మహిళలు ఫిట్ గా ఉండాలంటే కీ పాయింట్స్ ఇవే!
posted on Sep 14, 2024
మహిళలు ఫిట్ గా ఉండాలంటే కీ పాయింట్స్ ఇవే!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు. అయితే దురదృష్టవశాత్తు ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడే మహిళలు అధికం. ఆడవారి జీవితంలో పెళ్లి తరువాత పిల్లలు, వారి బాగోగులు, భర్త, అత్తమామలకు సపర్యలు చేయడం. వీటితో కాలం గడిచిపోతూ ఉంటుంది. తలనొప్పో.. నడుమునొప్పో వస్తే ఓ నొప్పి మాత్ర వేసుకుని సమస్యను బుజ్జగించడం మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. తరచుగా పిల్లల ఆరోగ్యం వారి జీవితాలకు సంబంధించిన ప్రతిదానిని తల్లులు జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ స్వంత ఆరోగ్యం విషయానికి వస్తే, చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా సార్లు, పిల్లలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు, తల్లి ఎంతో గాభరా పడుతుంది. , ఆమె ఇంటి చిట్కాల నుండి డాక్టర్ ఇచ్చే చికిత్స వరకు అన్నీ పాటిస్తుంది. భర్త అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. కానీ తన విషయంలో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యమే. ఆడవారి ఆరోగ్యం తొందరగా పాడవ్వడానికి అసలు కారణాలు ఈ నిర్లక్ష్యమేనంటున్నారు వైద్యులు. మహిళలు ఫిట్ గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.
ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగినట్టు ఉంటుంది ఆడవారి పరిస్థితి. భర్తకు, పిల్లలకు వేడివేడిగా కాఫీని, పాలను అందించడం మొదలు రాత్రి వారు నిద్రపోయేవరకు పరుగులే. ఉద్యోగం చేసే మహిళలకు ఈ సమస్య మరింత అధికం. మహిళలు ఫిట్ గా ఉండాలంటే వీటిని పాటించాలి.
ముందు మీరే ముఖ్యం..
మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైన కీ ఏదైనా ఉందంటే అదే ప్రాధాన్యత. పిల్లలకు, భర్తకు, అత్తమామలకు చివరికి అతిథులకు కూడా ప్రాధాన్యత ఇస్తారేమో కానీ తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోవడం తక్కువ. ఖరీదైన చీరల్లోనో.. నగల్లోనో ఆరోగ్యం దాగుంటుందా?? వెన్నపూసి వదిలే మాటల్లోనూ.. ఖరీదైన వస్తువుల్లోనూ ఆరోగ్యం ఉంటుందంటే ఒప్పుకుంటారా?? ఇవన్నీ కాదు ఆడవారు తమకు తాము ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ఏ విషయంలో ప్రాధాన్యతలు ఇవ్వాలంటే..
ఆహారం..
వేడివేడిగా అందరికీ వడ్డించి చివరగా తాను తినే మహిళ.. ఆ ఆహారం తనకెంతమాత్రం పోషకాలను అందిస్తోందో ఆలోచించాలి. భర్త పార్టీలో తిన్నానని, పిల్లలు బయట తిన్నారని ఇంట్లో తినడం మనేసినప్పుడు.. రాత్రి, మరుసటిరోజు ఉదయం కూడా మిగిలిన దాంతో కడుపు నింపుకుంటారు కానీ పోషకాలను మాత్రం అందించలేరు. అందుకే తాజాగా, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
వ్యాయామం..
ఉదయం నుండి రాత్రి వరకు ఇంటి పని చేస్తున్నాం సరిపోదా అని అందరూ అనుకుంటే పొరపాటు. ఆడవారికి వ్యాయామం ఉండాలి. ముఖ్యంగా మహిళలకు గర్భసంచి బాగుంటే ఎన్నో రకాల సమస్యలు దరిచేరవు. హార్మోన్ల సమతుల్యత ఉంటే అన్ని విధాలా బాగుంటారు. వ్యాయామం ఆడవారి ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
బ్రేక్ లు భలే చిట్కాలు..
ఇంటి పని కావొచ్చు, ఆఫీసు పని కావొచ్చు.. రెండింటినీ డీల్ చేయడం పెద్ద టాస్క్ అనిపిస్తుంది. కానీ ప్రతి పనిలో గంటకోసారి 5 నిమిషాల రిలాక్సేషన్ మనిషిని అలసిపోనీయదు. అలాగని 5 నిమిషాల కోసం బ్రేక్ తీసుకుని అరగంట కూర్చుంటే మాత్రం పనులు నడవవు.
ఆత్మవిశ్వాసం..
వంట దగ్గర నుండి ఇంట్లో పనుల వరకు మీరు సమర్థవంతంగా చేయగలరనే ఆత్మవిశ్వాసంతో మొదలిపెట్టాలి. ఇలా మొదలుపెడితే అరగంట పని కాస్తా 15 నుండి 20 నిమిషాల్లో తెగ్గొట్టేయచ్చు.
మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి.
◆నిశ్శబ్ద.