Read more!

డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం


    సూర్యానికి కలకత్తా యూనివర్సిటీలో ఎం.బి.బి.యస్. సీటు వచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీలో మార్కులు చాలనందున సీటు రాలేదు. చంద్రయ్య అంతదూరం పంపించి, అంత పెద్ద చదువు చదివించే తాహతు తనకు లేదంటూ మళ్ళీ పేచీ పెట్టాడు. దిగాలుపడి కూర్చున్న సూర్యానికి సత్యం ధైర్యం చెప్పాడు. సూర్యం కలకత్తాకు మరో నాలుగురోజుల్లో బయలుదేరి వెళ్ళాలి. ఇంకా డబ్బు ఏర్పాటు జరగలేదు. సూర్యానికి భయం పట్టుకున్నది.

 

    ఆ రోజు మధ్యాహ్నం సరళ, శాంతమ్మ ఫలహారాలు చేస్తుంటే సాయం చేస్తున్నది. సూర్యానికి ఏమీ తోచక అన్న గదిలోకి వెళ్ళాడు. ఆ రోజు సత్యం ఉదయమే కాఫీతాగి బయటకు వెళ్ళినవాడు ఇంకా తిరిగిరాలేదు. నియమబద్ధంగా అన్నిపనులూ చేసుకుపోయే సత్యం ఆ రోజు ఒంటిగంటదాకా రాకపోవడం సూర్యానికి ఆశ్చర్యం కలిగించింది.

 

    గదంతా చక్కగా సర్దివుంది. గోడకు ఆనించి ఉంచిన స్టాండు మీద అసంపూర్ణంగా వున్న చిత్రం ఉంది. అదేమిటో అర్ధం చేసుకోవాలని ప్రయత్నించాడు. కాని సూర్యానికి బోధపడలేదు. మోడర్న్ ఆర్ట్ తనకు అర్ధంకాదు. తనకేమిటి, చాలామందికి అర్ధంకాదు. ఆ మాటకొస్తే ఒక కళాకారుడు గీచే చిత్రం మరో కళాకారుడికే అర్ధంకాదు, ఇక తనకేం అర్ధమవుతుంది.?

 

    సూర్యందృష్టి పుస్తకాల బీరువావైపు మళ్ళింది. వెళ్ళి చూశాడు. ఈ రెండు సంవత్సరాలలో అన్నయ్య చాలా పుస్తకాలు కొన్నట్లున్నాడనుకొన్నాడు. మొదటి అరలో అన్నీ చిత్రలేఖనానికి సంబంధించిన పుస్తకాలే. రెండో అరలో చూశాడు. అన్నీ బెంగాలీ పుస్తకాలు ఉన్నాయి. మూడో అరలో ఉన్న ఇంగ్లీషు పుస్తకాలలో "పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే" బయటకు తీశాడు సూర్యం. అతను ఆ పుస్తకాన్ని గురించి విన్నాడు కాని చదవలేదు. బయటకువస్తూ మరోసారి అన్నయ్య వేసిన ఆ సంపూర్ణ చిత్రంవైపు దీక్షగా చూశాడు. ఈసారి కూడా అది అర్ధంకాలేదు. కాని మనస్సును ఆకట్టుకోగల గుణం ఏదో అందులో ఉన్నట్లనిపించింది. ఆ రంగుల మిశ్రమంలో కళ్ళకు హాయిని గొలిపే ఏదో అపురూప రూపం కనిపించినట్లయింది.

 

    సత్యం జీవిత విధానాన్ని గురించి ఆలోచిస్తూ బయటకు వచ్చాడు సూర్యం.

 

    సూర్యంకోసం ఫలహారం తీసుకొస్తూ ఎదురయింది సరళ.

 

    "పెద్దబావ వచ్చాడా? చూడనేలేదు. బావ పొద్దుటినుంచీ భోజనం చెయ్యలేదు, ఎక్కడకు వెళ్ళాడో ఏమో?" అంది సరళ.

 

    "నేనూ అదే ఆలోచిస్తున్నాను. అన్నయ్య ఈ సమయంలో ఎక్కడకూ వెళ్ళడే?" అన్నాడు సూర్యం.

