడకండి. అక్కడ గోడవార్న నిలబడ్డ మావాళ్లుగాని ఫోటోలు తీయగలరు. అలా మీదకి వంగోవద్దు... అబ్బే... రికార్డర్ లేదు. అక్కడ ఫోటోలు తియ్యడానికి మావాళ్ళుండగా రికార్డరెందుకండి? ఎంతైనా చింతచచ్చినా పులుపు చావనివాడ్నిగా... ఇలాంటిది ముందే ఊహించి ఇంటిదగ్గరే వదిలేశాను."    

   

    "నడు ఇక్కడ్నించి."