
టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ చిత్రాలలో 'సింహాద్రి' ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సంచలన చిత్రం నందమూరి అభిమానులకే కాకుండా సగటు సినీ ప్రియులకు సైతం పూనకాలు తెప్పించింది.
అయితే, వెండితెరపై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా తెరవెనుక అనేక నాటకీయ పరిణామాలు, సవాళ్లు చోటుచేసుకున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో రాజమౌళి దర్శకుడు కాదు అంటే చాలామంది నమ్మకపోవచ్చు. ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు పవన్ శ్రీధర్ అనే మరొక దర్శకుడితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
గ్రాండ్‌గా ముహూర్తం జరుపుకోవడమే కాకుండా, ఏకంగా 2 పాటలు, కొంత టాకీ పార్ట్ చిత్రీకరణ కూడా పూర్తి చేసేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సడన్‌గా ఆగిపోయింది. తీసిన రెండు పాటలు, టాకీ సీన్ల ఫుటేజ్‌ను పక్కన పెట్టేసి, చిత్రీకరణను పూర్తిగా రద్దు చేశారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ సూచన మేరకు, ఆయనతో 'స్టూడెంట్ నంబర్ 1' చేసిన రాజమౌళి చేతికి ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు వచ్చాయి. అలా ఫ్రెష్‌గా రాజమౌళి పగ్గాలు చేపట్టడంతో 'సింహాద్రి' ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది.
ప్రాజెక్ట్ రాజమౌళి చేతికి వచ్చిన తర్వాత కథా చర్చల్లో దర్శకుడికి, ఆయన తండ్రి, స్టార్ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కి మధ్య తీవ్రమైన అంతర్మథనం, అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నాయి. వందలాది మంది ప్రజల ప్రయోజనాలు, ఊరిని కాపాడటం కోసం ఒక మంచి వ్యక్తిని చంపాల్సి వస్తే అది తప్పవుతుందా అనే సూత్రం చుట్టూ కథను తిప్పడంపై రాజమౌళికి, విజయేంద్ర ప్రసాద్‌కి మధ్య సుదీర్ఘమైన కసరత్తు సాగింది.
సినిమాలో భానుచందర్ పోషించిన మంచి క్యారెక్టర్‌ను ఎన్టీఆర్ పాత్ర చంపేసే సన్నివేశం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? కథలో ఆ చంపడాన్ని ఎలా జస్టిఫై చేయాలి? ఆ తర్వాత సదరు వ్యక్తి కుమార్తెను హీరో కాపాడుకుంటూ రావడం, ఆమెకు నిజం ఎలా అర్థమవుతుంది అనే విషయాలపై పేపర్ మీద తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ పాయింట్ విషయంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు, ఆన్ స్క్రీన్ ఎలాంటి గందరగోళం రాకూడదని భావించి సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు.
తెరపై దర్శకుడు నమ్మిన ఎమోషన్‌ను అత్యంత రూటెడ్‌గా చూపిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకంతో రాజమౌళి ముందుకు సాగారు. చిన్నపిల్లలా అమాయకంగా ఉండే హీరోయిన్, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో హీరోనే గునపంతో పొడిచే సంచలన ట్విస్ట్ సృష్టించడం ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సరైన స్క్రీన్ ప్లే, బలమైన ఎమోషనల్ డ్రైవ్ ఉండటం వల్లే ఆ షాకింగ్ ట్విస్ట్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
ఆన్ పేపర్ ముందే అన్ని సందేహాలు నివృత్తి చేసుకుని, కథపై, పాత్రలపై పూర్తి విశ్వాసంతో పనిచేయడం వల్లే 'సింహాద్రి' లాంటి అద్భుతమైన ఇండస్ట్రీ హిట్ సాధ్యమైంది. క్రియేట్ డిఫరెన్స్ లను ముందే పరిష్కరించుకుని, నమ్మిన కథను నిజాయితీగా తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని ఏ శక్తీ ఆపలేదనడానికి 'సింహాద్రి' సినిమా ప్రత్యక్ష నిదర్శనం.
NTR, SS Rajamouli, Simhadri, Unknown Facts, Tollywood




