
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో, లార్జర్ ద్యాన్ లైఫ్ విజువల్స్‌తో వచ్చే సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక విజువల్ వండర్, మిస్టరీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విరాట్ కర్ణ (Virat Karrna). ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' (Nagabandham). ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విరాట్ కర్ణ తెలుగువన్‌తో ముచ్చటించి, సినిమాకు పడిన కష్టం, ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
కెరీర్ బిగినింగ్‌లోనే, అది కూడా కేవలం రెండో సినిమాకే ఇంతటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఈ సినిమా కోసం విరాట్ ఏకంగా రెండేళ్ల పాటు వేరే ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోకుండా దీనిపైనే పూర్తి శ్రద్ధ పెట్టారు. కథ విన్నప్పుడే ప్రేక్షకులకు ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించవచ్చనే నమ్మకంతో ఈ సినిమాను ఎంచుకున్నట్లు విరాట్ తెలిపారు. ఈ చిత్రంలో తన లుక్ కోసం సుమారు ఆరు నెలల పాటు కఠినమైన వర్కవుట్లు చేసి ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సాధించానని, జీరో కార్బ్స్ డైట్ పాటిస్తూ షూటింగ్ చేయడం మానసికంగా పెద్ద టాస్క్ అని ఆయన పేర్కొన్నారు.
అనంత పద్మనాభ స్వామి దేవాలయం, దాని వెనుక ఉన్న రహస్యాలు, నిధుల బంధనం చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ మైథాలజీ అడ్వెంచర్ ఇది. సినిమాలో విరాట్ కర్ణ 'రుద్ర' అనే నాగసాధు తరహా పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మేకప్ కోసమే ప్రతిరోజూ ఉదయం 2 గంటలకే నిద్రలేచి 6 నుండి 7 గంటల పాటు సమయం కేటాయించాల్సి వచ్చేదని హీరో వెల్లడించారు. హైదరాబాద్ చలిలో 200 అడుగుల ఎత్తులో రోప్స్ సహాయంతో చేసిన నైట్ షూట్స్, కేరళలోని దట్టమైన అడవుల్లో చేసిన యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా 30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా చేసిన నైట్ షూట్ క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు గతంలో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆడియన్స్ పల్స్ బాగా తెలుసని, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన అవుట్‌పుట్ తెచ్చారని విరాట్ కొనియాడారు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయినప్పటికీ, ఫస్ట్ షెడ్యూల్ అవుట్‌పుట్ చూసి నిర్మాతలు నిశిత, కిషోర్ గార్లు సినిమాకు ఏం కావాలో అవన్నీ వెనుకాడకుండా సమకూర్చారని చెప్పారు. కళా దర్శకుడు అశోక్ అద్భుతమైన సెట్ డిజైన్స్, డీటైలింగ్ సినిమాకు ప్రాణం పోశాయని ప్రశంసించారు.
ఈ సినిమాలో విరాట్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె సెట్‌లోకి వస్తే చాలు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, కొత్తవాడైనప్పటికీ తనకు ఎంతో సపోర్ట్ చేసిందని విరాట్ చెప్పుకొచ్చారు. అలాగే ఇందులో విలన్‌గా నటించిన రిషబ్ సాహ్నీ, తనకు మధ్య వచ్చే వన్-టు-వన్ సీన్స్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమన్నారు. స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ ఆధ్వర్యంలో 5000 మంది డాన్సర్లతో చేసిన 'నమోరే' పాటతో పాటు 'సురా సురా' సాంగ్స్ సినిమా స్పాన్‌ను మరింత పెంచాయని పేర్కొన్నారు.
సినిమాకు హెవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ఉండబోతోందని, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ నచ్చేలా, ముఖ్యంగా ఇండియన్ కల్చర్‌ను ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉంటుందని విరాట్ కర్ణ నమ్మకం వ్యక్తం చేశారు. జూలై 2న ప్రీమియర్స్, జూలై 3న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కేరళలో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. వారణాసిలో గ్రాండ్‌గా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఈ సరికొత్త అడ్వెంచర్‌ను ఎక్స్పీరియన్స్ చేసి ఆశీర్వదిస్తారని ఆశిద్దాం.