 

    "ఇదిగో ఫలహారం తెచ్చాను. ముందుతిను," అని ప్లేటు అందించి, సూర్యం గదిలోకి వెళ్ళింది సరళ. వెనకే సూర్యం వెళ్ళి కూర్చుని పుస్తకం తెరిచి చూడసాగాడు.

 

    "ముందు ఫలహారం చెయ్యి. ఆ తరువాత చూడొచ్చు పుస్తకం" అంది, సూర్యం చేతుల్లోని పుస్తకం లాక్కుంటూ, పుస్తకం లాక్కుంది కాని సరళ సూర్యం చేతుల్లో చిక్కుకుపోయింది.

 

    "వదులు. అత్తయ్యా!"

 

    సూర్యం గాభరాగా సరళను వదిలేశాడు. సరళ వంటింట్లోకి కాఫీ తీసుకురావటానికి వెళ్ళింది.

 

    కాఫీ, ఫలహారం ముగించి సూర్యం పుస్తకం తెరిచాడు.

 

    "ఏమిటి బావా, నీకూ పెద్దబావకు పట్టిన పిచ్చే పట్టిందా?" అంది పుస్తకంలో లీనమయివున్న సూర్యాన్ని వారగా చూస్తూ.

 

    సూర్యం తల ఎత్తలేదు. అది చూసిన సరళకు ఉడుకుబోతుతనం వచ్చింది. సూర్యం చేతిలో పుస్తకం లాక్కోబోయింది.

 

    "ఉండు సరలా౧ ప్లీజ్! ఈ పుస్తకం బలేబావుంది. చదవనియ్యి."

 

    "ఉహూ! వీల్లేదు, అసలు అంత బాగావున్న ఆ పుస్తకం ఏమిటో?"

 

    "నీకు తెలియదులే చెప్పినా!"

 

    "అబ్బో అలాగేం! బావ నాకు తను చదివిన ప్రతి మంచి పుస్తకంలో కథ చెప్పాడు తెలుసా?"

 

    "ఊఁ!" సూర్యం అంతకంటే ఏమీ అనలేదు.

 

    "ఎల్లుండి వెళ్ళేప్పుడు ట్రైన్ లో చదువుకుందుగానిలే."

 

    "వెళ్ళినట్లే ఉంది?" నిరుత్సాహంగా ఉంది సూర్యం స్వరం.

 

    "తప్పక వెళతావు బావా! నువ్వు తప్పక డాక్టరువు అవుతావు. పెద్ద బావ మాట ఇచ్చాక తప్పక సాధిస్తాడు తెలుసా?" ఆమె స్వరంలో విశ్వాసం పలికింది.

 

    "ఏమండోయ్ డాక్టరుగారూ! ఏమిటా ఆలోచన? నాతో ఒక ఆట ఆడతావా బావా!"

 

    "ఆటా! నీకు చీట్లపేక ఆడడం కూడా నేర్పిస్తున్నాడా మీ పెద్దబావ?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సూర్యం.

 

    "ఇది పల్లెటూరండీ అబ్బాయిగారూ! ఆడపిల్లలు చీట్లపేకలు ఆడకూడదు తెలుసా? పైగా పెద్దబావలాంటివాడు చీట్లు కూడా ఆడతాడా?" మళ్ళీ ప్రశ్నించే అవకాశంకూడా ఇవ్వకుండా లోపలకు వెళ్ళింది సరళ. అలా వెళుతున్న సరళనే చూస్తూ ఆలోచనలో పడ్డాడు సూర్యం.  

 

    ఒకచేత్తో చింతపిక్కలతో నిండుగా వున్న పింగాణి గిన్నె, మరో చేత్తో వామన గుంటలు చెక్కా పట్టుకు వచ్చిన సరళవైపు విస్మయంగా చూశాడు సూర్యం.

 

    "ఏమిటలా నోరు తెరుచుకుని చూస్తున్నావు? వామన గుంటలంటారు ఈ ఆటను" అంది సరళ, చింతపిక్కలను లెక్కపెట్టి వామనగుంటల్లో వేస్తూ.

 

    "అంటే...... అక్కడ..... ఆ నేలమీద, మోకాలుమీద గడ్డం ఆనించి కూర్చొని వామనగుంటలు ఆడమంటావా?"

