Home

»

Exclusive Movie News

తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు ఎలా తగులుతాయో చూడండి.!

Jul 22, 2026 4:36PM

సమాజంలో లంచగొండితనం, అవినీతి, దళారీ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయాయో, అలా సంపాదించిన పాపపు సొమ్ము మనుషుల జీవితాలను ఎలా నాశనం చేస్తుందో చాటిచెప్పే భావోద్వేగపూరితమైన సన్నివేశం ఇది. ఈ కథనంలో మధ్యవర్తిగా చలామణి అవుతూ గణపతి అనే వ్యక్తి సమాజంలో అమాయకులను, ఆఖరికి తనను చదివించిన గురువును కూడా ఎలా వంచించాడో చూస్తే గుండె తరుక్కుపోతుంది. దాదాపు 30 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా సేవలు అందించి, దేశానికి ఎందరో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను తయారుచేసిన ఆ వృద్ధ గురువు, తన రిటైర్మెంట్ పెన్షన్ కోసం 5 ఏళ్లుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో చివరికి ఈ గణపతిని ఆశ్రయిస్తాడు. అయితే గురువుకు రావలసిన హక్కును కూడా అవినీతి మార్గంలో, చెక్కు రూపంలో ఇప్పించడంతో ఆత్మగౌరవం దెబ్బతిన్న గురువు "30 ఏళ్ల నీతివంతమైన ఉద్యోగానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం కాదిది, అవినీతికి లొంగి బతికేకంటే విషం తాగి చావడం మేలు" అని తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. సమాజంలో బ్రోకర్లు ఎలాంటి సెంటిమెంట్లు లేకుండా జనాన్ని పీల్చి పిప్పిచేస్తున్న వైనాన్ని ఈ సంఘటన ప్రతిబింబిస్తుంది.

మరోవైపు ఆషాఢ మాసం ఆఫర్ల పేరిట కిలో చీరలు కొంటే అరకిలో చీరలు ఉచితం అంటూ కాసమ్ ఫ్యాషన్స్ ప్రకటనలు వస్తున్న తరుణంలో, గణపతి కుటుంబం షాపింగ్ కోసం బయలుదేరుతుంది. డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేషనల్ అవార్డు సాధించిన తన ముద్దుల కొడుకు సిద్ధుని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతూ కళానికేతన్ షోరూమ్‌కు వెళ్తారు. అధికారం చేతిలో ఉందనే ధీమాతో, ప్రిన్సిపాల్ సెక్రటరీ గారి భార్య కోసం రూ. 4,07,000 విలువైన ఖరీదైన చీరను సెలెక్ట్ చేసి, తన అవినీతి సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిఫలంగా లంచంగా ఇస్తారు. ఎదుటివాడి సొమ్ము, ప్రజల రక్తాన్ని పిండి సంపాదించిన డబ్బే కదా అనే నిర్లక్ష్యంతో వేలల్లో, లక్షల్లో లంచాలు ఇస్తూ, దళారీ వ్యవస్థ ద్వారా కోట్లు వెనకేస్తారు. అక్కడ రూ. 4,07,000 బిల్లు కడుతున్న ఆ క్షణంలోనే విధి తన ఘోరమైన నాటకాన్ని ప్రారంభిస్తుంది. బయట ఆడుకుంటున్న చిన్నారి సిద్ధు, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మించిన ఫ్లైఓవర్ హఠాత్తుగా కూలిపోవడంతో ఆ ప్రమాదంలో దుర్మరణం చెందుతాడు.

సొంత కొడుకు మరణ వార్త విన్న గణపతి ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ప్రమాదానికి కారణమైన జోమన్ ఇండియా కాంట్రాక్టర్ ప్రతినిధులు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు, కేవలం 10 లక్షల రూపాయల పరిహారంతో కేసును క్లోజ్ చేయాలని చూస్తారు. విపక్ష నాయకుడు నారాయణరెడ్డికి కూడా 10 లక్షలు ఆఫర్ చేసి ఆందోళనలు ఆపాలని ప్రయత్నిస్తారు. కానీ చనిపోయింది వేరెవరో కాదు, స్వయంగా దళారీ గణపతి కొడుకే అని తెలిసినప్పుడు ఆ నాయకుడు కూడా షాక్ అవుతాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నాసిరకం నిర్మాణాలకు పర్మిషన్లు ఇప్పించి, అధికారులకు లక్షల్లో లంచాలు ఇప్పించిన గణపతికి, తాను చేసిన పాపమే తన కంటిపాపను బలితీసుకుంది అనే చేదు నిజం ఆలస్యంగా బోధపడుతుంది.

ఇంకోవైపు, మర్డర్ కేసులు మాఫీ చేయిస్తానని, రిజిస్ట్రార్లకు 10 లక్షలు ఇప్పించి పనులు పూర్తి చేస్తానని చెప్పి లక్షలాది రూపాయల బ్రోకర్ ఫీజులు నమిలేసిన గణపతి ప్రవర్తనతో బాధితులు శాపనార్థాలు పెడతారు. జనుల సొమ్ముతో కడుపు పెంచుకుని, అక్రమ సంపాదనతో తింటున్న అన్నాన్ని చూసి "మీరు చేసిన పాపపు సొమ్మును మీరే తినండి" అని ఘోరమైన మానసిక వేదనను అనుభ‌విస్తుంది గ‌ణ‌ప‌తి భార్య‌. తల్లిదండ్రులు చేసే అక్రమాలు, అవినీతి పాపాలు ఆఖరికి అమాయకులైన పిల్లల ప్రాణాల మీదకు ఎలా వస్తాయో ఈ కథనం సమాజానికి కన్నువిప్పు కలిగిస్తుంది. నీతి, నిజాయితీ లేని సంపాదన ఎప్పటికీ శాశ్వతం కాదని, ప్రకృతి కాలక్రమంలో దానికి తగిన శాస్తి చేస్తుందని స్పష్టం చేస్తుంది. ఇలాంటి భావోద్వేగ‌భ‌రిత వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com