Brahmamudi: రెండు కోట్లకి స్కెచ్ వేసిన రుద్రాణి.. ధాన్యలక్ష్మిని బలిపశువుని చేస్తారా!
on Dec 10, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-589లో.. కావ్య కిచెన్ లో నేలమీద పడుకోవడం చూసిన అపర్ణ.. రాజ్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళమంటుంది. ఇక ఏం చేయలేక గదిలోకి కావ్యని రమ్మంటాడు రాజ్. తీరా కావ్య గదికి వెళ్లేసరికి రాజ్.. బెడ్ మధ్యలో ప్లాస్టర్ వేస్తూ ఉంటాడు. కావ్య దాన్నే చూస్తూ.. ఏంటండీ ఇది అని అడుగుతుంది. ఇది ఒక గీత అని రాజ్ అనగా.. ఏంటీ గీతా? ఎందుకింత రోత.. నా తలరాత.. నా గుండె కోత అని కావ్య అంటుంది. హలో హలో ఇది రాజ్ రేఖ.. ఈ గీత దాటి నువ్వు ఇటు పడుకోకూడదు.. నేను అటు రాను.. హేయ్ మా మమ్మీ చెప్పింది.. నీకు నా గదిలో స్థానం ఇవ్వమని.. మా మమ్మీ మాట కాదనలేను. ఆ సగం నీకు ఈ సగం నాకు.. నా భాగంలోకి రాకు అనేసి రాజ్ వాటర్ తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. మీరు ఇంతగా బాధపడి ఇబ్బంది పడి కష్టపడి గీత గీయాల్సిన అవసరం ఏం లేదు.. మీరు మనస్పూర్తిగా నన్ను భార్యగా ఒప్పుకున్నరోజే నేను ఈ రెండు ముక్కల బెడ్ మీద పడుకుంటానని కావ్య శపథం చేసి మరీ.. చాప, దిండు తెచ్చుకుని కింద వేసుకుని పడుకుంటుంది. హమ్మయ్యా.. సరే అయితే నేను పిలిచే వరకూ నా బెడ్ ఎక్కకని రాజ్ అంటాడు. అంటే ఏదో ఒకరోజు పిలుస్తారని కావ్య అనగానే.. అంతలేదు. కలలు కనకుండా పడుకో అనేసి రాజ్ కళ్లుమూసుకుంటాడు.
రుద్రాణి దగ్గరికి రాహుల్ వస్తాడు. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావ్ అంటాడు. ప్లాన్ బీ సెట్ చేశానురా.. రేపు నువ్వు రాజ్ దగ్గరకు వెళ్లి.. కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను రెండు కోట్లు కావాలి సైన్ చేయమని అడుగమని రాహుల్ అంటుంది. మమ్మీ.. నిద్రలేమితో నీకు బుర్ర పోయినట్లు ఉంది.. రెండు కోట్ల చెక్ రాసి ఇవ్వమంటే రాజ్ ఎందుకు సంతకం చేస్తాడని రాహుల్ అంటాడు. ఓరినా పిచ్చి సన్.. వాడు సంతకం పెట్టకపోవడమే రా మనకు కావాల్సింది. నిన్ను నమ్మి నేనే డబ్బులు ఇవ్వను అలాంటిది రాజ్ ఎందుకు ఇస్తాడు. ఇవ్వడు కానీ.. ఇవ్వకపోవడమే మనకు కావాలి. మనం అదే చెక్ తీసుకెళ్లి ధాన్యలక్ష్మిని రెచ్చగొడతాం.. ఇగో దెబ్బ తింటే ధాన్యలక్ష్మి ఆస్తి కావాలని గొడవ చేస్తుంది. మన టార్గెట్ అది అని మొత్తం వివరంగా చెప్తుంది రుద్రాణి.
ప్లాన్ ప్రకారం రాజ్ దగ్గరకు చెక్‌తో వెళ్తాడు రాహుల్. రెండు కోట్లా ఎందుకని రాజ్ అడుగుతాడు. ఇది నీకొచ్చిన ఆలోచనేనా.. లేక రుద్రాణి మాయా అని ప్రకాశం అని అడుగుతాడు. నిన్ను నమ్మి అంత డబ్బు ఇవ్వడం కుదరదనేదాకా మెట్ల మీద ఉండి చూస్తున్న రుద్రాణి రంగంలోకి దిగుతుంది. వాడు మారతాననేగా అడుగుతున్నాడు. మాకు ఈ ఇంట్లో ఆ మాత్రం విలువ లేదా అంటూ గొడవ చేస్తుంది. అయిన సరే రాజ్ ఇవ్వనంటాడు. కాసేపటికి రాహుల్, రుద్రాణీలు. అనుకున్నట్లే ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి.. నువ్వే గతి.. నువ్వే మాకు 2 కోట్లు ఇప్పించాలి.. అలా ఇప్పిస్తే ఈ కొత్త బిజినెస్‌లో కళ్యాణ్ ని కూడా పార్టనర్‌ని చేస్తాం.. మనం కూడా ఎదగొచ్చు.. ఆస్తులు కూడగట్టుకోవచ్చంటూ ఆశ చూపిస్తారు. రాజ్ నీ మాట కూడా వినడేమో.. నీకు కూడా నో చెబుతాడేమో అంటూ రాజ్ ని బాగా రెచ్చగొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read