Read more!

డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4


                                            11

 

    స్నానం చేసి ముస్తాబయి వచ్చిన గౌరిని చూశాడు చంద్రం. బాగా నలిగిమాసిన చౌకరకం సిల్కు చీరా, మిసమిస లాడుతున్న మెరూను రంగు 'శాటిల్' జాకెట్టూ - తమాషాగా ఉంది. ముఖానికి వేసిన పౌడరు తడిమీద వేసిందేమో అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా ఉంది. బిర్రుగా లాగి వేసిన జడకు పచ్చరిబ్బను వేసింది. ఆ జడచివర తేలికొండిలా వంకరంగా లేచింది. ఆమె వేషం చూడగానే చంద్రానికి నవ్వొచ్చింది.

 

    తేలుకొండీ జడ చూడగానే ఎనిమిది సంవత్సరాల క్రితం తన కట్లు విప్పి తనను ఇంటినుంచి పారిపోవటానికి సహాయపడ్డ అమ్మాయి గుర్తొచ్చింది. తను మర్చేపోయాడు. ప్రకాశం, తండ్రితోపాటు తను -ఎవరికైనా కృతజ్ఞుడై ఉండాలంటే ఆ పిల్లకే. ఏమయిందో? ఎక్కడుందో? మళ్ళీ ఎప్పటికైనా ఆ పిల్లను చూడగలడా? చూసినా గుర్తించగలడా? ఆ పిల్ల కూడా దాదాపు అంతే వయస్సులో ఉండవచ్చును. అప్రయత్నంగానే గౌరి ముఖంలోకి దీక్షగా చూశాడు. ఆ అమ్మాయి పోలికలున్నట్లనిపించింది. మళ్లీ అంతలోనే తను భ్రమపడుతున్నాననుకున్నాడు.     

 

    ఈ అమ్మాయిని తను ఎలాగయినా వదిలించుకోవాలి. ఇది ఏనాటి ఋణమో? కొందరు జీవితంలో చాలా చిత్రంగా తటస్థపడుతుంటారు. మల్లెతీగలా కాళ్ళకు చుట్టుకుంటారు. అది వదలదు. మనం దాన్ని నిర్దయగా తెంచివేసి ముందుకు సాగనూలేము. ఇలాంటి సంఘటనే ఏ సినిమాలోనో చూసి లేక ఏ కథలోనో చదివి అసందర్భంగా ఉంది అనుకొని ఉండేవాడు తను. కాని ఇప్పుడు తన జీవితంలోనే జరిగింది. మానవుని జీవితంలో అతని ప్రమేయం లేకుండానే, ఊహించనివీ, ఆశించనివీ, అసందర్భంగా జరుగుతూనే ఉంటాయి.  

 

    అర్ధగంటలో స్నానం ముగించుకుని ముస్తాబయి బయలుదేరుతున్న చంద్రం దగ్గరకు వచ్చి "ఎక్కడకూ?" అంది గౌరి భయపడుతూ.

 

    "భయపడకు, నిన్నుకూడా తీసుకెళ్తాలే" అన్నాడు చంద్రం నవ్వుతూ.

 

    "ఎక్కడికీ?" ఈసారి కొంచెం చనువుతీసుకుంటూనే అడిగింది.

 

    గౌరి చక్రాల్లాంటి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి.

 

    "ఆ ముఖానికున్న పౌడరు కొంచెం తుడుచుకొని బయలుదేరు," అన్నాడు.

 

    గౌరి సిగ్గుపడుతూ గబగబా తుడుచుకుంది. "మీకు శరణాలయంలో పౌడరు కూడా కొనిపెడతారా?" అడిగాడు చంద్రం.

 

    "ఊహుఁ" గౌరి తల అడ్డంగా తిప్పింది.

 

    "మరి నీకు ఈ పౌడరు ఎక్కడనుంచి వచ్చింది?"

 

    "రాజి ఇచ్చింది?"

 

    "రాజి ఎవరు?"

 

    "నీకు తెలవదులే. మా శరణాలయంలోనే ఉండేది."

 

    "ఇప్పుడు లేదా అక్కడ?"  

 

    "వెళ్ళిపోయింది రంగయ్యతో. పది రోజులయింది. రాత్రిపూట గోడదూకి పారిపోయింది. నేనే సహాయం చేశాను. రాజికి రంగయ్యే మా మేట్రమ్మ చూడకుండా పౌడరు తెచ్చిపెట్టాడు. అందులో కొద్దిగా నాకిచ్చింది." అమాయకంగా చిన్నపిల్లలా చెప్పుకుపోసాగింది.