 

    "ఏమో మహా గొప్ప! విశాఖపట్నం వెళ్ళక ముందంతా ఆడపిల్లల ఆటలే ఆడేవాడివిగా?" అంది సరళ తను చేస్తున్న పనిమీదనుంచి తల ఎత్తకుండానే.  

 

    "పోనీయ్ లే రక్షించావు. ఏ తొక్కుడు బిళ్లో, చెమ్మచేక్కో ఆడమనలేదు." వస్తున్న నవ్వును ఆపుకో ప్రయత్నిస్తూ అన్నాడు సూర్యం. సరళకు నిజంగానే కోపం వచ్చింది. చింతగింజలన్నీ చిమ్మేసి గోడకానుకుని మూతి సున్నాచుట్టి కూర్చుంది.

 

    "కోపంలో ఇంకా అందంగా ఉన్నావు సరళా! ఆఁ నవ్వకు. ఆ మూతిని అలాగే ఉంచు" అన్నాడు సూర్యం.

 

    సరళ పెదవులపై చిరునవ్వు రేఖ మెరిసింది.

 

    "మా లెక్చరర్ చెప్పిన మాట నిజమే."

 

    "ఏమిటో అది?"

 

    "మనస్తత్వ శాస్త్రం చెప్పే లెక్చరర్ ఒకసారి ఏమన్నాడంటే, 'ఆడవాళ్ళకు కోపం వచ్చినప్పుడు బ్రతిమాలడంవల్ల లాభంలేదు. కోపంలో ఎంత అందంగా కనిపిస్తున్నావు అంటే చాలు, ఆడదాని మనస్సు ఇట్టే కరిగిపోయి నవ్వేస్తుంది' అని అన్నాడు."

 

    "ఉహూఁ సంతోషించాంలే!"

 

    సూర్యం సరళను రెప్పవేయకుండా చూశాడు.

 

    "ఏమిటలా చూస్తున్నావు? అది సరేగాని బావా! మీ క్లాసులో ఆడపిల్లలు కూడా చదువుతున్నారా?" కుతూహలంగా అడిగింది సరళ.

 

    "ఏం, ఎందుకు?"

 

    "చెప్పమంటుంటేనూ?"

 

    "ఆ, నలుగురు ఆడపిల్లలున్నారు."

 

    "వాళ్ళంతా చాలా ఫ్యాషన్ గా ఉంటారుగదూ?"

 

    "ఓ, బలే ఫ్యాషన్ గా ఉంటారు."

 

    "రెండు జడలు వేసుకుంటారా?"

 

    "రెండేం ఖర్మ, మూడు కూడా వేసుకుంటారు."

 

    "పో బావా! మరీను. చెప్పమంటుంటేనూ!"

 

    "ఏం, నీకు కూడా రెండు జడలు వేసుకోవాలని ఉందా?" వచ్చే నవ్వును ఆపుకుంటూ ప్రశ్నించాడు సూర్యం.

 

    "అత్తయ్య ఊరుకోదుగా! అయినా ఈ ఊళ్ళో ఎవరూ వేసుకోరు. నేను ఒకసారి గుంటూరు సినిమా చూట్టానికి వెళ్ళినప్పుడు చూశాను. ఎంతమందనుకున్నావు! అందరూ రెండు జడలే వేసుకున్నారు."

 

    సరళను చూస్తుంటే జాలివేసింది సూర్యానికి.

 

    "వద్దులే. గుర్రపుతోకల్లా రెండు భుజాలమీదా వేళ్ళాడే ఆ జడలుకంటే నీ జడే నాకు బాగుంది. పొడవుగా జడగంటలతో వీపుమీద అల్లల్లాడుతూ ఉంటే నీ జడ కోడెత్రాచుల్నే సవాలు చేస్తున్నట్లుంటుంది."

 

    "ఛీ! నా జడ పాములా అసహ్యంగా ఉందా?"

 

    సూర్యం ఏమనాలో తెలియక తెల్లముఖం వేశాడు.

 

    "బావా! మీ క్లాసులో చదివే అమ్మాయిలంతా చాలా ఫ్యాషనుగా ఉంటారా?"  

