Home

»

Exclusive Movie News

పాన్ ఇండియా మోజులో టాలీవుడ్ స్టార్ హీరోలు.. బివిఎస్ రవి సంచలన వ్యాఖ్యలు!

May 30, 2026 4:35PM

టాలీవుడ్ స్థాయి ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితమైన తెలుగు సినిమా, నేడు పాన్ ఇండియా మార్కెట్‌ను దాటి గ్లోబల్ వైడ్‌గా తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి (BVS Ravi) తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోల స్టామినా మరియు పాన్ ఇండియా సినిమాల మేకింగ్ విధానంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తెలుగువన్ (TeluguOne) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సినిమా ఇండస్ట్రీలోని ప్రస్తుత ట్రెండ్‌తో పాటు స్టార్ హీరోల డెడికేషన్ గురించి పలు సంచలన విషయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మోజులో పడ్డారని బివిఎస్ రవి వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకమైన సినిమాల కోసం వారు చూపిస్తున్న నిబద్ధత నిజంగా అభినందనీయమన్నారు. ఒక సినిమా కోసం హీరోలు ఏకంగా రెండు సంవత్సరాల పాటు సమయాన్ని కేటాయిస్తున్నారని, పాత్రలకు తగ్గట్టుగా జుట్టు పెంచుకొని, గడ్డాలు పెంచుకుంటూ, మొహానికి బూడిద రాసుకునేందుకు సైతం వెనుకాడటం లేదని ఆయన పేర్కొన్నారు. పాన్ ఇండియా సినిమా అంటే కేవలం భారీ టైటిల్స్ వేయడం మాత్రమే కాదని, వెండితెరపై నటీనటుల ఒళ్లు హూనమైపోయేలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. యాక్షన్ సీన్స్ లో పిల్లిమొగ్గలు వేయిస్తూ, గాలిలో కాసేపు వైర్లతో కట్టేసి ఉంచినా సరే, హీరోలు ఎంతో ఓపికగా కష్టపడుతున్నారని, వారు భోజనానికి వెళ్లే సమయాన్ని కూడా లెక్కచేయకుండా సీన్ పర్‌ఫెక్ట్‌గా వచ్చే వరకు శ్రమిస్తున్నారని వెల్లడించారు.

ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో తనకున్న అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ఇద్దరు అగ్ర హీరోల కాంబినేషన్ లోనూ యాక్టింగ్ చేశానని చెప్పారు. ఒక సినిమాలో బాలకృష్ణ గారు తనను కొట్టే సీన్ ఉందని, ఆ రోజు పొద్దునంతా తనది 'నోటిదూల క్యారెక్టర్' కావడంతో ఆయనను గెలకాల్సి వచ్చిందని, దీంతో తన గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని నవ్వుతూ పంచుకున్నారు. 

అలాగే మెగాస్టార్ చిరంజీవితో నటించేటప్పుడు ఆయన డైలాగ్ చెబితే తాను కౌంటర్ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందని, ఆ సమయంలో కూడా కొంచెం భయపడ్డానని అన్నారు. టాలీవుడ్ లో మోహన్ బాబు కాంపౌండ్, చిరంజీవి కాంపౌండ్, బాలకృష్ణ కాంపౌండ్, అల్లు అర్జున్ కాంపౌండ్ ఇలా అన్ని కాంపౌండ్స్ తోనూ తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, ఎవరి దగ్గరకు వెళ్లినా వారి ప్రైవసీకి గౌరవం ఇవ్వడం వల్లే తనకు ఈ క్రేజ్ దక్కిందని బివిఎస్ రవి స్పష్టం చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'డ్రాగన్' (Dragon) గ్లింప్స్ చూసిన తర్వాత టాలీవుడ్ హీరోల పవర్ ఏంటో అందరికీ అర్థమైందని బివిఎస్ రవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తున్నప్పటికీ థియేటర్లలో సరైన సినిమాలు లేక మల్టీప్లెక్స్‌లలో చాలా షోలు క్యాన్సిల్ అవుతున్నాయని, సింగిల్ స్క్రీన్స్ తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, త్వరలోనే రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఊపు తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com