Home

»

Exclusive Movie News

Samantha: అప్పటి సమంత వేరు, ఇప్పటి సమంత వేరు.. ఈ ఐదేళ్ల కాలంలో జీవితం చాలా నేర్పించింది!

Jun 15, 2026 3:54PM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో, రాజ్ అండ్ డికె నిర్మాణ భాగస్వామ్యంలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తాజాగా రాజ్ నిడిమోరు, నందిని రెడ్డితో కలిసి 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో తన జీవితంలో జరిగిన మార్పులు, ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఈ సినిమా వెనుక ఉన్న శ్రమ గురించి సమంత మనసు విప్పి మాట్లాడారు.

ఈ చిత్రంలో సమంత పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఒక సాధారణ మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూనే, ఊహించని రీతిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో అలరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా చీర కట్టుకుని యాక్షన్ స్టంట్స్ చేయడం ఈ సినిమాకే పెద్ద హైలైట్ అని, ఈ విభిన్నమైన కాన్సెప్ట్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని సమంత నమ్మకం వ్యక్తం చేశారు. రాజ్ స్క్రిప్ట్ డిజైన్ చేసిన విధానం తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ప్రతిరోజూ సెట్స్‌పై ఒక కొత్త సవాలును ఎదుర్కోవడం ఒక నటిగా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించారు.

గడచిన ఐదేళ్ల సమంత ప్రయాణం గురించి నందిని రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఐదేళ్ల కాలంలో సమంత ఎంతో జీవితం చూసిందని, ఒక వ్యక్తిగా ఎంతో మార్చిందని అన్నారు. ఒక్కప్పటి సమంత వేరు, ఇప్పటి సమంత వేరని చెప్పారు. ఈ ఐదేళ్ల కాలంలో సమంతకు జీవితం ఏం నేర్పించిందనేది.. అది ఆమె నటనలో కనిపిస్తుంది అన్నారు.

'మా ఇంటి బంగారం' అనే టైటిల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను రాజ్ ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సమాజంలో ఒక కోడలి నుంచి ఆశించే పద్ధతులు, పర్ఫెక్షన్ అనే అంశాలపై ఒక సున్నితమైన వ్యంగ్యం  ఈ సినిమాలో ఉంటుందని తెలిపారు. సినిమా కథలో భారీ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ, దానికి భిన్నంగా ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ పేరును ఖరారు చేసినట్లు రాజ్ స్పష్టం చేశారు.

సినిమా మేకింగ్ అనేది ఒకరిద్దరిది కాదని, అది అందరి సమిష్టి కృషి అని రాజ్ అభిప్రాయపడ్డారు. దర్శకురాలు నందినీ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ సినిమాను అద్భుతంగా తెరకెక్కించామని అన్నారు.

చివరగా ఈ సినిమా కేవలం ఓటీటీ కోసం కాదని, ఖచ్చితంగా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అని సమంత చెప్పారు. థియేటర్లో వచ్చే మాస్ ఎలిమెంట్స్, కామెడీ టైమింగ్, భారీ యాక్షన్ సీన్లు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఉంటాయని అన్నారు. సమంత కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com