 

    "ఫ్యాషన్లకేం కొదవ? ఇప్పుడు రెండు జడలు ఫ్యాషన్ కాదు, నడినెత్తిన ముడులు వేసుకోవటం ఫ్యాషన్."

 

    "ముడి వేసుకోవటం ఫ్యాషనా?" ఆశ్చర్యంగా అడిగింది సరళ.

 

    "అవును మీ ముడి అంటే. అత్తయ్యా, మన ఊళ్ళో ఆడవాళ్ళూ వేసుకొనేలాంటి ముళ్ళు కాదు."

 

    "మరి?"

 

    "ఆ ముడి ఎలా ఉంటుందంటే, ఎలా చెప్పటం? అబ్బా! నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తావని తెలిస్తే ఎవరిదైనా ఒక ఫోటో అయినా తెచ్చేవాణ్ణి."

 

    "పోనియ్ లే చెప్పక్కర్లేదు."

 

    "అరేఁ వెళ్ళిపోతున్నావా? ఆ ముడి బలే తమాషాగా ఉంటుందిలే. నేను చిన్నప్పుడు కోటిరత్నం అనే ఆవిడ నారదుడి వేషం వెయ్యగా చూశాను. ఆ ముళ్ళు వేసుకున్నవాళ్ళను చూస్తే ఆవిడ గుర్తొస్తుంది."

 

    సరళ పకపక నవ్వింది. "బలేవాడివే బావా! ఆడవాళ్ళకు నారదునిలా కన్పించటం ఇష్టమంటావా ఏమిటి?"

 

    "అదేమో నాకేం తెలుసు? ఆఁ అలాంటి ముళ్ళు వేసుకున్న ఆడవాళ్ళు జుట్టును ముఖంమీద బాగా అణిచి దువ్వి, చెవులమీదుగా వేసుకుంటారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే తాటికాయలు గుర్తొస్తాయి. గుడిగోపురాలు గుర్తొస్తాయి. ఇంకా ఏవేవో గుర్తొస్తాయి" అంటూ పకపక నవ్వాడు సూర్యం.

 

    "అన్నీ అబద్ధాలే" అంది సరళ.


                                                          *    *    *


    "సరళా! చూడమ్మా నీకోసం కమల వచ్చింది."

 

    శాంతమ్మ కేక విని సరళ గబగబా బయటికి వచ్చింది.

 

    "కమల అత్తవారింటినుంచి వచ్చింది. నిన్ను చూట్టానికి వచ్చింది. అదుగో గదిలో కూర్చొనివుంది చూడు" అంది శాంతమ్మ.

 

    చిన్ననాటి స్నేహితురాలును, ముఖ్యంగా వివాహం అయి వెళ్ళిపోయి సంవత్సరం తర్వాత వచ్చిన కమలను కలుసుకోవడానికి ఆరాటంగా పరుగెత్తింది సరళ ఆ గదిలోకి. ఉయ్యాల బల్లమీద కూర్చొని విలాసంగా చిన్నగా ఊగుతున్న కమలను కళ్ళప్పగించి చూస్తూ నిల్చుని పోయింది సరళ. కమల అంతకుముందు సూర్యం వర్ణించినలాంటి ముడివేసుకుని వుంది. దేవతా వస్త్రాలను అధిగమించే మిలమిల లాడుతున్న నైలాన్ చీర, కాళ్ళకు జరీ చెప్పులు, చేతికి రిష్టువాచీ!

 

    "ఏమిటోయ్ అలా చూస్తున్నావు? అంత గుర్తుపట్టకుండా మారిపోయానా? కిలకిల నవ్వింది కమల. సరళకు ఆమె నవ్వులో కూడా ఓ ప్రత్యేకత కనిపించింది.

 

    "నువ్వేనా? అచ్చంగా సినిమాలో చూసిన ఎవరోలాగున్నావు!" అమాయకంగా అంది సరళ - ఇంతింత కళ్ళు చేసుకుని కమలను చూస్తూ.

 

    కమల మళ్ళీ కిలకిల నవ్వింది. సరళ వెళ్ళి కమల పక్కగా కూర్చొని కమల చీరను పట్టుకొని నలిపి చూస్తూ "ఏం చీర ఇది? నలిపినా నలగటంలేదు! యెంత మెత్తగా ఉందో!" అంది ఆశ్చర్యంగా.