 

    "రంగయ్య ఎవరు? అతనితో ఎందుకు వెళ్ళిపోయింది?"

 

    "వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారుగా? అందుకే వెళ్ళిపోయింది!" అమాయకంగా కళ్ళు మెరిపిస్తూ అంది.

 

    చంద్రం ఆ అమ్మాయి అమాయకత్వం చూసి జాలిపడ్డాడు. విజ్ఞాన వికాసాలు ఇవ్వలేని శరణాలయాలు ఎందుకో!

 

    గౌరి ఏదో చెబుతూనే ఉంది. ఆమె మాటల్లో ఎన్నో పేర్లు వచ్చాయి. కాని చంద్రం మానసికంగా అన్నీ వినేస్థితిలో లేడు.

 

    తాళం వేసి రోడ్డుమీదకు రాగానే జట్కా దొరికింది.

 

    జట్కాలో కూర్చున్న చంద్రాన్ని ఎన్నో ఆలోచనలు చుట్టివేశాయి. గౌరిలాంటి పిల్లలూ, రాజిలాంటి పిల్లలూ ఉండటానికి ఎవరు కారకులు?    

 

    జట్కా ఒక హోటల్ ముందు ఆగింది. చంద్రం జట్కా దిగి గబగబా నడుస్తున్నాడు హోటల్లోకి; గౌరి తనకేమీ కాదని అందరూ అనుకోవాలన్నట్లు. గౌరితో హోటల్లోకి పోవాలంటే చచ్చేంత సిగ్గుగా వుంది.

 

    గౌరి హోటలు భోజనం తినే తీరుచూస్తే ఆ మాత్రం భోజనం ఆమె జన్మలో తినివుండదనిపిస్తుంది. చంద్రానికి జాలితో హృదయం కరిగిపోయింది.   

 

    భోజనం చేస్తున్నంతసేపూ గౌరి తన స్నేహితురాళ్ళను గురించీ, శరణాలయం భోజనం గురించీ ఏమేమో చెబుతోంది. చంద్రం దగ్గిర చనువు తీసుకోవటానికి గౌరికి ఎంతోసేపు పట్టలేదు. గౌరికి వయసు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలున్నా, మానసికంగా పన్నెండూ - పదమూడు సంవత్సరాల వయస్సుకంటే పెరగలేదనుకున్నాడు.  

 

    భోజనం కాగానే జట్కా ఎక్కారు.

 

    "ఏ సినిమాకు?" ఉత్సాహంగా అడిగింది గౌరి.

 

    "దేనికి వెళదాం?" ముందు ఉలిక్కిపడి, మళ్ళీ అంతలోనే తమాయించుకొని అడిగాడు చంద్రం.

 

    "జింబో." తడుముకోకుండా గబుక్కున అనేసింది. చంద్రం ఫక్కున నవ్వాడు. గౌరి కోపంతో మూతి సున్నాచుట్టింది. 'కోపంలో బలేగా ఉందిలే' అనుకున్నాడు చంద్రం.

 

    జట్కా శరణాలయం ముందు ఆగింది. గౌరి అది చూసి ఏడుపు ముఖం వేసింది. చంద్రం జట్కాదిగి గౌరిని దిగమన్నాడు. దిగనన్నది. గేటులో ఉన్న గూర్ఖా గౌరినిచూసి గబగబా జట్కా దగ్గరకు వచ్చాడు.

 

    "మీరు లోపల కెళ్ళండి బాబూ! దీన్ని నేను తీసుకొస్తాగా" అన్నాడు గూర్ఖా.

 

    చంద్రం గేటుదాటి లోపలికి రెండు అడుగులు వేశాడోలేదో గౌరి జట్కా దిగి, తనను పట్టుకొన్న గూర్ఖావాడు చెయ్యి పట్టుకు కొరికింది. వాడు 'అయ్యబాబోయ్' అని చెయ్యి లాక్కోవటమే తడవుగా గౌరి మెరుపులా పారిపోయింది.

