ప్రేమపెళ్లి చేసుకుందని కూతుర్ని దూరంగా పెట్టిన తండ్రి.. ఆ ఇద్దర్నీ కలిపిన బిగ్ బీ!
on Oct 19, 2021
రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తాను బిగ్ బీనేనని పలుమార్లు నిరూపించుకున్న అమితాబ్ బచ్చన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కొంత కాలంగా మాటలు లేకుండా దూరంగా గడుపుతున్న తండ్రీకూతుళ్లను కలిపారు. ఈ సంఘటన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 13 ఎపిసోడ్లో చోటు చేసుకుంది. సోమవారం ప్రసారమైన ఎపిసోడ్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న భాగ్యశ్రీ తయడే అనే యువతి మాటల సందర్భంగా తను లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో, తనతో మాట్లాడేందుకు తండ్రి నిరాకరిస్తూ వస్తున్నాడని అమితాబ్‌తో చెప్పింది. అంతే కాదు, ఇటీవల తనకు పుట్టిన పాపను చూడ్డానికి కూడా ఆయన రాలేదని బాధపడింది.
ఆమె కథ విని చలించిపోయిన అమితాబ్, కెమెరా వంక చూస్తూ తండ్రికి ఏదైనా చెప్పమని, ఆయన ఈ షో చూస్తుండి ఉండవచ్చని చెప్పారు. కళ్ల వెంట నీళ్లు కారుతుండగా, తండ్రికి క్షమాపణలు చెప్పింది భాగ్యశ్రీ. వెంటనే ఆమెను ఆశ్చర్యపరుస్తూ, ఆమె తండ్రి ఫోన్లో లైన్లో ఉన్నాడని చెప్పారు అమితాబ్. అలా తండ్రీకూతుళ్లు ఫోన్లో మాట్లాడుకునేట్లు చేశారాయన. తమ మధ్య కొంత కాలంగా మాటలు లేకపోయినా, తన ఆశీస్సులు ఆమెకెప్పుడూ ఉంటాయని కూతురితో భాగ్యశ్రీ తండ్రి చెప్పారు. ఆమె భర్త గురించి ఆరా తీసి, అతనిని అడిగినట్లు చెప్పమన్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతమైన మనసుతో గేమ్ ఆడమని కూతురికి సూచించారు.
ఫోన్లో తండ్రి తనతో మాట్లాడటంతో ఆనంద బాష్పాలు రాల్చిన భాగ్యశ్రీ, 'కేబీసీ'లో పాల్గొనడం వల్లే తండ్రితో మళ్లీ మాట్లాడగలిగానని చెప్పింది. ఈ షో తనకు చాలా ఇంపార్టెంట్ అనీ, తను తొమ్మిది నెలల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కేబీసీ కోసం పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చాననీ వెల్లడించింది. ఈ షోలో రూ. 12.5 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది భాగ్యశ్రీ.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