 

    "దీన్ని షిఫాన్ అంటారు" అంది కమల.

 

    "ఎంతవుతుందేమిటి?" ఆశగా అడిగింది సరళ.

 

    దాని అసలు ఖరీదు పాతిక రూపాయలే - అయినా "డెబ్బయి అయిదు" అని గబుక్కున అనేసింది కమల.

 

    "డెబ్బయ్ అయిదా? బాబోయ్!" ఆశ్చర్యంగా అంది సరళ.

 

    "మరి? హైదరాబాదులాంటి పట్నంలో ఉండటమంటే ఏమనుకున్నావ్! ఇవి రోజూ ఇంట్లో కట్టుకునే చీరలు! బయటకు వెళ్ళాలంటే నూటపాతిక ఖరీదు చేసే చీరయినా కనీసం ఉండాలి!"

 

    సరళ ఆశ్చర్యపోయింది. తను కట్టుకున్న చీరవైపు చూసుకుంది. అరవయ్యో నంబరు గుంటూరు నేతచీర. "అబ్బ, ఎంత ముతకగా ఉందో!" అనుకుంది. కమల పక్కన కూర్చోటమంటే కొంచెం సిగ్గుగా కూడా అనిపించింది.

 

    సరళ భావాలను కొంతవరకు అర్ధంచేసుకున్న కమల అన్నది: "జీవితం అంటే పట్నంలోనే చూడాలి. ఈ మారుమూల పల్లెటూరి జీవితంకూడా ఒక జీవితమేనా! నీలాంటి అందమైన వాళ్లయితే ఎన్ని ఫాషన్లయినా చేసుకోవచ్చును."

 

    "ఆ ముడి ఎలా వేసుకుంటారు?" సరళ కుతూహలంగా ప్రశ్నించింది.

 

    "బాగుందా?"

 

    "చాలా బాగుంది. సూర్యం బావ అన్నీ అబద్ధాలే చెబుతాడు.

 

    "ఇలాంటి ముడి వేసుకున్న స్త్రీ నారదుడి లాగుంటుందనీ, మొఖం ముంజకాయను గుర్తు తెస్తుందనీను!"

 

    కమల పకపక నవ్వింది. సరళకూడా శృతి కలిపింది.

 

    "అయితే సూర్యం ఇక్కడే వున్నాడా?"

 

    "అవును. శెలవలకు వచ్చాడు. డాక్టరు చదవబోతున్నాడు కలకత్తాలో-"గొప్పగా చెప్పింది సరళ.

 

    "ఆహాఁ" అని ఊరుకుంది కమల, అదొక పెద్ద కబురు కాదన్నట్లు. సరళకు కొంచెం నిరుత్సాహం కలిగింది.

 

    "సత్యం ఇంట్లోనే ఉన్నాడా?"

 

    "లేడు, ఎక్కడకో వెళ్ళాడు-" సరళకు వళ్ళు మండింది. తను చిన్నబావను గురించి చెబుతుంటే మాట మారుస్తుందేం అనుకుంది.

 

    "సరళా! నీకు ఈ ముడి వెయ్యమంటావా?"

 

    "అత్తయ్య ఊరుకోదేమో!" సాలోచనగా అంది సరళ.

 

    "నిజమేలే. నన్ను ఈ ఊరివాళ్ళంతా కొత్తదాన్ని చూసినట్లు ఎంత వింతగా చూస్తున్నారో! పోనియ్, చూస్తే చూశారు. నాతోపాటు ఆడి, పాడినవాళ్ళుకూడా కొత్తమనిషిని చూసినట్లు చూసి ఊరుకుంటున్నారు. ఎప్పుడొచ్చావనయినా అడగరు. ఇప్పుడు ఇక్కడకు వొస్తున్నప్పుడు ఆ నాగరత్నం కనిపించింది. నేనే పలకరించా ఉండబట్టలేక. సరిగ్గా పలకనైనాలేదు ఏదో తప్పుచేసినవాళ్ళను చూస్తున్నట్లు చూస్తూ ఊరుకుంది" అంది కమల కొంచెం బాధగా.

 

    సరళ కమల మాటలను వినిపించుకునే స్థితిలో లేదు.