 

    చంద్రం తెల్లబోయి చూశాడు. "అది అంతే బాబు, మా రాలుగాయి గుంట, ఎవరికీ భయపడదు. నిన్నననంగా పారిపోయింది. ఇప్పటి కప్పుడే ఎన్ని రుచులు మరిగిందో! ఇంకా ఇక్కడ వుంటదా అది? మీ పిచ్చి కాకపోతే" అన్నాడు గూర్ఖావాడు, గౌరి కరచినచేతిని చూసుకుంటూ కసిగా. చంద్రానికి గూర్ఖావాడి మెడ నులిమేయాలన్నంత కోపం వచ్చింది. గబగబా వెళ్ళి జట్కా ఎక్కి, ఏలూరురోడ్డులో కృష్ణా టుబాకో కంపెనీకి పోనియ్ అన్నాడు.   

 

    ఏమిటో ప్రపంచం! వంటరిగా ఉన్న ఆడపిల్లను చూసి, చదువుకున్నవాడూ, చదువు లేనివాడూ, ఆడదీ, మగాడూ, అందరూ ఒకేలా ఆలోచిస్తారు. ఏ నాటికో స్త్రీకి ఈ దేశంలో నిజమైన గౌరవం లభించేది?   

 

    అంతలో గౌరిమీద పుట్టెడు కోపం వచ్చింది. తన బాధ్యతను తను నిర్వహించటానికి ప్రయత్నించాడు. అంతే! ఆ బజారు పిల్లకోసం తను బాధపడటం అనవసరం అని సర్దిచెప్పుకోవటానికి ప్రయత్నించాడు. కాని మనస్సులో ఎక్కడో అశాంతిగానే ఉంది.  

 

    జట్కా ఓ రెండంతస్తుల భవనం ముందు ఆగింది.

 

    "ఇక్కడాపావేం?" అన్నాడు చంద్రం యధాలాపంగా.

 

    "మీరు చెప్పిన కంపెనీ ఇదే బాబూ!" అన్నాడు జట్కావాడు.

 

    చంద్రం ఆశ్చర్యంగా చూశాడు - ఆ పెద్ద భవనంకేసి.

 

    "కృష్ణా టుబాకో కంపెనీ" అనే పెద్దసైజు సైన్ బోర్డు కొట్టవచ్చినట్లు కనిపించింది.

 

    ఆ భవనం, ఆ బోర్డూ, ఈ ఏడు సంవత్సరాల్లో కృష్ణారావు ఎంత సంపాదించాడో కాస్త అటూ ఇటూగా చెబుతూనే ఉన్నాయి. చంద్రానికి వెంటనే ప్రకాశం తండ్రి చెప్పిన కథ గుర్తుకొచ్చింది. ప్రకాశం ఇల్లు కళ్ళముందు కదిలింది. గుండెల్లో ఎక్కడో ఏదో గ్రుచ్చుకున్నట్లనిపించింది.    

 

    జట్కావాడికి డబ్బులిచ్చి ఆ పెద్ద గేటును దాటి భవంతిలో ప్రవేశించాడు. ఇంతకు ముందుకంటే ఆఫీసులో కార్యకర్తలు ఎక్కువే వున్నారనుకున్నాడు. ప్రొప్రయిటర్ గది మేడమీద ఉన్నదని తెలుసుకొని గబగబా పైకి ఎక్కాడు. ఇంతకాలం తరవాత అన్నను చూడాలనే ఆదుర్దా ఎంత అణుచుకున్నా అతనిలో పొంగి వస్తూనే ఉంది. ఎలాంటి వాడయితేనేం అతను తన అన్న. అందుకేనేమో మరి రక్తసంబంధం అంటారు.    

 

    ప్రొప్రయిటర్ రూమ్ లోకి ప్రవేశించబోతున్న చంద్రాన్ని ప్యూన్ అడ్డగించి చేతికి కాగితం ముక్క అందించాడు. చంద్రం పేరురాసి ఆ చీటీని ఆ ఫ్యూన్ కు అందించాడు. ఫ్యూను లోపలకు వెళ్ళాడోలేదో కృష్ణారావు గబగబా బయటకు వచ్చి అమాంతం చంద్రాన్ని కౌగిలించుకున్నాడు.

 

    "వచ్చావా చంద్రం! ఎంత మారిపోయావురా? నా కంటే ఓ గుప్పెడు పెరిగావు. ఇంతకాలం మమ్మల్ని వదిలి ఎలా ఉండగలిగావురా! కనీసం నీవు ఎక్కడ ఉన్నదయినా ఓ ముక్క రాయకూడదా ?" ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ గబగబా అనేశాడు కృష్ణారావు. తమ్ముడి చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళాడు. వాకిట్లో ఫ్యూన్ శిలాప్రతిమలా నిలుచుండిపోయాడు.