
తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో 'బొబ్బిలి పులి' (Bobbili Puli) ఒకటి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR), దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను, సీనియర్ ఎన్టీఆర్ పనితీరును అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ హరిశ్చంద్ర రావు 'తెలుగువన్'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎన్టీఆర్ గారికి సమయపాలన (టైం సెన్స్) అంటే ఎంతో ప్రాణమని, షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కావాల్సిందేనని హరిశ్చంద్ర రావు పేర్కొన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ల వర్క్‌మన్ షిప్‌ను ఎన్టీఆర్ గారు చాలా నిశితంగా గమనించేవారని, సెట్‌లో ఎవరు సిన్సియర్‌గా పనిచేస్తున్నారు, ఎవరు టైంపాస్ చేస్తున్నారనేది ఆయన కనిపెట్టేసేవారని చెప్పారు. 'బొబ్బిలి పులి' క్లైమాక్స్ సీన్ చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను ఆయన వివరించారు. సాధారణంగా దాసరి నారాయణరావు గారికి సీన్లు ముందే ఇంట్లో కూర్చొని రాయడం అలవాటు లేదు. ఆయన షూటింగ్ స్పాట్‌కు వచ్చిన తర్వాత, అక్కడ ఉన్న సెట్‌ను చూసి, ఆ మూడ్‌లోకి వెళ్లి అక్కడికక్కడే డైలాగులు రాసేవారు. ఒకరోజు క్లైమాక్స్ సీన్ కోసం ఎన్టీఆర్ గారు కరెక్ట్ టైమ్‌కి సెట్‌కి వచ్చేశారు. కానీ దాసరి గారు అప్పటికప్పుడు సీన్ రాయడం మొదలుపెట్టారు. అన్నగారు అంతటి పెద్ద స్టార్‌ను అక్కడ ఖాళీగా కూర్చోబెట్టడంతో ప్రొడ్యూసర్లు, మిగతా యూనిట్ సభ్యులు తీవ్ర టెన్షన్ పడ్డారు.
ఎన్టీఆర్ గారు కూడా కొంత అసహనానికి లోనై, అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హరిశ్చంద్ర రావును పిలిచి "ఏం జరుగుతోంది?" అని అడిగారు. అప్పుడు హరిశ్చంద్ర రావు చాలా చాకచక్యంగా సమాధానం చెప్తూ... "సార్, దర్శకుడు గారు మీకోసం క్లైమాక్స్ సీన్ ముందే రాసుకొచ్చారు. కానీ ఒక ఆర్మీ ఆఫీసర్‌గా సమాజ బాధ్యతతో మీరు చెప్పే డైలాగులు ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాలని, మీ స్థాయికి ఆ సీన్ చాలదనిపించి ఆయన మళ్లీ మరింత పవర్‌ఫుల్‌గా రాస్తున్నారు" అని చెప్పారు. దాంతో అన్నగారు పూర్తిగా శాంతించి, ఆ తర్వాత దాసరి గారు రాసిన సీన్ విన్నాక ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఆ అసహనాన్ని పూర్తిగా మర్చిపోయారు. దర్శకుడి భావాలకు అనుగుణంగా, నటీనటుల మనస్తత్వాలను బట్టి ఎలా వ్యవహరించాలో అసిస్టెంట్ డైరెక్టర్లకు ఇదొక గొప్ప శిక్షణ అని ఆయన అన్నారు.
ఈ సినిమా క్లైమాక్స్ సమయంలోనే ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ఒక బలమైన పునాది పడిందని హరిశ్చంద్ర రావు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మినిస్టరీ తీసేశారు. క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్.. హరిశ్చంద్ర రావును పిలిచి, తాను ఒకరోజు అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లి వస్తానని దాసరికి చెప్పమన్నారు. దాసరి కూడా సరే అని చెప్పి జడ్జ్ షాట్స్, లాయర్ షాట్స్ లాంటి ఇతర సీన్లు తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ వెళ్లిన ఎన్టీఆర్, సాయంత్రానికి సెట్స్‌కు తిరిగి వచ్చేసరికి తీవ్రమైన ఆవేశంతో, ఎమోషనల్‌గా కనిపించారు. ఆ తర్వాతే సినిమాలో కోర్టు హాల్‌లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ సీన్లను షూట్ చేశారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి రావాలనే బలమైన నిర్ణయం (సైకలాజికల్ డెసిషన్) తీసుకుని ఉంటారని, ఆ తర్వాత ఊటీలో సాంగ్ షూటింగ్ సమయంలో దాసరితో "ఇంతకాలం సమయం వేస్ట్ చేశాం, మన ప్రజల కోసం మనం ఏదైనా చేయాలి" అని ఎన్టీఆర్ తన మనసులోని మాటను పంచుకున్నారని హరిశ్చంద్ర రావు వివరించారు.
'బొబ్బిలి పులి' షూటింగ్ లో దాసరి -ఎన్టీఆర్ ల మధ్య ఏం జరిగిదంటే..?




